శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులపాటు నిర్వహింపబడే సంక్రాంతి బ్రహ్మోత్సవాలు మూడవనాడైన ఈ రోజు (13.01.2021) శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి. తరువాత యాగశాల యందు శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపించబడ్డాయి. అనంతరం లోకకల్యాణం కోసం జపాలు, రుద్రపారాయణలు, చతుర్వేద పారాయణలు, చేయబడ్డాయి.

ఈ పారాయణలో భాగంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా స్కాందపురాణములోని శ్రీశైలఖండ పారాయణ కూడా జరిపించబడ్డాయి.

తరువాత మండపారాధనలు, పంచావరణార్చనలు,రుద్రహోమం, చండీహోమ కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిపించబడ్డాయి.

అదే విధంగా ఈ సాయంకాలం ప్రదోష కాలపూజలను, హోమాలను జరిపించిన తరువాత జపానుష్టానాలు జరిపించబడ్డాయి..

వాస్తవానికి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలలో గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతున్నది. కానీ కోవిడ్ నివారణ చర్యలలో భాగంగా ఈ సంవత్సరం సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో శ్రీస్వామి అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించే అవకాశం లేదని అధికారులు తెలిపారు.

రావణవాహన సేవ

ఈ బ్రహ్మోత్సవాలలో నిర్వహించబడే వాహనసేవలలో భాగంగా ఈ రోజు సాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్లకు రావణవాహనసేవ జరిపించబడ్డాయి. ఈ సేవలో శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకారమండపంలో రావణవాహనంపై వేంచేపు చేయించి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించబడ్డాయి.

తరువాత ఆలయ ప్రాకారోత్సవం జరిపించబడుతుంది. ఈ ప్రాకారోత్సవములో ఆలయమాడ వీధులలో శ్రీస్వామిఅమ్మవార్ల ఊరేగింపు జరిపించబబడ్డాయి.

రేపటి కార్యక్రమాలు ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు (14.01.2020)న శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషపూజలు, చండీశ్వర పూజ, మండపారాధనలు, పంచావరణార్చనలు, జపానుష్టానాలు, రుద్రహోమం, సాయంకాలం నిత్య హవనాలు, బలిహరణలు మొదలైన కార్యక్రమాలు నిర్వహించబడతాయి.

ఈ ఉత్సవాలలో భాగంగా రేపు సాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్లకు నందివాహనసేవ జరిపించ బడుతుంది.

రేపు బ్రహ్మోత్సవ కల్యాణం

మకర సంక్రాంతి రోజైన రేపు (14.01.2021) రాత్రి బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహించబడుతుంది.

శ్రీశైల మహాక్షేత్రంలో ప్రతిరోజు శ్రీభ్రమరాంబామల్లికార్జనస్వామివార్లకల్యాణం నిర్వహించబడుతుండగా, ఒక్క మకర సంక్రాంతి రోజున మాత్రమే పార్వతీ కల్యాణం జరిపించబడటం విశేషం. ఈ కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయబడుతున్నాయి.

చెంచులకు ప్రత్యేక ఆహ్వానం |

సంక్రాంతి బ్రహ్మోత్సవ కల్యాణానికి గత సంవత్సరం నుండి ప్రత్యేకంగా చెంచు భక్తులను ఆహ్వానించడం జరుగుతోంది. స్థానిక సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐ.టి.డి.ఏ) అధికారుల సహకారంతో చెంచుభక్తులు కల్యాణోత్సవాన్ని వీక్షించే ఏర్పాట్లు చేయబడుతున్నాయి.

కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలలోని సుమారు 150 చెంచుగూడాల నుండి చెంచు భక్తులు ఈ కల్యాణాన్ని తిలకించేందుకు రానున్నారు.

కాగా శ్రీశైల మహాక్షేత్రంలో గాఢమైన సంబంధం గల చెంచు భక్తుల సంస్కృతీ సంప్రదాయాలలో సంక్రాంతి కల్యాణోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

ప్రచారములో వున్న జానపదకథ ప్రకారంగా ఒకసారి అమ్మవారు భూలోకానికి విచ్చేశారు. ఆ సందర్భంలో చెంచులు అమ్మవారిని తమ కన్నబిడ్డగా భావించి ఆదరించారు. అమ్మవారిని వెతుక్కుంటూ స్వామివారు కూడా భూలోకానికి రావడం జరిగింది. అమ్మవారు చెంచుగూడెంలో ఉన్నారనే విషయాన్ని తెలుసుకున్న స్వామివారు చెంచు యువకుడివేషంలో గూడానికి చేరుకున్నారు. అప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి వివాహం చేసుకోవాలనుకున్నారు. కాని వివాహం అయితే అమ్మవారు తమను వదలివెళ్లిపోతుందనే

భావనతో చెంచు పెద్దలు వివాహానికి అంగీకరించలేదు. దాంతో పెద్దలు ప్రమేయం లేకుండానే స్వామివారు అమ్మవారిని సంక్రాంతి రోజున వివాహం చేసుకోవడం జరిగిందట. అందుకే చెంచులు వారి సంప్రదాయంలో సంక్రాంతినాటి వివాహాన్ని “స్వామివారి దొంగపెళ్లి” అని భావిస్తారు.

తరువాత విషయం తెలుసుకున్న చెంచుపెద్దలు అందరి సమక్షములో తిరిగి మహాశివరాత్రిరోజు మరోసారి స్వామి అమ్మవార్లకు వివాహాన్ని జరిపించారు. అది అసలు పెళ్లిగా పిలువబడింది.

ఈ కథ రెండు,మూడు విధాలుగా చెప్పబడుతున్నప్పటికీ ప్రధాన ఇతివృత్తం మాత్రం ఒకే విధంగా ఉండటాన్ని గమనించవచ్చు.

అందుకే ఇప్పటికీ చెంచులు శ్రీశైల భ్రమరాంబను తమ కూతురిగా శ్రీ మల్లికార్జున స్వామివారిని తమ అల్లునిగా భావిస్తారు. అదే విధంగా స్వామివారిని చెంచుమల్లన్న, చెంచుమల్లయ్య అని ఆప్యాయంగా పిలుచుకుంటారు.

కాగా ఆలయ ప్రాకార కుడ్యంపై ఒక అటవిక యువతి కాలిలో గ్రుచ్చుకున్న ముల్లును ఒక అటవిక యువకుడు తీస్తున్నట్లుగా మలచబడిన శిల్పం ఈ జానపద కథకు బలాన్ని చేకూరుస్తోంది. ఈ శిల్పంలోని అటవిక యువకుడే చెంచుల వేషంలో ఉండే మల్లికార్జునస్వామి అని చెంచు భక్తులు భావిస్తారు.

Print Friendly, PDF & Email
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *