Breaking News

Arts and Culture, Festivals and Traditions, General News - ఇతర వార్తలు మిత్రులు, శ్రేయోభిలాషులందరికి భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు – Kalavaibhavam.com

Tuesday 18 - 01 - 2022

14-Nov-2020: స్వర రాగ గీతంలో భక్తి పారవశ్యంలో పరవశింపచేసిన ధీర “శంకరాభరణం” రాగాలాపన – స్వర వేదిక, కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సంస్థలు సంయుక్తంగా సమర్పించిన “శంకరాభరణం” రాగం పార్ట్-1, ఎపిసోడ్-22

image_print

స్వర రాగ గీతంలో భక్తి పారవశ్యంలో పరవశింపచేసిన ధీర “శంకరాభరణం” రాగాలాపన

స్వర వేదిక, కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సంస్థలు సంయుక్తంగా సమర్పించిన “శంకరాభరణం” రాగం పార్ట్-1, ఎపిసోడ్ 22

Swara Raga Geetham “Sankarabharanam Ragam” Part-1, Episode 22 (14.11.2020) – Swara Vedika – Keerthana Academy of Music 

 

స్వర వేదిక, కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ఈనాటి స్వర రాగ గీతం ధీర “శంకరాభరణం”  రాగం పార్ట్-1, ఎపిసోడ్ 22 కార్యక్రమానికి స్వాగతం పలికారు ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, వ్యాఖ్యాత, కార్యక్రమం నిర్వాహకుడు, పార్థసారథి నేమాని (పార్థు)

ఈ కార్యక్రమం ఎపిసోడుని స్పాన్సర్ చేసిన వారు కాంచ్ టెక్నాలజీస్ (Conch Technologies), మధు మారేడు & పూర్ణ పెరవలి and Kutir.com

నాదం శబ్ద వినోదం. అది వెదురులో సంచలిస్తే వేణు గానం, తీగలో సంచలిస్తే వీణ రాగం, సృజనలో పల్లవిస్తే అది స్వర రాగ గీతం. ఈ సంచికలో నేటి మన రాగం ధీర “శంకరాభరణం”

శంకరాభరణం రాగం:

ఆరోహణ: స రి గ మ ప ద ని స  – SA RI GA MA PA DA NI ṠA   

అవరోహణ: స ని ద ప మ గ రి స – SA NI DA PA MA GA RI SA

శంకరాభరణం రాగంలోని స్వర స్థానాలు

స  SA – షడ్జమం Shadjamam

రి  RI – చతుశ్రుతి రిషభము Chatusruthi Rishabham

గ  GA – అంతర గాంధారం Anthara Gaandhaaram

మ MA – శుద్ధ మధ్యమం  Shuddha Madhyamam

ప  PA – పంచమం PANCHAMAM

ద DA – చతుశ్రుతి దైవతం Chatusruthi Daivatham

ని NI – కాకలి నిషాదం Kakali Nishadam

స  SA – షడ్జమం  Shadjamam

అవరోహణలో కూడా ఇవే స్వరస్థానాలు వస్తాయి. 

ధీరశంకరాభరణం 29వ మేళకర్త రాగం. ఈ రాగాన్ని హిందుస్థాని లో బిలావల్ అంటారు అలాగే వెస్ట్రన్ మ్యూజిక్ లో మేజర్ స్కేల్ గా ఇది ప్రసిద్ధి పొందింది, ఆ విధంగా కర్ణాటక సంగీతంలోనూ, హిందుస్థానీలోనూ ఇటు పాశ్చాత్య సంగీతంలో కూడా ప్రపంచంలోని అత్యంత ఎక్కువ మంది సంగీత ప్రేమికులను అలరించే  రాగం శంకరాభరణం. ఈ రాగంలో ఎటువంటి భావాన్నైనా అంటే గంభీరమైన, శాస్త్రీయ సంగీత స్వరరచనలైనా,  ఇటు మృదుమధురమైన లలితగీతాలైన, సినిమాపాటలైనా అత్యంత అవలీలగా, ఆనందంగా, హృద్యంగా పలికించగల రాగం ధీరశంకరాభరణం.

“సరోజ దళ నేత్రి హిమగిరి పుత్రి… నీ పదాంబుజములె సదా నమ్మినా నమ్మ శుభమిమ్మ శ్రీ మీనాక్షమ్మ” అనే పాటతో ఈ సంచికను ఎంతో మధురంగా ప్రారంభించారు పార్థు.

సినిమాకి టైటిల్ సాంగ్ అంటే కృష్ణుడికి నెమలి పింఛం లాంటిది. ఈ టైటిల్ సాంగ్ లో 360 డిగ్రీస్ ఎఫెక్ట్ ఉండాలి. శంకరాభరణం సినిమాలో “ఓంకార నాదాను సంధానమౌ గానమే శంకరాభరణము” అన్న పాట ఈ  టైటిల్ సాంగ్ అన్న పదానికి ఒక మంచి ఉదాహరణ. కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి శంకరాభరణం సినిమా టైటిల్ న్యాయం చేస్తూ ఈ పాటలో  రాగం యొక్క గొప్పదనం, ఆధ్యాత్మిక ఔన్నత్యం, అండర్ కరంట్ గా గురు శిష్య సంబంధం, అలాగే కర్ణాటక సంగీతంలో కీర్తన స్థాయి స్వర సాహిత్యాలు, అలాగే కర్ణాటక సంగీతం కీర్తనలు పాడేటప్పుడు చేసే స్వరకల్పన ప్రకియ జోడించే విధానం ఇవన్నీ టైటిల్ సాంగ్ లో చక్కగా ఒదిగిపోతాయి.

ఈ పాటకి వేటూరి గారు, మహదేవన్ గారు, బాలు గారు, జానకి గారు నాలుగు స్తంభాల్లాంటివారు. ఈ కార్యక్రమంలో ఈ పాటని  గాయని అమృతా తుర్లపాటి “ఓంకార నాదాను సంధానమౌ గానమే శంకరాభరణము..శంకరాభరణము” అని ఎంతో చక్కగా పాడి వీక్షకులను భక్తి పారవశ్యంలో పరవశించేటట్టు చేసింది.

ముత్తుస్వామి దీక్షితుల వారు దర్శించని పుణ్యక్షేత్రము లేదు కీర్తించని దైవము లేదు శాస్త్రియ సంగీతంలో అటు కర్ణాటక, హిందుస్థానీ సంగీత పద్ధతులతో పాటు ఇటు పాశ్చాత్య సంగీతం కూడా వీరి విద్వత్తులో  ఒదిగిపోయింది. అద్వైత మార్గంలో శైవ, వైష్ణవ సంప్రదాయాలను గౌరవిస్తూ అనేక కృతులను రాసి స్వరాలను సమకూర్చిన మహానుభావుడాయన.

వాటిలో బాగా ప్రాచుర్యం పొందిన పరమేశ్వర కీర్తన “అక్షయ లింగ విభో స్వయంభో…అఖిలాండ కోటి ప్రభో పాహి శంభో” శంకరాభరణం రాగంలో దీనిని గానం చేసిన గాయకుడు వైభవ్ గరిమెళ్ళ వీక్షకులను  భక్తి పారవశ్యంలో పరవశించేటట్టు చేసాడు.

1961 లో రిలీజ్ అయిన భార్య భర్తలు సినిమా కోసం శ్రీశ్రీ గారు రచించిన రాజేశ్వరరావు గారు శంకరాభరణ రాగంలో స్వరపరిచిన, ఘంటసాల మాస్టారు పాడిన “జోరుగా హుషారుగా షికారు పోదమా హాయి హాయిగా తీయతీయగా” అనే చక్కటి పాట పల్లవిని హుషారుగా పాడి, వీక్షకులను కాసేపు ఆలా షికారుకు తీసికెళ్ళాడు పార్థు.  

స్వర రాగ గీతం కార్యక్రమంలో ఇప్పుడు వీక్షకులు వినబోయే పాట సుమారు 60 ఏళ్లు గడిచినా కూడా సంగీత ప్రేమికులు మదిలో వయ్యారిగా, మయూరిగా నిలిచిపోయిన తెలుగు సినిమా పాట. 1956 నాటి  బెంగాలీ  చిత్రం సాగరిక ఆధారంగా 1962లో ఎఎన్ఆర్ గారు, సావిత్రి గారు జంటగా నటించిన ఆరాధన సినిమాలో శ్రీశ్రీ గారు రచించిన ఒక పాటని యస్. రాజేశ్వరరావు  గారు శంకరాభరణం రాగ ఛాయలలో కంపోజ్ చేశారు.

ఈ పాటలోని ప్రతి మాటకీ ఘంటసాల మాస్టారు తన గానంతో ప్రాణం పోశారు. “నా హృదయంలో నిదురించే చెలి …కలలలోనే కవ్వించే సఖి…మయూరివై వయ్యారివై నేడే… నటనమాడి నీవే నన్ను దోచినావే… నా హృదయంలో నిదురించే చెలి ” పాటని గాయకుడు అనిరుద్ చెరువు ఎంతో హుషారుగా, చక్కగా పాడి వీక్షకులకు వీనులవిందు చేసి ఆకట్టుకున్నాడు.

చూడాలని ఉంది సినిమాలో మణి శర్మ గారు శంకరాభరణ రాగంలో ఒక మంచి అందమైన మెలోడీని  కంపోజ్ చేసిన ఈ పాటకి వేటూరి సుందర మూర్తి గారు సాహిత్యం అందించిన “సింబలే సింబలే అంబరాలు అందెలే హాయిలే…సింబలే హల్లెలే సింబలే… బల్బలే  బల్బలే చేతికందే మాకు వెండి మబ్బులే సింబలే హల్లెలే సింబలే” అనే పాటను ఎంతు హుషారుగా పాడి, అలరించి ఈ పాటతో తనకున్న ఒక చిన్న అనుభవాన్ని పార్థు వీక్షకులతో పంచుకుంటా… నేను ఈ సినిమాకి మణిశర్మ గారి దగ్గర అసోసియేట్ గా పనిచేయడం జరిగింది. అంటే ట్యూన్ కంపోజ్ చేయడం అయిపోయింది. తరువాత ఆ ట్యూన్ వినిపించి వేటూరి గారు పాట చెపితే రాసుకోవాలనమాట. అది నా డ్యూటీ. ఆ సినిమా దర్శకుడు గుణశేఖర్ గారు, వేటూరి గారు, నేను కంపోజింగ్ రూంలో కూర్చుని వున్నాం. చరణం రాయాలి. పల్లవి రాసారు “సింబలే సింబలే” అని.  చరణం రాయాలి. చరణానికి కంటెంట్ ఏమి రాయాలని అని డైరెక్టర్ గుణశేఖర్ గారిని వేటూరి గారు అడిగారు. అదే నండి గురువుగారు హీరోయిన్ ఏమో ఒక బిలియనీరు కూతురు హీరో ఏమో అడవిలో చెట్లు కొట్టుకునే వాడు. హీరోయిన్ ఏమో ఏమో ఆ బిలియనీరును వొదిలేసి కట్టెలు కొట్టే చిరంజీవిని ప్రేమించి కట్టెలు కొట్టుకునే వాడి వద్దకు వచ్చి “సంతోషంగా ఉంది” అని ఈ సినిమా స్టోరీని ఈ చరణంలో చెప్పాలి అని గుణశేఖర్ గారు చెప్పారు. వేటూరి గారు పాట ట్యూన్ ఏంటి అని అడిగిగారు. నేను ట్యూన్ వినిపించిన 20 – 25 నిమిషాల తర్వాత సడన్ గా వేటూరి గారు “ఆకాశాలే నేలకొచ్చే మేడ కన్న నీడ మేలని” సరిపోతుందేమో చూడు పార్థు అని అన్నారు. “ఆకాశాలే నేలకొచ్చే మేడ కన్న నీడ మేలని” అనే ఒక్క లైన్ లో డైరెక్టర్ గారు అడిగిన మొత్తం స్టోరీని అంటే…”కోట్లు వదులుకుని మేడ వదిలేసి చెట్టునీడకొచ్చి మేడ మీద కన్నా నెల మేలని”. డైరెక్టర్ గుణశేఖర్ గారు ఒక చిన్న కంపోజింగ్ రూము… లేచి వేటూరి గారికి   సాష్టాంగ నమస్కారం చేశారు. ఈ పాట ఎప్పుడు విన్నా ఆ దృశ్యం కళ్ళముందు కదులుతూనే ఉంటుంది. అది వేటూరి గారి ప్రతిభ. ఈ పాటని ఎంతో అద్భుతంగా అంటే అంత అర్థవంతంగా తీర్చిదిద్దిన ఘనత వేటూరిగారిది అని ఎంతో చక్కగా తన అనుభవాన్ని వివిఆరించారు పార్థు. 

అనేక వర్ణాలు కలబోసిన ఇంద్రచాపం అన్నమాచార్యులవారి సంకీర్తనా భాండాగారం. ఇందులో భక్తి, వేదాంతం, శృంగారం, ఆధ్యాత్మికత ఇలా కోరుకున్న వారికి కోరుకున్నంత .కొన్ని జ్ఞాన సముద్రం లోకి తీసుకెళ్ళి పోతాయి, మరికొన్ని కాళ్ళకు గజ్జలు కట్టించి నాట్యం చేయిస్తాయి.

సాక్షాత్తూ అమ్మ అలిమేలు మంగే అందాలు కురిపిస్తూ నాట్యం చేస్తే ఎలా ఉంటుందో అత్యద్భుతంగా వర్ణించిన అన్నమాచార్య కీర్తన “అలరులు కురియగ నాడెనదే అలకల కులుకుల నలమేల్ మంగ” ఈ కీర్తనను పూజ్యులు నేదునూరి కృష్ణమూర్తిగారు శంకరాభరణం రాగంలో స్వరపరిచారు. ఈ కీర్తనను గాయని బృంద కాశవజ్జల ఎంతో చక్కగా పాడి వీక్షకులను భక్తిరస సముద్రంలో ఓలలాడించింది.

సుప్రసిద్ధ దర్శకులు కె. బాలచందర్ నిర్మాతగా టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో పాపులర్ డైరెక్టర్ మణిరత్నం గారు  తీసిన ఒక సూపర్ హిట్ సెన్సేషన్ ఫిలిం “రోజా”. 1992లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇండియాలో మోస్ట్ పాపులర్ లాంగ్వేజెస్ అన్నిట్లోకి డబ్ చేయబడింది అన్నిట్లోనూ సూపర్ హిట్ కూడా అయింది. స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ గారికి ఇది తొలి సినిమా కావడం విశేషం. ఈ సినిమాకి లభించిన అవార్డుల  గురించి చెప్పాలంటే చాలా పెద్ద లిస్ట్ అవుతుంది. ఇందులో ఒక పాట “చిన్ని చిన్ని ఆశ” ఈ పాటని మిన్మిని  అనే గాయని ఆలపించారు. ఈ పాటని ఏ.ఆర్. రేహమాన్ గారు శంకరాభరణం రాగ ఛాయలలో అంటే మోస్ట్ అఫ్ ది ట్యూన్, మెజారిటీ అఫ్ ది కంపోసిషన్ శంకరాభరణంలోనే ఉంటుంది…అక్కడ అక్కడ అన్యస్వర ప్రయోగాలు చేయబడ్డాయి.

“చిన్న చిన్నఆశై సిరగదికుం ఆశై ముత్తు ముత్తు ఆశై మూడింతువైత ఆశై”, “చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ.. ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ” అని కొంత తమిళ్ లో, కొంత తెలుగులో ఈ పాటని గాయని వైష్ణవి రామానుజన్ ఎంతో అద్భుతంగా, హుషారుగా పాడి వీక్షకులను ఉర్రూతలూగించింది. 

సాధారణంగా ఇతరులను మోసం చేసేవారిని ఇండియన్ పీనల్ కోడ్లో ఫోర్ ట్వంటీ (420) సెక్షన్ కింద శిక్ష ఇస్తారు.వీళ్ళని 420 గాళ్ళని, హిందీలోచార్ సౌ బేస్ గాళ్ళని అని పిలుస్తారు. దీన్నే సినిమా టైటిల్ గా తీసుకుని శ్రీ చార్ సౌ బీస్ “Shree 420 ” అనే ఒక సూపర్ హిట్ సినిమాని తీశారు ప్రముఖ దర్శకుడు నిర్మాత నటుడు రాజ్ కపూర్ గారు. ఈ సినిమాకి శంకర్ జైకిషన్ సంగీత దర్శకులు. వీరు అందించిన సంగీతం ఇండియాలోనే కాకుండా  రష్యా, రుమేనియా, ఇజ్రాల్ లాంటి దేశాలలో చాలా పాపులర్ అయ్యింది. హస్రత్ జైపురి అందించిన   “ఇచక్ దాన బిచక్ దాన  దానే ఉపర్ దాన, ఇచక్ దాన” ఈ పాట అయితే ఇజ్రాయెల్లో సంగీతాభిమానులు వాళ్ళ భాషలో రీమిక్స్ కూడా చేసుకున్నారు.

శంకరాభరణం రాగం, రాగ్ బిలావల్ ఛాయల్లో వచ్చిన ఈ పాటని గాయని సంజన తోడుపునూరి ఎంతో హుషారుగా, అద్భుతంగా, చక్కటి అభినయంతో వీక్షకులను ఎంతగానో అలరించి అమితంగా ఆకట్టుకుంది. 

పార్థు తన వాఖ్యానాన్ని కొనసాగిస్తూ….ఇప్పుడు శంకరాభరణ రాగంలో ఒక లలిత గీతాన్ని వినిపించబోతున్నాను. ఈ గీతాన్ని రచించి స్వరపరిచింది ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. ఈ పాటకు నన్ను చిన్న సంబంధం ఉంది. నేను ఇంజనీరింగ్  చదువుకుంటున్న రోజుల్లో మా గురువుగారు నేతి శ్రీరామ శర్మ గారు, బాలమురళి గారికి కాంటెంపరరీగా, వారిద్దరూ ఒకే గురు గారు దెగ్గర, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి దగ్గర సంగీతాన్ని అభ్యసించడం జరిగింది. వారు చాలా మంచి మిత్రులు కూడా. అందుకని బాలమురళి గారి కంపోసిషన్స్ నాకు ఎక్కువగా  నేర్పిస్తుండే వారు. ఈ పాట కూడా మా గురు గారు నేర్పించిందే. “పాటలే నీ భక్తి బాటలా పాటలే ఆటలా బాటలో అమృత పూటలే” ఈ లలిత గీతం నాకు 1992 లో ఆల్ ఇండియా రేడియో వారు నిర్వహించిన మ్యూజిక్ కాంపిటీషన్స్ లో జాతీయ స్థాయిలో మొదటి బహుమతి కూడా వచ్చింది.

ఈ పాటను ఎంతో చక్కగా, మధురంగా పాడి అమితంగా ఆకట్టుకున్నారు గాయకుడూ, వ్యాఖ్యాత, సంచిక నిర్వాహకుడు పార్థసారథి నేమాని (పార్థు).

స్వర రాగ గీతం కార్యక్రమంలో ఈ సంచికలో శంకరాభరణ రాగంలో నేను, మా పిల్లలు మీకు వినిపించిన శాస్త్రీయ సంగీత కీర్తనలు, సినిమా పాటలు, లలిత గీతాలు మీ అందరిని అలరించాయి అని ఆశిస్తూ వచ్చే వారం కూడా శంకరాభరణ రాగాలాపన కొనసాగుతుందని పార్థు శంకరాభరణం మొదటి సంచికని ఎంతో ఘనంగా ముగించారు.  

 

“స్వరవేదిక”, కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఆన్లైన్లో (యూట్యూబ్ ద్వారా) ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్న “స్వర రాగ గీతం” కార్యక్రమంలోని ప్రతీ ఎపిసోడ్ కి సంబంధించిన అంశాలను, విశేషాలను అక్షరరూపంలో మీ ముందు ఉంచడానికి ఓ చిరుప్రయత్నం చేస్తున్నది మీ…. కళావైభవం.కామ్ / www.kalavaibhavam.com  – K.L. Narasimha Rao  

Volunteer Technical Support: Shaliny Jadhav, Minnesota, USA

image_print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×