30-07.2020: డా. సినారె మాట మధురం – సినారె పాట అమరం: డా. కె.వి. రమణ

డా. సినారె మాట మధురం – సినారె పాట అమరం:  డా. కె.వి. రమణ

తెలుగు సాహితీ తేజం, తెలంగాణ తల్లి ముద్దుబిడ్డ డా .సి .నారాయణ రెడ్డి గారి మాట మధురమని, పాట అమరమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు డా .కె .వి.రమణ అన్నారు.

సాధన సాహితీ స్రవంతి,తెలుగురథం, శ్రీ సచ్చిదానంద కళాపీఠం, మరికొన్ని భావ సారూప్య సంస్థలు కలిసి గత సంవత్సర కాలంగా ప్రతీనెల నిర్వహించిన సినారె పై ప్రముఖుల  ప్రసంగాల అక్షరరూపం “సినారె సాహితీ వైజయంతి”  గ్రంథాన్ని ఆయన ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించారు.

డా .రమణ గారి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలో డా .సినారె కవితా వైభవాలను స్మరించుకుని మాట్లాడుతూ సినారె కవి రాజ పుంగవుడని, రాజసంతో వెలిగిన కవిగా సాహిత్య, నిజ జీవనాలలో  రాణించిన ఉత్తుంగ సాహితీ  శిఖరమని ,సినారె పేరున “సాహిత్య సదన్” ప్రత్యేక భవనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఆయనకు మన గొప్ప నివాళి అన్నారు.

సినారె సాహిత్య సంపదను రాబోయే తరాలకు అందించే ప్రక్రియలో భాగస్వామ్యులైన భావ సారూప్య సంస్థలను ఆయన అభినందించారు .ప్రముఖ రచయిత్రి చిల్లర భవాని అధ్యక్షోపన్యాసంలో మాటాడుతూ విశ్వంభర కావ్యంతో సినారె విశ్వకవి అయ్యారని అన్నారు.

విశిష్ట అతిథిగా విచ్చేసిన సర్వార్థ సంక్షేమ సమితి అధ్యక్షులు పి .వి .మనోహరరావు మాట్లాడుతూ సినారె చేపట్టిన అన్ని పదవులకు వన్నె తెచ్చిన సాహితీ వసంత రాయడని కొనియాడారు.

సమన్వయకర్త సాధన నరసింహాచార్య, బాల సాహిత్య పరిషత్ అధ్యక్షులు చొక్కాపు వెంకటరమణ, తెలుగు సాహిత్యకళాపీఠం చిక్కారామదాసు, భారత వికాస పరిషత్ పసుపులేటి కృష్ణ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఇటీవలే దివంగతులైన నటుడు, రచయిత రావి కొండల రావు, ప్రముఖ రచయిత్రి డా. కె. లక్ష్మి, డా. ద్వానా శాస్త్రి, సుదర్శనరావులకు నివాళులర్పించారు.

Print Friendly, PDF & Email
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *