Breaking News

Arts and Culture, Festivals and Traditions, General News - ఇతర వార్తలు మిత్రులు, శ్రేయోభిలాషులందరికి భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు – Kalavaibhavam.com

Tuesday 18 - 01 - 2022

Ravindrabharathi 31.07.2020: పీవీ ఔన్నత్యాన్ని దశదిశలా చాటుదాం; పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలకై ప్రత్యేక వెబ్సైట్

image_print

పీవీ ఔన్నత్యాన్ని దశదిశలా చాటుదాం; పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలకై ప్రత్యేక వెబ్సైట్

 

          ఆధ్యాత్మికతలో, జ్ఞాన సంపన్నతలో, విధాన నిర్ణయాలలో, ప్రజా సంక్షేమ పాలనారీతిలో, సాహితీ సాంస్కృతిక విషయాలలో, రాజనీతి రీతులలో పి.వి. నరసింహా రావు గారు తనకు తానే సాటి అనీ, భూమి పుత్రుడిగానూ, భారతీయ తాత్విక చింతనాపరుడిగానూ, విశ్వజ్ఞానంలోనూ తెలుగు జాతి గర్వించగదగ్గ మహనీయుడనీ, అందుకే ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఆయన పేరిట నిర్మించే స్మృతి మందిరం – మ్యూజియం, ఆయన వ్యక్తిత్వంలోని విశిష్టతను మూర్తీభవించే విధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పార్లమెంట్ సభ్యులు, పి.వి. నరసింహా రావు శత జయంత్యుత్సవ కమిటీ ఛైర్మన్ శ్రీ కేశవరావు గారు అన్నారు.

ఈ రోజు ఉదయం 11 గంటలకు రవీంద్ర భారతి కళాభవన్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో పీవీ శత జయంతి ఉత్సవాల కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారకరామారావు గారు ఈ సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేసారు.

స్మృతి మందిరం పీవీ గారి బహుముఖ ప్రజ్ఞకు అద్దం పట్టేలా ఉండాలని, వివిధ ప్రభుత్వ శాఖలను కలుపుకుని నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో సంవత్సరం పాటు వేర్వేరు ప్రాంతాలలో ఆయా కార్యక్రమాలను నిర్వహించాలనీ, పీవీ గారితో ప్రమేయం ఉన్న ఆంధ్ర, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాల ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని ఆయా రాష్ట్ర రాజధానులలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పీవీ గారి శత జయంతి సందేశాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళగలుగుతాయని శ్రీ కేటీఆర్ సూచించారు.

          కమిటీ సభ్యులందరూ రాబోయే మాసాలలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో జరగాల్సిన కార్యాచరణ ప్రణాళికపై విస్తృతంగా చర్చించారు. నెలకు ఒకటి కన్నా తక్కువ కాకుండా అన్ని వర్గాల ప్రజలను కలుపుకునిపోయేలా కార్యక్రమాలను రూపొందించాలని, దీనికోసం ప్రత్యేకంగా ఆయా శాఖలకు, వ్యక్తులకు, అధికారులకు సంబంధిత బాధ్యతలను అప్పగిస్తూ సబ్-కమిటీలను కూడా ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు.

          ఈ సమావేశంలో ఇంకా ఈ నిర్ణయాలను తీసుకున్నారు.

 • పీవీ జ్ఞాన భూమిలో నిర్మించ తలపెట్టిన మెమోరియల్ హాల్ డిజైన్ లలో నాలుగింటిని సీఎం గారికి నివేదించి ఆమోదంపొంది దానికి తగిన నిర్మాణ చర్యలను చేపట్టాలి.  నిర్మాణాల విషయంలో సుప్రీంకోర్టు నియమాలను అనుసరిస్తూ ప్రస్తుతం ఉన్న కరోనా విస్తృతిని దృష్టిలో పెట్టుకొని జూన్ 2021 కల్లా పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి.
 • ఈ స్మృతి మందిర నమూనా పీవీ వ్యక్తిత్వానికి, భారతీయ తత్వానికి అద్దం పట్టేలాగా ఉండాలి.
 • విదేశాలలోని తెలంగాణ ప్రజలతో సమన్వయం చేసుకొని ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, లండన్, అమెరికా, సింగపూర్ వంటి దేశాలలో పీవీ విగ్రహాలను ఆవిష్కరించుకోవాలి.  ఆ సందర్భంలో ప్రసంగాలు – చర్చలు కూడా నిర్వహించాలి. దీనికి కావలసిన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుంది.
 • నెలకొక్క థీమ్ తో కార్యక్రమాల రూపకల్పన చేయాలి. అలా ఆగస్టు మాసం భూమి పుత్రుడికి నీరాజనం పేరిట పీవీ స్వగ్రామమైన వంగరలో సాంస్కృతిక – పర్యాటక శాఖ ద్వారా టూరిజం సర్క్యూనట్ ఏర్పాటు అంశాలను నిర్వహించాలి.
 • సెప్టెంబర్ మాసంలో “పీవీ గారికి కళాకారుల నీరాజనం”గా చిత్రకారులు, కార్టూనిస్ట్ లు, క్యారికేచరిస్ట్ లు, ఫోటో గ్రాఫర్స్ తో వర్క్ షాపులను నిర్వహించి, ఎగ్జిబిషన్ లు కూడా నిర్వహించాలి.
 • అక్టోబర్ మాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖ నగరాలలో తెలుగు ప్రజల నీరాజనం పేరిట అక్కడి ప్రముఖులను అందరినీ కలుపుకొని సదస్సు నిర్వహించాలి.
 • నవంబర్ మాసంలో పీవీ గారికి “సాహితీ – సాంస్కృతిక నీరాజనం” పేరిట కవి సమ్మేళనాలు, సాహితీగోష్టులు, ఆయన రచనలు, కథలపై చర్చా కార్యక్రమాలు నిర్వహించాలి.
 • డిసెంబర్ మాసంలో ఆయన వర్ధంతి సందర్భంగా జాతీయస్థాయి సదస్సులు నిర్వహించాలి.
 • ఇలా ప్రతి మాసం కనీసం ఒక కార్యక్రమాన్ని ఒక థీమ్ తో నిర్వహిస్తూ, ఇవి తెలంగాణ ప్రజల నివసిస్తున్న వివిధ దేశాలలో కూడా జరిగేలా చర్యలు గైకొనాలి.
 • పీవీ ఛాయాచిత్రాలతో అంతర్జాతీయ స్థాయి కాఫీటేబుల్ పుస్తకాన్ని ప్రచురించడమే కాక, పీవీ రాసిన అముద్రిత రచనలను ప్రచురించాలి. గతంలో ప్రచురించిన పుస్తకాలు పునర్ ముద్రించాలి.
 • రానున్న అసెంబ్లీ సమావేశాలలో పీవీ గారికి భారతరత్న, పార్లమెంట్ లో విగ్రహం గురించి తీర్మానం చేసి కేంద్రానికి నివేదించాలి. అదే సందర్బంలో రాష్ట్ర అసెంబ్లీలో పీవీ వర్ణ చిత్రా పటాన్ని ఆవిష్కరించాలి.
 • రాష్ట్ర అసెంబ్లీలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా పీవీ చేసిన ప్రసంగాలను పుస్తక రూపంలో ముద్రించాలి.

కాగా, కమిటీ సభ్యులందరి సమక్షంలో ఛైర్మన్ కేశవరావు గారు పి.వి.నరసింహా రావు శత జయంతి ఉత్సవాలపై రూపొందించిన ప్రత్యేక వెబ్ సైట్ pvnr.telangana.gov.in ను ప్రారంభించారు. ఈ వెబ్ సైట్ లో పీవీ నరసింహా రావు గారి అరుదైన ఫోటో గ్యాలరీతో పాటు ఆయన రాసిన పుస్తకాలు, ఆయనపై రాసిన పుస్తకాలు, వ్యాసాలు, శత జయంతి ఉత్సవ కమిటీ సమావేశాల సమాచారం, వివరాలు, అరుదైన వీడియోలు అందుబాటులో ఉంచారు.

ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ తో పాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి. వినోద్ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ సలహాదారు డా. కె.వి. రమణాచారి, పీవీ కుటుంబ సభ్యులు పీవీ వాణీదేవి, ప్రభాకర్ రావు, దేవులపల్లి ప్రభాకర్ రావు, దేశపతి శ్రీనివాస్, ప్రభుత్వ కార్యదర్శి సవ్యసాచి ఘోష్ ఐ.ఏ.ఎస్., ప్రభుత్వ కార్యదర్శి శ్రీనివాస రాజు, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ఐ‌టి డైరెక్టర్ దిలీప్ కొణతం, కె. రామచంద్రమూర్తి, విదేశీ కార్యక్రమాల సమన్వయకర్త మహేశ్ బీగాల, సీతారామరావు తదితరులు పాల్గొన్నారు.

 

image_print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×