తిరుమల, 2020 అక్టోబరు 18: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు 2020 – ముత్యపుపందిరి వాహనంపై మురళీకృష్ణుడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప

2020 శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు 

ముత్యపుపందిరి వాహనంపై మురళీకృష్ణుడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప

తిరుమల, 2020 అక్టోబరు 18: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆది‌వారం రాత్రి 7 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై రుక్మిణి స‌త్య‌భామ స‌మేత మురళీకృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు.

ముత్య‌పు పందిరి – స‌క‌ల సౌభాగ్య సిద్ధి

ముత్యాల నిర్మలకాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళ అనుకూలం. అందుకే శ్రీమలయప్పకు మూడో రోజు రాత్రి మొదటియామంలో ముత్యాల పందిరిలో కూర్చొని విహరించే కైంకర్యాన్నిపెద్దలు నిర్ణయించారు. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణచక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు – రత్నాల వల్ల కలిగే వేడినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షఃస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి.


కాగా, బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజైన సోమవారం ఉదయం 9 గంటలకు క‌ల్ప‌వృక్ష వాహనం, రాత్రి 7 గంటలకు స‌ర్వ‌భూపాల‌ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, శ్రీ చిప్ప‌గిరి ప్ర‌సాద్‌, శ్రీ గోవింద‌హ‌రి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ ర‌మేష్‌రెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *