Breaking News

Arts and Culture, Festivals and Traditions, General News - ఇతర వార్తలు మిత్రులు, శ్రేయోభిలాషులందరికి భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు – Kalavaibhavam.com

Tuesday 18 - 01 - 2022

వీక్షకుల హృదయాలలో వర్షాన్ని  వర్షింపచేసిన ఆనందామృత కర్షిణి “అమృతవర్షిణి” రాగాలాపన – స్వరవేదిక, కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సమర్పణలో స్వర రాగ గీతం ఈనాటి ఎపిసోడ్-21 (07-Nov-20)

image_print

వీక్షకుల హృదయాలలో వర్షాన్ని  వర్షింపచేసిన ఆనందామృత కర్షిణి “అమృతవర్షిణి” రాగాలాపన

స్వరవేదిక, కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సమర్పణలో స్వర రాగ గీతం ఈనాటి ఎపిసోడ్-21

Swara Raga Geetham “Amrithavarshini Ragam” Episode 21 (07.11.2020)

 ఈ కార్యక్రమం ఎపిసోడుని స్పాన్సర్ చేసిన వారు కాంచ్ టెక్నాలజీస్ (Conch Technologies), మధు మారేడు & పూర్ణ పెరవలి మరియు Kutir.com

 

స్వరవేదిక సమర్పణలో, కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సహా సమర్పణలో ప్రతివారం సంగీతాభిమానులని రాగప్రవాహంలో ముంచెత్తుతున్న స్వర రాగ గీతం కార్యక్రమంలో ఈ సంచికకు స్వాగతం పలికారు ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, వ్యాఖ్యాత, కార్యక్రమం నిర్వాహకుడు పార్థసారథి నేమాని (పార్థు).

“రాళ్ళైన కరిగించు గాంధర్వం రమణీయము అది కమనీయము” అన్నారు ఒక మహాకవి అంతే కదా మరి… సంగీతం ఎడారిలో నదిలా ప్రవహిస్తుంది… ఎండిపోయిన తోటలో సైతం చిగుళ్లు వేయిస్తుంది… రాళ్ళను సైతం కరిగించి రసరాజ్యాలు సృష్టిస్తుంది. స్వర రాగ గీతం కార్యక్రమంలో ఈనాటి రాగం ఆనందామృత కర్షిణి “అమృతవర్షిణి”

అమృతవర్షిణి రాగం:

ఆరోహణ: స గ మ ప ని స  – SA GA MA PA NI ṠA   

అవరోహణ: స ని ప మ గ  స – SA NI PA MA GA SA

కీరవాణి రాగంలోని స్వర స్థానాలు

స  SA – షడ్జమం Shadjamam

గ  GA – అంతర గాంధారం Anthara Gaandhaaram

మ MA – ప్రతి మధ్యమం  Prathi Madhyamam

ప  PA – పంచమం PANCHAMAM

ని NI – కాకలి నిషాదం Kakali Nishadam

అవరోహణలో కూడా ఇవే స్వరస్థానాలు వస్తాయి. 

అమృతవర్షిణి 66 మేళకర్తయినటువంటి చిత్రాంబరి రాగ జన్యం. దీనిని 65వ మేళకర్తయినటువంటి మేచ  కళ్యాణి రాగ జన్యంగానూ, 53వ మేళకర్తయినటువంటి గమనశ్రమ రాగజన్యంగా కూడా చెప్పుకోవచ్చు. ఇది ఔఢవ రాగం. అంటే ఆరోహణలోను, అవరోహణలో కూడా ఐదు స్వరాలు ఉంటాయి. ఈ రాగం యొక్క ముఖ్య లక్షణం ఏమిటంటే ఎక్కడైతే వర్షాభావం ఉంటుంధో, అంటే వర్షాలు పడవో అక్కడ అమృతవర్షిణి రాగాలాపాన చేస్తే వరుణుడు సైతం కరిగిపోయి వర్షాలు కురిపిస్తాడని సంగీతజ్ఞుల, సంగీతాభిమానుల ప్రగాఢ విశ్వాసం.  అటువంటి ఒక సందర్భంలోనే ప్రముఖ వాగ్గేయకారులు శ్రీ ముత్తుస్వామి దీక్షితులవారు ఈ రాగాన్ని సృష్టించారనేది చరిత్ర చెబుతున్న సత్యం.

అమృతవర్షిణి రాగంలో శాస్త్రీయ, లలిత శాస్త్రీయ కృతులు, సినిమా పాటల విందును ఆస్వాదించడానికి స్వాగతం పలికారు వ్యాఖ్యాత, కార్యక్రమం నిర్వాహకుడు పార్థసారధి (పార్థు).

ఆకాశం నుంచి జారిపడే నీళ్లన్నీ సముద్రంలో కలిసినట్టుగా, మనం సకల దేవతలకు చేసే అర్చనలన్నీ ఆ కేశవునికే చెందుతాయి అంటుంది సంధ్యావందనం.  అలాగే చదివే మంత్రాలన్ని కూడా ఒకే ఒక మంత్రములో వేంకటేశ మంత్రములో ఆవహించి ఉంటాయని అంటున్నారు అన్నమాచార్యులవారు. వెన్నలాంటి ఈ కీర్తనను అమృతవర్షిణిలో స్వరపరిచారు ప్రముఖ గాయకులు స్వరకర్త శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు.

“అన్ని మంత్రములు ఇందే ఆవహించెను…వెన్నతో నాకు గలిగే వేంకటేశు మంత్రము…నారదుడు జపియించే నారాయణ మంత్రము…చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము…నారదుడు జపియించే నారాయణ మంత్రము…చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము” అనే చక్కటి కీర్తనను ఎంతో చక్కగా పాడి భక్తి పారవశ్యంలో ఓలలాడించి ఈనాటి సంచికకు శుభారంభాన్ని ఇచ్చారు గాయకుడు పార్థు.

మహానుభావుల మాట మంత్రం అవుతుంది. వారి పాటకు ప్రకృతి సైతం పులకరించిపోతుంది. తమిళనాడు రాష్ట్రంలో ఎట్టాయపురం గ్రామంలో ఒకసారి విపరీతమైన కరువు ఏర్పడింది. వానల్లేవు, పంటల్లేవు, చుక్క నీరైనా లేక జనం అల్లాడిపోయారట. ఆ పరిస్థితిని చూసి ముత్తుస్వామి దీక్షితుల వారు చలించిపోయారట. అప్పటికప్పుడు తన శిష్యుడైన సుబ్రహ్మణ్యం అయ్యర్ కు ఆనందామృత కర్షిణి అమృతవర్షిణి అంటూ ఆశువుగా ఒక కృతిని నేర్పించారట. అమృతవర్షిణి రాగంలో ఇదే మొదటి కృతి అని, ఆ రాగాన్ని సృష్టించిన మహానుభావుడు ముత్తుస్వామి దీక్షితులవారని చెబుతారు. 

నాడు మేఘాలను రప్పించి, వర్షాన్ని కురిపించిన “ఆనందామృతాకర్షిణి అమృత వర్షిణి… హరాది పూజితే శివే భవాని” కీర్తనను మన హృదయాలలో హర్షాన్ని వర్షించేలా ఆలపించి భక్తి పారవశ్యంలో పరవశించేటట్టు చేసింది గాయని సాయి తన్మయి ఇయ్యున్ని

అమృతవర్షిణి  రాగంలో సినిమా పాటల విషయానికి వస్తే ఈ సంఖ్య మిగతా రాగాలతో కంపేర్ చేస్తే చాలా తక్కువే అని చెప్పాలి. ఇళయరాజా గారు స్వరపరచిన ఒక పాటను మీకు వినిపించే ముందు కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సిరివెన్నెల చిత్రంలో సీతారామశాస్త్రిగారు రచించినటువంటి “ఈ గాలీ ఈ నేలా ఈ ఊరు సెలయేరు” అనే పాటలో ఒక అద్భుతమైన చరణాన్ని అమృతవర్షిణి రాగంలో స్వరపరిచారు మామ కెవి మహదేవన్ గారు. 

“కన్నె మూగమనసు కన్న స్వర్ణస్వప్నమై తళుకుమన్న తారచిలుకు కా౦తి చినుకులై కన్నె మూగమనసు కన్న స్వర్ణస్వప్నమై తళుకుమన్న తారచిలుకు కా౦తి చినుకులై గగన గళము ను౦డి అమరగాన వాహిని .. ఆ…. గగన గళము ను౦డి అమరగాన వాహిని జాలువారుతో౦ది ఇలా అమృతవర్షిణి అమృతవర్షిణి అమృతవర్షిణి ” అనే ఈ అద్భుతమైన చరణాన్ని వినిపించి అమితంగా అలరించారు పార్థు.

ప్రముఖ దర్శకులు మణిరత్నంగారు తమిళంలో తీసిన సినిమాలన్నిటిని తెలుగులో డబ్ చేశారు. వాటిలో చాలా సినిమాలు తెలుగులో కూడా సూపర్హిట్ అయ్యాయి. 1988లో ప్రభు, అమల జంటగా మణిరత్నం గారు తమిళంలో తీసిన ఒక సూపర్ హిట్ ఫిలిం “అగ్ని నక్షత్రాన్ని” తెలుగులో “ఘర్షణ” పేరుతో డబ్ చేశారు. తెలుగులో కూడా చాలా పాపులర్ అయ్యింది ఈ సినిమా. ఈ సినిమాకి  మాటల్ని పాటల్ని రాజశ్రీ గారు  రచించారు.

అమృతవర్షిణి రాగంలో ఇళయరాజా గారి స్వరరచన, రాజశ్రీ గారి పదరచన, బాలుగారు,వాణీజయరాంల గాత్రం “కురిసేను విరిజల్లులే…ఒకటయ్యేను ఇరు చూపులే.. అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను…శృంగారమునకీవే శ్రీకారమే కావే…కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే” పాటని గాయని మల్లికా సూర్యదేవర ఎంతో చక్కగా పాడి వీక్షకుల హృదయాలను రంజింపచేచింది.

తన ఇష్ట దైవం కోదండరాముని సేవ కోసం తన వృత్తిని, కుటుంబాన్ని సైతం వదులుకొని భద్రాచలం చేరుకుని, ఆ స్వామి సేవ కోసం తన జీవితాన్నే అంకితం చేసిన పరమ భక్తాగ్రేశ్వరుడు, వాగ్గేయకారుడు శ్రీ తూము నరసింహ దాసు గారు. “రాముని నమ్మితి నా దేహము స్వామికి అమ్మితి” అంటూ కీర్తనను  రచించే అదృష్టం వారిదైతే, ఆ కీర్తనలు అమృతవర్షిణిలో స్వరపరిచి మీకు వినిపించే భాగ్యం నాది అంటూ “రాముని నమ్మితి నా దేహము స్వామి కమ్మితి… కామకోటి సుందరాకారుడైన శ్రీభద్రాచల” కీర్తనను ఎంతో చక్కగా పాడి ఆ భద్రాచల రాముని భక్తిరస సముద్రంలో ఓలలాడించారు పార్థు.

అద్భుత ప్రతిభాశాలి, వాగ్గేయకారులు శ్రీ ముత్తయ్య భాగవతార్ గారు గురించి మనం గత సంచికల్లో కూడా చెప్పుకున్నాము. 1877 – 1945 సంవత్సరాల మధ్యకాలంలో జీవించిన వీరు ఎన్నో కొత్త రాగాలను సృష్టించారు. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి సంస్కృతంతో పాటు దక్షిణాది భాషల్లో ఎన్నో కృతులు, వర్ణాలను రచించారు. పూల బాణాలు, చెరకు వింటిని ధరించిన స్త్రీ మాతను కీర్తిస్తూ ముత్తయ్య భాగవతార్ గారు రచించి అమృతవర్షిణిలో స్వరబద్ధం చేసిన “సుధామయి సుధానిధి” ఈ కీర్తన నిజంగా అమృతకలశం.

“సుధామయి సుధానిధి సుమ శరేక్షు కోదండే… విధీంద్ర నుతే విమలే సలహౌ వేద సారే విజయాంబికే” కీర్తనను గాయని మనోజ్ఞ రాజనాల ఎంతో చక్కగా పాడిభక్తి పారవశ్యంలో ఓలలాడించింది.

ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆధిదైవిక అని తాపాలు మూడు రకాలు. వీటినే  తాపత్రయాలు అని కూడా అంటారు. వీటిలో మునిగిపోతే ఇంకా మనసు ఒకచోట స్థిరంగా ఉండదు అంటున్నారు వాగ్గేయకారులు సదాశివ బ్రహ్మేంద్రులు.1830వ సంవత్సరంలో జన్మించి 1887వ సంవత్సరంలో సిద్ధిపొందిన  ఈ మహానుభావుడు ఒక పరిపూర్ణుడైన సిద్ధయోగి. భక్తి, జ్ఞాన వైరాగ్యాలను బోధిస్తూ, మానస సంచరరే, పిబరే రామరసం వంటి అనేక అజరామరమైన ఆధ్యాత్మిక కీర్తనలు రచించారు సదాశివ బ్రహ్మేంద్రులు.

వీరు రచించిన “శిరసా నహి నహిరే” అన్న కీర్తనను అమృతవర్షిణిలో స్వరబద్ధం చేసిన మహానుభావులు మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు.

” శిరసా నహి నహి రే, మానస శిరసా నహి నహి రే” అనే కీర్తనను చక్కగా పాడి వినిపించి వీక్షకులను ఆనందింపచేసారు పార్థు.

పాపులర్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో 2004లో వచ్చిన ఒక సూపర్ హిట్ ఫిలిం ఆనంద్. ఈ సినిమాని “నినైత్తాలే” అనే పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. దీనికి విజయ్ ఆంటోనీ మ్యూజిక్ డైరెక్టర్. సుచిందర్, నర్గిస్ బాగేరి నటించిన ఈ సినిమాలో ఒక పాటని విజయ్ సాగర్ గారు రచించారు.

ఈ పాటని అమృత వర్షిణిలో ఎంతో అందంగా స్వరపరిచారు విజయ్ ఆంటోనీ. రాహుల్ నంబియార్, సాధనా సర్గం పాడిన ఈ పాట ” నాన్దానా నాన్దానా ” గాయని  స్నిగ్ధ మల్లాది తమిళ్ లో ఎంతో చక్కగా పాడి అమితంగా ఆకట్టుకుంది. 

అమృతవర్షిణి రాగంలో వచ్చిన సినిమా పాటల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి పాట కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన స్వాతికిరణంలో “ఆనతీనీయరా హర” పాట.  తను అభిమానించే గురువు సమక్షంలో ఒక చిచ్చరపిడుగు చెలరేగిపోయి ఆలపించేటటువంటి ఈ పాట కర్ణాటక సంగీత సంప్రదాయంలోవున్న అత్యుత్తమ కీర్తనకు అటు సాహిత్య పరంగా, ఇటు సంగీత పరంగా ధీటుగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అతిశయోక్తిలేదు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అద్భుతమైన రచనకు మామ కెవి మహదేవన్ గారి అమృతవర్షిణి స్వరరచన తోడైతే ఈ పాటకు వాణిజయరాం గారికి జాతీయ స్థాయిలో బెస్ట్ ఫిమేల్ ప్లేబాక్ సింగర్ అవార్డు లభించింది.

“ఆనతి నీయరా హరా… సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొర సన్నిధి చేరగా… ఆనతి నీయరా హరా” పాటను గాయని  శ్రియ చెముడుపాటి ఎంతో మధురంగా పాడి వీక్షకుల హృదయాలను రంజింపచేసింది.

ఈ పాట విన్నప్పుడల్లా నాకు అనిపించే ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నానని పార్థు వివరిస్తూ….  దర్శకులు విశ్వనాధ్ గారిని “కళాతపస్వి” అని ఎందుకు అంటారు అంటే నా వివరణ ఇది.   

నేను ఆయన విశ్వనాధామృతం కార్యక్రమంలో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాను. కర్ణాటక సంగీత సంప్రదాయంలో గీతాలు మొదలుకుని స్వరజతులు, వర్ణాలవరకు స్వరాన్ని పాడి, సాహిత్యాన్ని పాడే సంప్రదాయం ఉంది. వర్ణాలు రచించలేదు అనే విమర్శలకు ధీటుగా త్యాగరాజస్వామి వారు  పంచరత్న కీర్తనలు రచించారని చెబుతారు. పంచరత్న కీర్తనలలో, ఒక్కొక్క   కీర్తనలోనూ పది చరణాలుంటాయి. పల్లవి, అనుపల్లవి చరణాలు.  ఈ ప్రతి చరణానికి స్వరం పాడి,  సాహిత్యం పాడతారు. ఉదాహరణకు “ఎందరో మహానుభావులు”  శ్రీరాగం లోని త్యాగరాజస్వామి వారి పంచ రత్న కీర్తన ఇది. దీనికి ఎగ్జాక్ట్ గా సాహిత్యం ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్ గా స్వరం ఎలా ఉంటుందో సాహిత్యం అదే తత్కారానికి, అదే లెంగ్త్ కి ఎంతో ఉత్కృష్టమైన ప్రక్రియ ఇది. ఈ ప్రక్రియని అంటే స్వరము, దానికి తగ్గ సాహిత్యం రాసే ప్రక్రియని కమర్షియల్ మీడియం సినిమా మాద్యమంలో, ఒక సినిమాలో చొప్పించి, దాన్ని రక్తి కట్టించి, జనాల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేయడం ఎంత గొప్ప విషయం. అందుకే విశ్వనాధ్ గారిని కళాతపస్వి అన్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని త్యాగరాజస్వామి వంటి స్థాయి కలిగిన వాగ్గేయకారుడు అని నేను అంటున్నాను అని వ్యాఖ్యాత, గాయకుడూ పార్థు ఈ విశేషాలను ఎంతో చక్కగా వివరించారు. 

స్వర రాగ గీతం కార్యక్రమంలో ఈనాటి ఈ సంచికకు ఒక ప్రత్యేకత ఉంది. మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి ఒక వేణుగాన విద్వాంసుణ్ణి అతిథిగా ఆహ్వానించబోతున్నాము. శ్రీ నాగరాజు తాళ్లూరి. తెలుగు వారందరూ గర్వించదగ్గ సంగీత కళాకారులలో ఒకరు.

దక్షిణ భారత దేశంలోని అగ్రశ్రేణి వేణుగాన విద్వాంసులలో ఒకరు శ్రీ నాగరాజు గారు. అటు కర్ణాటక సంగీతం లోనూ ఇటు సినిమా పరిశ్రమలోనూ దాదాపు మూడు దశాబ్దాల అనుభవం కలిగిన ఈ ప్రతిభాశాలి సొంతంగా ఎన్నో వేల ప్రదర్శనలు ఇవ్వడమే కాకుండా ఎల్.సుబ్రహ్మణ్యంగారు, బాలు గారు, జానకి గారు, హరిహరన్, శంకర్ మహదేవన్, శివమణి లాంటి ఉద్దండులతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఎన్నో ప్రదర్శనలిచ్చారు.  వీరు కేవలం వేణు గాన  విద్వాంసులే కాదు, ఒక అద్భుతమైన స్వరకర్త కూడా. జగద్గురు ఆదిశంకరాచార్య వంటి అత్యుత్తమ కళాత్మక చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించడమే కాకుండా, ప్రముఖ దర్శకులు రాఘవేంద్ర గారు, రామ్ గోపాల్ వర్మ వంటి అగ్రశ్రేణి దర్శకులతో పని చేసి, ఎన్నో చిత్రాలకు, టీవీ సీరియల్స్ కు, మ్యూజిక్ ఆల్బమ్స్ కు సంగీత దర్శకత్వం వహించిన ఎన్నో అవార్డులు రివార్డులు పొందిన అద్భుతమైన స్వరకర్త శ్రీ నాగరాజు గారు. శ్రీ తనికెళ్ళ భరణి గారి ఆటగదరా శివా సంచికలోని ఆధ్యాత్మక గీతాలను తనదైన స్టైల్లో కంపోజ్ చేసి దాదాపు 50 మంది కళాకారులతో ఒక లైవ్ సింఫనీ ఆర్కెస్ట్రా తో ఒక కాన్సెప్ట్ ని ప్రెసెంట్ చేసిన ఘనత శ్రీ నాగరాజు గారిది.  నాకు తెలిసి తెలుగులో ఈ ప్రయోగం చేసిన మొట్టమొదటి సంగీత దర్శకులు శ్రీ నాగరాజు గారు. అటువంటి అద్భుత ప్రతిభాశాలి, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ తాళ్లూరి నాగరాజు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత “కళారత్న” బిరుదుతో కూడా సత్కరించబడ్డారు. నాకు మంచి మిత్రుడు, ఆత్మీయుడు వేణుగాన విశారద శ్రీ తాళ్ళూరి నాగరాజు గారికి స్వర రాగ గీతం కార్యక్రమానికి సాదరంగా స్వాగతం పలికారు వ్యాక్యత, గాయకుడు, కార్యక్రమ నిర్వాహకుడు పార్థసారథి నేమాని (పార్థు).

ఈ సంచికకు అతిధిగా విచ్చేసిన తాళ్ళూరి నాగరాజు తన హృదయస్పందనను తెలియచేస్తూ… స్వర్ణ వేదిక… అమెరికాలో జరిగినటువంటి పాడుతా తీయగా కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలు అందరూ కలిసి ఈ స్వరవేదిక సంస్థని స్థాపించి, అందులో పాటలు పాడి, ఫండ్ రైజ్ చేసి, ఇండియా లో చదువుకునేటటువంటి పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు, అలాగే వేరే మంచి మంచి కార్యక్రమాలకు కూడా వారు చేయూతనందిస్తున్నారు. ఇది చాలా మంచి ప్రయత్నం, ఈ పిల్లలకు ఈ వయసులో వారికి వచ్చినటువంటి ఆలోచనకు అభినందలను తెలియచేస్తున్నాను.

స్వర రాగ గీతం అనేటటువంటిది ఒక మంచి కార్యక్రమం. స్వర వేదిక మరియు కీర్తన మ్యూజిక్ అకాడమీ  సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి, ప్రెజెంట్ చేస్తున్నఈ  ప్రోగ్రాం స్వర రాగ గీతం, ఇందులో ప్రతి వారం  కూడా  ఒక రాగాన్ని తీసుకొని, ఆ రాగంలో ఉన్నటువంటి  కర్ణాటక సంగీత రచనలు అలాగే లలిత సంగీతం, సినిమా పాటలు, తెలుగు, కన్నడ, మలయాళం  వేరే భాషల్లో మంచి మంచి పాటలను ప్రెజెంట్ చేయడం… చేస్తున్నారు. ఇది ఒక మంచి అవేర్నెస్ క్రియేట్ చేయడం,  రాగాల మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం ఒక మంచి  ప్రయత్నం, చాలా మంచి ప్రయత్నం. అందరికి నా అభినందనలు.

పార్థు నేతృత్వంలో… పార్థు గురించి చెపుతూ… పార్థు చాలా మంచి టేస్ట్ ఉన్నటువంటి వ్యక్తి. మంచి గురువు, మంచి ఆర్టిస్ట్ , అన్నివిధాలా ఒక

వాల్యూ సిస్టం ఉన్నటువంటి వ్యక్తి, తన ఆధ్వర్యంలో మీరందరూ నేర్చుకుంటూ, ప్రెజెంట్ చేస్తున్న ఈ ప్రోగ్రాం చాలా బాగుంది. చాలా బాగా పాడుతున్నారు. అమెరికలో మీరు అందరూ కూడా ఎంతో టాలెంట్ గా చేస్తున్నారు.  నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది ఇండియాలో ఉన్న పిల్లలు చాలా ఈజీ తీసుకుంటారేమో,  అమెరికాలో ఉన్న పిల్లలు అందరూ బాగా సీరియస్ గా తీసుకుని చాలా బాధ్యతగా సంగీతం నేర్చుకుని చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది.  మీ అందరికీ నా యొక్క అభినందనలు.

పార్ధు గురించి చెప్పాలంటే మా ఇద్దరికి చాలా మంచి పరిచయం.  కలసి చాలా పనిచేసాము. తన రికాండింగ్స్ లో నేను పాల్గొనడం అలాగే నా వర్క్స్ లో తానూ పాడడం జరిగింది.     అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ఫస్ట్ ఎపిసోడ్ లో పాడారు. అద్భుతమైన గాయకుడు, మంచి భాష ఉంది తనకి. ఇటువంటి ఒక మంచి కళాకారుడితో అసోసియేట్ అయి పనిచేయడం ఇంటరెస్టింగ్ గా ఉంటుంది. వెరీ ఇన్స్పైరింగ్ పర్సన్. మంచి మోటివేషన్ వున్న పర్సన్. ఎప్పుడు తపన పడతారు బాగా చేయాలి అని .ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న పార్ధుకి ఎల్లప్పుడూ భగవంతుడు మంచి అవకాశాలు కల్పిస్తూ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని కోరుకుంటూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను అని తాళ్ళూరి నాగరాజు తన స్పందనను ఎంతో చక్కగా తెలియచేసారు.

చివరిగా తాళ్ళూరి నాగరాజు తన వేణుగాన సమ్మోహనాన్ని ఎంతో అద్భుతంగా ప్రదర్శించి వీక్షకులను మంత్రముగ్దుల్ని చేసారు.

స్వర రాగ దీపం కార్యక్రమంలో మా పిల్లలు చేసిన అమృతవర్షిణి రాగాలాపన మీ అందరి హృదయాలలో వర్షాన్ని వర్షింపచేసిందని ప్రగాఢంగా నమ్ముతూ వచ్చే వారం మరొక రాగంతో కలుస్తామని తెలియచేస్తూ ఈ సంచికని ఘనంగా ముగించారు గాయకుడు, వ్యాఖ్యాత, కార్యక్రమ నిర్వాహకుడు పార్థసారథి నేమాని (పార్థు).

“స్వరవేదిక”, కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఆన్లైన్లో (యూట్యూబ్ ద్వారా) ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్న “స్వర రాగ గీతం” కార్యక్రమంలోని ప్రతీ ఎపిసోడ్ కి సంబంధించిన అంశాలను, విశేషాలను అక్షరరూపంలో మీ ముందు ఉంచడానికి ఓ చిరుప్రయత్నం చేస్తున్నది మీ…. కళావైభవం.కామ్ / www.kalavaibhavam.com  – కే.ఎల్. నరసింహా రావు

Volunteer Technical Support: Shaliny Jadhav, Minnesota, USA

 

 

 

image_print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×