తిరుప‌తి‌, 2020 జూలై 31: శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా వరలక్ష్మీవ్రతం

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా వరలక్ష్మీవ్రతం

 తిరుప‌తి‌, 2020 జూలై 31: సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఉదయం వరలక్ష్మీవ్రతం శాస్త్రోక్తంగా జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ వ్రతాన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ హిందూ సాంప్రదాయంలో మహిళలు సౌభాగ్యం కోసం వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారని తెలిపారు. కోవిడ్ -19 నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు ఈ వ్రతాన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహించామన్నారు. అయితే భక్తుల విజ్ఞప్తి మేరకు మొదటిసారి వర్చువల్ విధానంలో ఈ సేవ నిర్వహించామని, 3,507 మంది భక్తులు ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేసి పాల్గొన్నారని తెలిపారు. వీరితో పాటు లక్షలాది మంది భక్తులు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వరలక్ష్మీ వ్రతాన్ని తిలకించారని వివరించారు. ఆన్లైన్ టిక్కెట్లు పొందిన భక్తుల గోత్రనామాలను ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి నివేదించారని, ఇదివరకే వారికి పోస్టల్ శాఖ ద్వారా ఉత్త‌రీయం, ర‌విక‌, ప‌సుపు, కుంకుమ‌, కంక‌ణాలు, గాజులు ప్ర‌సాదంగా అందించామని తెలియజేశారు. ప్రపంచ ప్రజలందరూ త్వరితగతిన కరోనా వ్యాధి నుండి బయటపడాలని ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారిని, శ్రీ వేంకటేశ్వరస్వామివారిని కోరుకున్నట్టు తెలిపారు.

వరలక్ష్మీ వ్రతంతో అష్టలక్ష్మీ పూజాఫలం : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్

టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ పవిత్రమైన వరలక్ష్మీ వ్రతం నిర్వహించడం వల్ల అష్టలక్ష్మీ పూజాఫలం లభిస్తుందని భక్తుల నమ్మకమన్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 1500 టికెట్లు మంజూరు చేసి పెద్ద ఎత్తున ఈ వ్రతాన్ని నిర్వహించడం ఆనవాయితీ అన్నారు. ప్రస్తుతం కోవిడ్ -19 నిబంధనల మేరకు ఏకాంతంగా శాస్త్రోక్తంగా వ్రతాన్ని నిర్వహించామన్నారు. తిరుమలలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా భక్తులందరిపై స్వామి అమ్మవార్ల కృపాకటాక్షాలు ఉండాలని ఈఓ ఆకాంక్షించారు.

శాస్త్రోక్తంగా వరలక్ష్మీవ్రతం

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీకృష్ణ ముఖమండపంలో వరలక్ష్మీవ్రతం శాస్త్రోక్తంగా జరిగింది. విష్వక్సేనారాధనతో ప్రారంభించి పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరు ఆకు, మరువము, తామరపూలు, వృక్షి వంటి సంప్రదాయ పుష్పాలతో ఆరాధించారు. అదేవిధంగా అమ్మవారిని 9 గ్రంథులతో(నూలుపోగు) అలంకరించారు. ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా ఓం శ్రీ కమలాయైనమః, ఓం శ్రీ రమయైనమ, ఓం శ్రీ లోకమాత్రేనమ, ఓం శ్రీ విశ్వజనన్యైనమః, ఓం శ్రీ మహాలక్షియైనమః, ఓం శ్రీ క్షీరాబ్దితనయైనమః, ఓం శ్రీవిశ్వసాక్షిన్యైనమ, ఓం శ్రీ చంద్ర సహోదరిన్యై నమః, ఓం శ్రీ వరలక్ష్మియై నమః అని ఆరాధించారు.

అనంతరం భవిష్యోత్తర పురాణంలో సూత మహర్షి వివరించిన వరలక్ష్మీ వ్రతం మహత్యాన్ని ఆగమ పండితులు శ్రీ శ్రీనివాసాచార్యులు భక్తులకు తెలియజేశారు. పూర్వం శంకరుడు పార్వతిదేవికి ఈ వరలక్ష్మీ వ్రతం విశిష్ఠత, అచరించవలసిన విధానాన్ని తెలియచేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. త్రేతాయుగంలో కుండలినీ నగరంలో నివసించిన చారుమతి అనే భక్తురాలు వరలక్ష్మీ నోము ఆచరించి పొందిన ఫలప్రదాన్ని ఈ సందర్భంగా వివరించారు. వరలక్ష్మీవ్రతంలో పాల్గొన్న మహిళలకు సత్సంతానం, దీర్ఘమాంగల్యసౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం, కుటుంబసౌఖ్యం వంటి ఎన్నో మహాఫలాలు కలుగుతాయన్నారు. ఆ తరువాత అమ్మవారికి నైవేద్యాలను నివేదించారు. అనంతరం మహా మంగళ హరతితో వరలక్ష్మీ వ్రతం ముగిసింది.

ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టిటిడి బోర్డు సభ్యులు  గోవిందహరి, శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి, జెఈఓ పి.బసంత్ కుమార్, అదనపు సివిఎస్వో శివకుమార్ రెడ్డి, ఆల‌య డెప్యూటి ఈఓ శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో సుబ్ర‌మ‌ణ్యం, సూపరింటెండెంట్ గోపాలకృష్ణారెడ్డి, అర్చ‌కులు బాబుస్వామి త‌దిత‌రులు పాల్గొన్నారు.

294 thoughts on “తిరుప‌తి‌, 2020 జూలై 31: శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా వరలక్ష్మీవ్రతం”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *