తిరుమల, 2020 అక్టోబర్ 14: అక్టోబ‌రు 15న శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

 అక్టోబ‌రు 15న శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుమల, 2020 అక్టోబర్ 14: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబ‌రు 16 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేర‌కు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల త‌ర‌హాలోనే నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా ఏకాంతంగా నిర్వహించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. 

నవరాత్రి బ్ర‌హ్మోత్స‌వాలను పురస్కరించుకుని అక్టోబ‌రు 15న గురువారం రాత్రి 7 నుంచి 8 గంటల మ‌ధ్య‌ అంకురార్పణ నిర్వహిస్తారు. ఈ సంద‌ర్భంగా శ్రీ విష్వ‌క్సేనుల వారిని రంగ‌నాయ‌కుల మండ‌పంలోకి వేంచేపు చేసి ఆస్థానం చేప‌డ‌తారు.
వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. వైఖానస ఆగమాన్ని పాటించే తిరుమల మరియు ఇతర ఆలయాల్లో ఉత్సవాలకు ఒక రోజు ముందు అంకురార్పణం నిర్వహించడం ఆనవాయితీ. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది. అదేరోజు రాత్రి బ్రహ్మోత్సవాలకు నవధాన్యాలతో అంకురార్పణం జరుగుతుంది.
కల్యాణ మండపంలో వాహ‌న‌సేవ‌లు
 శ్రీవారి ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో గ‌ల కల్యాణ మండ‌పంలో వాహ‌న‌సేవ‌లు జ‌రుగుతాయి. ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు. న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో తొలి రోజైన అక్టోబ‌రు 16న ఉద‌యం 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు బంగారు తిరుచ్చి ఉత్స‌వం, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు పెద్ద‌శేష వాహ‌న‌సేవ జ‌రుగుతాయి. అక్టోబ‌రు 20న రాత్రి 7 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు గ‌రుడ‌సేవ జ‌రుగుతుంది. అక్టోబ‌రు 21న మ‌ధ్యాహ్నం 2 నుండి 3 గంట‌ల వ‌ర‌కు వ‌సంతోత్స‌వ ఆస్థానం, మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు కల్యాణ మండ‌పంలో పుష్ప‌క విమానంపై స్వామి, అమ్మ‌వార్లు ద‌ర్శ‌న‌మిస్తారు. అక్టోబ‌రు 23న ఉద‌యం 8 గంట‌ల‌కు స్వ‌ర్ణ‌ర‌థం బ‌దులుగా స‌ర్వ‌భూపాల వాహ‌న‌సేవ ఉంటుంది. అక్టోబ‌రు 24న ఉద‌యం 6 నుండి 9 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలోని అద్దాల  మండపంలో స్న‌ప‌న‌తిరుమంజ‌నం, చ‌క్ర‌స్నానం నిర్వ‌హిస్తారు. 
అక్టోబ‌రు 25న ఏకాంతంగా విజ‌య‌ద‌శ‌మి పార్వేట ఉత్స‌వం
శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల మ‌రుస‌టి రోజు అక్టోబ‌రు 25న విజ‌యద‌శ‌మి పార్వేట ఉత్స‌వం ఏకాంతంగా జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని కల్యాణ మండపానికి శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని వేంచేపు చేస్తారు. అక్క‌డ పార్వేట ఉత్స‌వం అనంత‌రం స్వామివారిని రంగ‌నాయ‌కుల మండ‌పంలోకి వేంచేపు చేస్తారు.            

266 thoughts on “తిరుమల, 2020 అక్టోబర్ 14: అక్టోబ‌రు 15న శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ”

  1. At the beginning, I was still puzzled. Since I read your article, I have been very impressed. It has provided a lot of innovative ideas for my thesis related to gate.io. Thank u. But I still have some doubts, can you help me? Thanks.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *