నటనకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలు తీయాలి: సంచాలకులు మామిడి హరికృష్ణ

నటనకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలు తీయాలి: సంచాలకులు మామిడి హరికృష్ణ

నటీనటుల నుండి సరైన నటనను రాబట్టుకుంటూనే, నటనకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలు తీయాలని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు.

తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ప్రతివారం నిర్వహిస్తున్న సినివారంలో 2021, మార్చి 20న ప్రభాకర్ సింగపంగ దర్శకత్వం వహించిన ‘సిపాయి’ మరియు కె. శ్రీశైలం దర్శకత్వం వహించిన ‘గిఫ్ట్’ లఘుచిత్రాల ప్రదర్శన, టీంలతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మామిడి హరికృష్ణ చిత్ర బృందాలను అభినందించి, పోచంపల్లి ఇక్కత్ హండ్లూమ్ ఓవెన్ శాలువాతో సత్కరించారు. దీక్షిత్ దర్శకత్వంలో రూపొందిన ‘అన్వేషణ’ లఘుచిత్ర పోస్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా, హరికృష్ణ మాట్లాడుతూ… ఎవరూ వెళ్ళని కొత్తమార్గంలో వెళితే గుర్తింపు లభిస్తుందని, కొత్తతరం సినీ దర్శకులు తమతమ మేదస్సుల్లోంచి కొత్త కంటెంట్ ను వెలికితీయాలని అన్నారు. అనుకరణ అనేది లేకుండా తమదైన శైలీలో కొత్తదనాన్ని చూపిస్తే విజయం సాధించగలుగుతామని, ఆ దిశగా యంగ్ ఫిలింమేకర్స్ తమ ఆలోచనలకు పదునుపెట్టాలని తెలిపారు.

దేవుడు ఇచ్చిన జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాలికానీ, మధ్యలోనే జీవితాన్ని ముగించొద్దు అన్న కథాంశంతో కె. శ్రీశైలం దర్శకత్వం వహించిన ‘గిఫ్ట్’ ఫిల్మ్… తను నమ్ముకున్న దారిలో జీవితాన్ని గెలవడానికి సిపాయిలా తన జీవన పోరాటాన్ని సాగించిన యువకుడి కథాశంతో ప్రభాకర్ సింగపంగ దర్శకత్వం వహించిన ‘సిపాయి’ ఫిల్మ్ లు మంచి సందేశాన్ని చాటాయని పేర్కొంటూ, సాంస్కృతిక శాఖ తరపున అనేక కార్యక్రమాలను రూపొందించేందుకు నిరంతరం స్ఫూర్తిగా నిలుస్తున్న గౌరవ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి, తనకు ప్రోత్సాహాం అందిస్తున్న సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు వి. శ్రీనివాస్ గౌడ్ గారికి, ప్రభుత్వ సలహాదారులు కె.వి. రమణాచారి గారికి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కె.ఎస్. శ్రీనివాస రాజు గారికి కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో చిత్రబృందాలు పాల్గొని చిత్ర విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రేమికులు, యంగ్ ఫిలిం మేకర్స్ పాల్గొన్నారు.

 

సినివారం (20.03.2021)
ప్రభాకర్ సింగపంగ దర్శకత్వం వహించిన ‘సిపాయి’ మరియు కె. శ్రీశైలం దర్శకత్వం వహించిన ‘గిఫ్ట్’ లఘుచిత్రాల ప్రదర్శన, టీంలతో ముఖాముఖి కార్యక్రమం
సాయంత్రం 6 గం.ల నుండి 
20 మార్చి, 2021. శనివారం
పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్, 2వ అంతస్తు, రవీంద్రభారతి

(Courtesy: Cinivaram సినివారం)

Print Friendly, PDF & Email
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *