శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 23.10.20: దసరా మహోత్సవాలు – ఏడవ రోజు కుమారి పూజ, కాళరాత్రి అలంకారం, గజవాహనసేవ

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: దసరా మహోత్సవాలు – ఏడవ రోజు కుమారి పూజ, కాళరాత్రి అలంకారం, గజవాహనసేవ

శ్రీశైల దేవస్థానంలో దసరా మహోత్సవాలలో భాగంగా ఏడవ రోజైన ఈ రోజు (23.10.2020) ఉదయం ప్రాత: కాలపూజలు, విశేషకుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్టానాలు, పారాయణలు, సూర్య నమస్కారములు, చండీహోమం, పంచాక్షరి, భ్రామరి, బాలా జపానుష్ఠానములు, చండీ పారాయణ, చతుర్వేద పారాయణలు, కుమారీపూజలు జరిపించబడ్డాయి. శ్రీస్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, రుద్రయాగాంగ జపములు, రుద్రపారాయణలు తదితర కార్యక్రమాలు జరిపించబడ్డాయి.

అదేవిధంగా ఈ సాయంకాలం జపములు, పారాయణలు, నవావరణార్చన, కుంకుమార్చన, చండీ హోమం జరిపించబడింది.

ఈ రోజు రాత్రి కాళరాత్రిపూజ, మంత్రపుష్పం, అమ్మవారి ఆస్థాన సేవ, సువాసినీ పూజలు జరుగాయి.

కుమారి పూజ
దసరా మహోత్సవాలలో భాగంగా కుమారి పూజలు నిర్వహించడం జరుగుతోంది.
ఈ కుమారి పూజలో రెండుసంవత్సరాల నుంచి పదిసంవత్సరాల వయస్సు ఉన్న బాలికలను పూలు, పండ్లు, నూతన వస్త్రాలను సమర్పించి పూజించడం జరుగుతుంది. కుమారి పూజ నవరాత్రి ఉత్సవాలలో ఒక ముఖ్యమైన సంప్రదాయం.

కాళరాత్రి అలంకారం


ఈ నవరాత్రి మహోత్సవాలలో చేయబడుతున్న నవదుర్గ అలంకారాలలో భాగంగా శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తిని కాళరాత్రి స్వరూపంలో అలంకరింపజేయడం జరుగుతుంది.
నవదుర్గ స్వరూపాలలో ఏడవ రూపం ఈ కాళరాత్రి. ఈ దేవి నల్లటి దేహఛాయతో జుట్టు విరియబోసుకొని పెడబొబ్బ నవ్వులతో రౌద్రరూపములో ఉంటుంది. ఈ దేవి చతుర్భుజాలను కలిగి ఉండి, కుడివైపున అభయహస్తం, వరద ముద్రను, ఎడమవైపు ఖడ్గము, లోహకంటకాన్ని ధరించి ఉంటుంది. కాళరాత్రి స్వరూపం చూడటానికి రౌద్రంగా ఉన్నప్పటికీ ఈమె ఎల్లప్పుడూ శుభ ఫలితాలనే ఇస్తుంది. అందుకే ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు.

దసరా మహోత్సవాలలో ఏడవనాడు కాళరాత్రిదేవిని పూజించాలని చెప్పబడింది. కాళరాత్రి దేవి దుష్ట శక్తులను నాశనం చేస్తుంది. ఈ దేవిని కేవలం స్మరించనంత మాత్రమే భూత, ప్రేత, పిశాచాదులు భయపడి పారిపోతాయని, ఈ దేవిని ఆరాధించడం వలన భయాలనేవేవి ఉండవని, సర్వదా సాధకుడు భయదూరుడవుతాడని భక్తుల విశ్వాసం.

గజవాహనసేవ


ఈ ఉత్సవాలలో శ్రీస్వామిఅమ్మవార్లకు నిర్వహిస్తున్న వాహనసేవలలో భాగంగా ఈ రోజు గజవాహన సేవ జరిపించబడింది.

ఈ వాహనసేవలో శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరింపజేసి, గజవాహనంపై వేంచేబు చేయించి పూజాదికాలు చేయబడ్డాయి.

రేపు రాష్ట్ర ప్రభుత్వంచే పట్టు వస్త్రాల సమర్పణ
దసరా మహోత్సవాలను పురస్కరించుకుని రేపు (24.10.2020) సాయంకాలం రాష్ట్ర ప్రభుత్వం తరుపున రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన, శిక్షణ మరియు కర్మాగారాలశాఖామాత్యులు శ్రీ గుమ్మనూరు జయరామ్ శ్రీస్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పిస్తారు. ఈ సమర్పణ కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించబడుతాయి. తరువాత మేళతాళాలతో గౌరవ మంత్రివర్యులు ఆలయప్రవేశంచేసి వేదపండితులు, అర్చకస్వాముల మంత్రోచ్ఛరణలతో వస్త్ర సమర్పణను చేస్తారు.

ఎంతో చారిత్రక ప్రసిద్ధి పొందిన శ్రీశైల క్షేత్రంలో ఎందరో చక్రవర్తులు, రాజులు, రాజకుటుంబీకులు మొదలైన వారు ఆయా ఉత్సవ సందర్భాలలో శ్రీస్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించేవారని ప్రతీతి. ఈ సంప్రదాయాన్ని అనుసరించే రాష్ట్ర ప్రభుత్వం ఏటా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలోను మరియు దసరా మహోత్సవాలలోను పట్టువస్త్రాలను అనవాయితీగా సమర్పిస్తోంది.

2 thoughts on “శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 23.10.20: దసరా మహోత్సవాలు – ఏడవ రోజు కుమారి పూజ, కాళరాత్రి అలంకారం, గజవాహనసేవ”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *