శ్రీశైలం: శ్రీశైల దేవస్థానంలో ఈ రోజు నుండి ఏడు రోజులపాటు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

శ్రీశైల దేవస్థానంలో ఈ రోజు నుండి ఏడు రోజులపాటు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

శ్రీశైల దేవస్థానం: మకర సంక్రమణ పుణ్యకాలం సందర్బంగా  పంచాహ్నిక దీక్షతో ఏడు రోజుల పాటు నిర్వహించే సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఈ రోజు 11.01.2021 న  ప్రారంభమయ్యాయి. ఏడు రోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు 17వ తేదీతో ముగియనున్నాయి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

 బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ జ్యోతిర్లింగస్వరూపుడైన శ్రీమల్లికార్జునస్వామివారికి విశేషార్చనలు, మహాశక్తిస్వరూపిణి అయిన శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు, రుద్రహోమం, చండీహోమం,నవగ్రహ మండపారాధనలు, కలశార్చనలు,జపాలు, పారాయణలు జరుగుతాయి.

ఈ పారాయణలో భాగంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా స్కాందపురాణములోని శ్రీశైలఖండ పారాయణ కూడా చేస్తున్నారు.

ఈ ఉదయం 8.30గంటల నుంచి ఆలయ ప్రాంగణంలో ఉత్సవ ప్రారంభ కార్యక్రమాలు ఆగమ శాస్త్రానుసారం జరిగాయి.

బ్రహ్మోత్సవ ప్రారంభసూచకంగా అధికారులు ఆలయ అర్చకులు, వేదపండితులు సంప్రదాయబద్ధంగా యాగశాల ప్రవేశం చేశారు.

తరువాత వేదపండితులు చతుర్వేదపారాయణలతో వేదస్వస్తి నిర్వహించారు.

శివసంకల్పం:

వేదస్వస్తి తరువాత దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించ కుండా సకాలంలో తగినంత వర్షాలు కురువాలని, దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికి ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు జరగకుండా ఉండాలనీ, దేశంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరు సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు, వేదపండితులు లోక కల్యాణ సంకల్పాన్ని చెప్పారు.

గణపతిపూజ:

సంకల్పపఠనం తరువాత ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజను చేసారు.

చండీశ్వరపూజ:

గణపతి పూజ తరువాత శివ సంచార దేవతలలో ఒకరైన చండీశ్వరునికి విశేషపూజ జరిపారు. ఈ చండీశ్వరుడు స్వామివారి బ్రహ్మోత్సవ ఏర్పాటు చేస్తూ ఉత్సవాలను నిర్వహిస్తార ని ప్రతీతి.

కంకణపూజ – కంకణ ధారణ:

చండీశ్వర అర్చన తరువాత కంకణాలకు  పూజాదికాలుచేసారు. అనంతరం అధికారులు, అర్చకస్వాములు, స్థానాచార్యులు కంకణాలను ధరించారు.

ఋత్విగ్వరణం:

కంకణధారణ తరువాత ఋత్విగ్వరణం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో ఆయా వైదిక కార్యాలను నిర్వహించమని ఋత్వికులను ఆహ్వానిస్తూ వారికి దీక్షావస్త్రాలను అందజేసే కార్యక్రమానికే ఋత్విగ్వరణం అని పేరు.

అఖండదీప స్థాపన:

తరువాత అఖండ దీపస్థాపన, వాస్తుపూజ, వాస్తు హోమం జరిపారు.

వాస్తు హోమం తరువాత మండపారాధన, పంచావరణార్చన, ప్రధాన కలశస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు.

సాయంకాలం కార్యక్రమాలు అంకురార్పణ:

ఈ రోజు సాయంకాలం అంకురార్పణ జరిగింది . ఈ కార్యక్రమంలో ఆలయ ప్రాంగణంలోని నిర్ణీత ప్రదేశంలోని మట్టిని సేకరించి సంప్రదాయబద్ధంగా యాగశాలకు తీసుకువచ్చారు. తరువాత ఈ మట్టిని 9 పాలికలలో ( మూకుళ్లలో) నింపి దాంట్లో నవధ్యానాలు పోసి ఆ మట్టిని

మొలకెత్తించేపనిని ప్రారంభిన్చారు . ఈ పాలికలలో రోజు నీరు పోసి నవధ్యానాలు పచ్చగా మొలకెత్తేలా చేస్తారు. ఈ విధంగా అంకురాలను ఆరోరింపజేసే కార్యక్రమం కాబట్టే దీనికి అంకురార్పణ అని పేరు.

ధ్వజారోహణ:

అంకురార్పణ తరువాత  ధ్వజారోహణకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఆలయ ప్రాంగణంలోని ప్రధాన ధ్వజస్తంభం మీద పతావిష్కరణ  “ధ్వజారోహణ”. ఈ కార్యక్రమములో ఒక కొత్త వస్త్రం మీద పరమశివుని వాహనమైన నందీశ్వరుని, అష్టమంగళ చిత్రాలను చిత్రీకరించారు. దీన్నే ‘నంది ధ్వజపటం’ అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన తాడును వాడారు.

ఈ నంది ధ్వజపటాన్ని ఊరేగింపుగా, ధ్వజస్తంభం వద్దకు తెచ్చి, చండీశ్వరస్వామి సమక్షములో పూజాదికాలను చేసారు.

ధ్వజారోహణలో భాగంగానే భేరీ పూజ, కూడా నిర్వహించారు. ఈ భేరీ పూజలో డోలు వాద్యానికి పూజాదికాలు జరిపారు. తరువాత నాదస్వరంపై ఆయా రాగాల ఆలాపనతో దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.

చివరగా ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేసారు. ధ్వజస్తంభం మీద  ఈ నంది పతాకమే సకల దేవతలకు, యక్ష, గంధర్వ గణాలకు ఆహ్వానం అన్నమాట. ఈ ఆహ్వానంతో విచ్చేసిన దేవతలకు నిర్ణీత స్థలాలు కేటాయించి రోజూ విధివిధానంగా వారికి నివేదన సమర్పిస్తారు.

ఈ బ్రహ్మోత్సవాలలో సకల దేవతలు క్షేత్రములోనే ఉంటూ ఉత్సవాలను తిలకిస్తారని ఆగమశాస్త్రాలు పేర్కొంటున్నాయి.

రేపటి కార్యక్రమాలు

ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు 12.01.2021 న  శ్రీస్వామి అమ్మవార్లకు విశేష పూజలు, చండీశ్వరపూజ, మండపారాధనలు, పంచావరణార్చనలు, జపానుష్ఠానాలు, రుద్రహోమం, సాయంకాల నిత్యహవనాలు, బలిహరణలు మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో భాగంగా రేపు సాయంకాలం శ్రీస్వామిఅమ్మవార్లకు భృంగివాహనసేవ ఆలయ ప్రాకారోత్సవం, ఆలయమాడవీధులలో శ్రీస్వామిఅమ్మవార్ల ఊరేగింపు జరుపుతారు

సామూహిక భోగిపండ్లు

భోగిరోజున  13వ తేదీన ఉదయం ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఉచితంగా సామూహిక భోగిపండ్ల కార్యక్రమం నిర్వహిస్తారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఈ సామూహిక భోగిపండ్ల కార్యక్రమాలు చేపట్టారు.

5 సంవత్సరాల వరకు వయస్సుగల చిన్నారులకు ఈ భోగిపండ్లు పోస్తారు.

ఈ భోగిపండ్ల కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు 12వ తేదీ సాయంత్రం గం.5.00లలోపల ప్రచురణల విభాగంలో వారి పేర్లను నమోదు చేసుకోవలసి ఉంటుంది.

ముగ్గుల పోటీలు 

సంక్రాంతి సందర్భంగా  మహిళలకు ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తారు. సంక్రాంతి రోజున 14వ తేదీన ఈ పోటీలు ఉంటాయి. ముగ్గుల పోటీలలో పాల్గొనదలచిన వారు 13వ తేదీ సాయంత్రం గం.5.00లలోగా ప్రచురణల విభాగంలో పేర్లను నమోదు చేసుకోవలసి ఉంటుంది.

27 thoughts on “శ్రీశైలం: శ్రీశైల దేవస్థానంలో ఈ రోజు నుండి ఏడు రోజులపాటు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు”

  1. I have read your article carefully and I agree with you very much. This has provided a great help for my thesis writing, and I will seriously improve it. However, I don’t know much about a certain place. Can you help me?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *