స్వర రాగ గీతం ఎపిసోడ్-16 రాగస్ఫూర్తి “ధర్మవతి” రాగం భక్తి పారవశ్యంలో ఓలలాడించి, భక్తి పారవశ్యంలో పరవశించింది

స్వర రాగ గీతం ఎపిసోడ్-16 రాగస్ఫూర్తి ధర్మవతి రాగం భక్తి పారవశ్యంలో ఓలలాడించి, భక్తి పారవశ్యంలో పరవశించింది

Swara Raga Geetham ” Dharmavathi Ragam” Episode-16, September, 19th 2020 (8 PM EST)

 

కార్యక్రమం ఎపిసోడుని స్పాన్సర్ చేసిన వారు కాంచ్ టెక్నాలజీస్ (Conch Technologies), మధు మారేడు & పూర్ణ పెరవలి and Kutir.com

 

ఆదిలో మన విద్య లయబద్ధమే, వేదాలు నాలుగు సంగీతమే, సంగీతమేదైన సాధించులే, వినోదం వికాసం విరాజిల్లులే అన్నారు పెద్దలు. అలాగే  ప్రముఖ కవి ఆరుద్రగారు కూడా ఒక సినిమా పాటలో పాడుకో, పాడుతూ  చదువుకో అన్నారు.. అలా సంగీతాన్ని వింటూ ఆస్వాదిస్తూ ఆనందిస్తూ రాగాల పాఠాలను చదువుకుంటూ కొనసాగుతున్న మన స్వర రాగ గీతం కార్యక్రమం మీ అందరి ప్రోత్సాహంతో మరింత కాలం దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటూ… కొనసాగుతుందని ఆశిస్తూ… స్వర రాగ గీతం స్వర వేదిక, కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న “స్వర రాగ గీతం”లో  ఇవాళ్టి ఈ సంచికలో మేం మీకు వినిపించబోతున్న రాగం… రాగ స్ఫూర్తి “ధర్మవతి”, ఎపిసోడ్ 16 కార్యక్రమానికి స్వాగతం పలికారు ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, వ్యాఖ్యాత, కార్యక్రమం నిర్వాహకుడు, పార్థసారథి నేమాని (పార్థు).

 

ధర్మవతి రాగం:

ఆరోహణ: స రి గ మ ప ద ని స  – SA RI GA MA PA DA NI ṠA   

అవరోహణ: స ని ద ప మ గ రి స – SA NI DA PA MA GA RI SA

ధర్మవతి రాగంలోని స్వర స్థానాలు

స  SA – షడ్జమం Shadjamam

రి  RI – చతుశ్రుతి రిషభము Chatusruthi Rishabham

గ  GA – సాధారణ గాంధారం Sadharana Gaandhaaram

మ MA – ప్రతి మధ్యమం  Prathi Madhyamam

ప  PA – పంచమం PANCHAMAM

ద DA – చతుశ్రుతి దైవతం Chatusruthi Daivatham

ని NI – కాకలి నిషాదం Kakali Nishadam

స  SA – షడ్జమం  Shadjamam

అవరోహణలో కూడా ఇవే స్వరస్థానాలు వస్తాయి

ధర్మవతి రాగం సంపూర్ణ రాగం, అంటే ఏడు స్వరాలూ ఉంటాయి. ఇది 72 మేళకర్తలో 59వ మేళకర్త రాగము. ప్రతి మధ్యమ రాగము. ఈ రాగంలో భక్తి, ఆధ్యాత్మికత, విరహం వంటి భావాలను అద్భుతంగా పలికించచ్చు. అలాగే ఈ రాగాన్ని ఎవరైతే వింటారో, పాడుకుంటారో వాళ్ళలోని భావోద్వేగాలు బయటకు వచ్చి వాళ్ళు నిరాశానిస్పృహలకు లోనుకాకుండా ఉంటారని ఒక వాదన. అంటే ఈ రాగం డిప్రెషన్ను దూరం చేస్తుందన్నమాట. అలాగే కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఈ ధర్మవతి రాగం వింటే వారికి ఊరట కలుగుతుందని మ్యూజిక్ థెరపిస్ట్స్ స్కాలర్స్ చెప్పేమాట.

పదకవితాపితామహులు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు 32వేల ఆధ్యాత్మిక కీర్తనలు రచించిన విషయం చరిత్ర చెబుతోంది మనకి. వీటిలో అధిక శాతం శ్రీవేంకటేశ్వరుని స్తుతిస్తూ ఉన్న కీర్తనలేఅయినప్పటికీ కూడా అన్నమాచార్యులవారు ఇతర దేవతా మూర్తులను కొలుస్తూ తెలుగు, సంస్కృత భాషలలో రాసిన కీర్తనలు కూడా చాలానే ఉన్నాయి. వాటిలో ధర్మావతి రాగంలో గాయకుడు, వాక్యత, సంగీత దర్శకుడు పార్థు నేమాని కంపోజ్ చేసిన లక్ష్మీ నరసింహ స్వామి స్తుతి అన్నమాచార్యులవారి కీర్తన నమిత దేవం భజే నారసింహం.

“నమిత దేవం భజే నారసింహం… సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం

విమల నరసింహం విక్రమ నృసింహం… కమనీయ గుణగణాకర నృసింహం

అమిత సుశ్రీ వేంకటాద్రి నరసింహం…రమణీయ భూషాభిరామ నరసింహం”…

తాను స్వయంగా స్వరపరచిన ఈ  లక్ష్మినరసింహుని కీర్తనను పార్థు నేమాని ఎంతో…ఎంతో అద్భుతంగా పాడి భక్తి పారవశ్యంలో ఓలలాడించి…ఈనాటి ఈ సంచికను ఆధ్యాత్మిక భావనలతో మొదలుపెట్టారు.

వాఖ్యాత పార్థు మాట్లాడుతూ…. కళాతపస్వి కె. విశ్వనాథ్ గారు తీసిన  కళాత్మక చిత్రాల్లో స్వర్ణకమలం ఇస్ వన్ అఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్. స్వర్ణకమలంలో హీరోయిన్ ఊహించుకున్న జీవితం వేరు, ఇంట్లో పరిస్థితులు వేరు.  ఆమె నాట్యాన్ని వద్దనుకుంది. బలవంతం చేసిన కొద్దీ మొండికేసింది. అలాంటి దశలో కథ మలుపు తిరిగింది. హీరో సహకారంతో కళ అర్థాన్ని పరమార్థాన్ని ఆమె మనస్ఫూర్తిగా గ్రహించింది. ఆమె హృదయంలోని సడి కాలి అందెలలోని సవ్వడితో చేతులు కలిపింది… ఆనందం అంబరాన్ని అంటింది.

నటరాజ నాట్య వైభవం ఆమె అభినయంలో తొంగి చూసింది. విశ్వనాధ్ గారు, సిరివెన్నెల గారు, ఇళయరాజా గారు, బాలు, వాణీ జయరాం గార్లు ఇంతమంది మహానుభావుల అద్భుత సృష్టి ఈ పాట… 

“అందెల రవమిది పదములదా… అంబరమంటిన హృదయముదా

అమృత గానమిది పెదవులదా… అమితానందపు ఎద సడిదా

సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగా యాగ ఫలముగా…

బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా…” అనే ఈ కళాత్మకమైన పాటను గాయని మానస గాడేపల్లి ఎంతో అద్భుతంగా పాడి వీక్షకుల హృదయాలను పరవశించేటట్టు చేసింది, వీనుల విందు చేసింది. 

భక్తి మార్గాలు తొమ్మిది రకాలు. అందుకే నవవిధ భక్తి మార్గాలు అన్నారు. వీటిలో సంకీర్తన లేక భజన ఒక మార్గం. ఏ మార్గంలో వెళ్లినా మనసు, మాట, చేత ఒకటే కావాలన్నారు పోతనగారు. భారతీయ భాషల్లో భక్త కవులందరూ భజన పాటలను  రాసి స్వరపరిచారు మన మనసులకు ఒక మార్గాన్ని చూపించారు.

ప్రముఖ వాగ్గేయకారుడు మైసూర్ వాసుదేవాచార్యవారు తన మనసును మన అందరి మనసులను ఉద్దేశించి ధర్మవతి రాగంలో స్వరపరిచిన “భజన సేయరాదా ఓ మనసా శ్రీరాముని….భజన సేయరాదా ఓ మనసా శ్రీరాముని” కీర్తనను గాయని మానస నేరెళ్ల ఎంతో చక్కగా పాడి భక్తి పారవశ్యంలో ఓలలాడించింది.

ధర్మవతి రాగాన్ని హిందుస్థానిలో మధువంతి అని పిలుస్తారు.ఈ రాగంలో హిందీ సినిమా పాటలు కూడా హిట్ అయ్యాయి. పాపులర్ ఫిలిం డైరెక్టర్ ఎస్. శంకర్ పెద్ద బడ్జెట్తో సినిమాలు తీసే డైరెక్టర్స్ లో ఇండియాలోనే మొట్ట మొదటి వరుసలో ఉంటారు. శంకర్ తన ఫస్ట్ అట్టెంప్ట్ గా 1993 లో తీసిన జెంటిల్మెన్ సినిమా ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా భారతీయ భాషలన్నింటిలోనూ డబ్ చేయబడింది. అన్నిటిలోను సూపర్ హిట్ కూడా అయింది.

ఇందులో ఎ.ఆర్. రహమాన్ తమిళ వెర్షన్ లో వైరముత్తు గారి సాహిత్యాన్ని ధర్మవతి రాగం లో “ఒట్టగత్త కత్తికొ  ” అంటూ కంపోజ్ చేసిన  ఈ పాట అప్పట్లో ఒక ఊపు ఊపేసింది. ఇదే సినిమా జెంటిల్మెన్ పేరుతోనే తెలుగులో డబ్ చేయబడింది. రాజశ్రీ గారు ఈ పాటని “కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో కోటి వన్నెలున్నదాన” అంటూ ప్రతి ఇంటికి చేర్చారు. ఇప్పుడు ఈ పాటని తెలుగు, తమిళ భాషల్లో గాయని స్నిగ్ధ మల్లాది ఎంతో ఎంతో హుషారుగా పాడి వీక్షకులకు కనువిందుచేసింది.

వైవిధ్యానికి మారుపేరు అన్నమాచార్యులవారు. నీతి చెప్పడం నిలదీయడం. సన్నిహితంగా ఉంటూనే సున్నితంగా చురకలు పెట్టడం, మెచ్చుకోవడం మేలమాడటం లాంటివి వారి రచనలలో కనిపిస్తాయి. అలాగే అంతరంగాన్ని ఆవిష్కరించి అంతర్యామిని శరణువేడుకోవడం కూడా కనిపిస్తుంది. అలాంటి కీర్తనే “గోవిందాశ్రిత గోకుల బృందా పావన జయజయ పరమానంద” ధర్మవతి రాగం లో అద్భుతంగా స్వరరచన  చేసినటువంటి ఈ కీర్తన పల్లవిని వినిపించబోతున్న గాయకుడు “పార్థు నేమాని” అంటే నేనేనండీ అని తనకు తానె పరిచయం చేసుకుని పార్థు నేమాని ఈ కీర్తనను ఎంతో చక్కగా పాడి ఆకట్టుకున్నారు.

పార్థు నేమాని మరో విషయాన్నీ గురించి వివరిస్తూ…. తిరుమల ఆనంద నిలయంలో శ్రీవారు ఉంటే, వారికి ఎదురుగా చిరంజీవి హనుమ చేతులు జోడించి దర్శనమిస్తాడు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఆరవరోజు శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి తన భుజాల మీద విహరించే ఆనంద క్షణాల కోసం శ్రీరామదూత వేచి ఉంటాడు. అందుకేనేమో అన్నమాచార్యులవారు పవనాత్మజుణ్ణి శృతిస్తు అనేక కీర్తనలు రచించారు. వీటిలో శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ధర్మవతి రాగంలో స్వరపరిచిన ఒక అందమైన రచన ఉంది.

వాయిపుత్రుని సాహసాలకు హారతి పట్టే  ఈ “మంగాంబుధి హనుమంతా నీ శరణ మంగవించితిమి హనుమంతా” అనే  కీర్తనను ఆనందానుభూతిలో ముంచేత్తేలా పాడి భక్తి పారవశ్యంలో ఓలలాడించి అమితంగా ఆకట్టుకుంది గాయని శ్రేయ లక్ష్మీ కోడెల.

 

టీనేజ్ సైకాలజీలో మోస్ట్ అఫ్ ది కేసెస్ లో ఆకర్షణ తప్ప ఆలోచన ఉండదు. ఆటవిడుపు తప్ప బాధ్యత వుండదు. దీన్ని బేస్ వేసుకుని తీసే లవ్ స్టోరీస్ కీ బాక్సాఫీస్ దెగ్గర మినిమం గ్యారంటీ ఉంటుంది. ఈ ఫార్ములాను ఉపయోగించి విజయం సాధించిన సినిమాలు చాలా భాషల్లో చాలానే ఉన్నాయి. 2004లో రిలీజ్ అయిన తమిళ్ ఫిలిం  ” 7G రెయిన్బో కాలని” అప్పట్లో ఒక పెద్ద ట్రెండ్ సెట్టర్. ఇళయరాజ అబ్బాయి యువన్ శంకర్ రాజా కంపోజ్ చేసిన మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్.

ఆయన ధర్మవతి రాగం లో కంపోజ్ చేసిన సూపర్ హిట్ సాంగ్ “కణా కాణుం కాలంగళ్ కరైందొడుం నేరంగల్ కళైయాద కోలం  పొదుమో” అని గాయని గాయకులు విజయ్ రామసుబ్రహ్మమణియన్, నిధి రావు ఎంతో హుషారుగా పాడి  వీక్షకులకు కనువిందుచేసారు.

పార్థు తన వాఖ్యానం కొనసాగిస్తూ….ఆ శ్రీరామచంద్ర స్వామిని కీర్తిస్తూ తూము నరసింహ దాసుగారు రాసిన వందలాది కీర్తనల్లో ధర్మవతి రాగంలో తాను కంపోజ్ చేసిన ఒక సంకీర్తన “రామా నీ దయ రాదా… రామా నీ దయ రాదా” అని ఎంతో చక్కగా పాడి భక్తి పారవశ్యంలో పరవశించేటట్టు చేసాడు.

అమ్మవారు పరమాత్మ ప్రకాశిని పరంజ్యోతి వికాసిని. కాశి మొదలుకొని కంచి వరకు అంతటా కొలువున్న ఆ పరంధామవతిని  ముత్తు స్వామి దీక్షితుల వారు భక్తితో దర్శించారు, అనేక విభక్తులతో కీర్తించారు.

ధర్మవతి రాగంలో గురుగుహసాక్షాత్కారం పొందిన ఈ వాగ్గేయకారుడు రచించి, స్వరపరచిన “పరంధామవతి  జయతి పార్వతి పరమేశ యువతి” అన్న ఈ కృతిని గాయని ఈషా వరకుర్ జయతి అంటూ ఎంతో చక్కగా పాడి భక్తి పారవశ్యంలో పరవశించేటట్టు చేసింది.

మెలోడీ బ్రహ్మ మణి శర్మ గారు కంపోజ్ చేసిన అనేక మెలోడీస్ లో “నేటి గాంధీ” సినిమా కోసం ధర్మవతి రాగంలో ఆయన మంచి మెలోడీ కంపోజ్ చేసారు. అయితే ఈ సినిమాకి నేను మణిశర్మ గారికి  అసోసియేట్ గా పని చేయడం జరిగింది. ఈ పాటని నా వాయిస్ తోనే షూట్ చేశారు. నేను సుజాత గారు ముందు పాడితే తర్వాత బాలసుబ్రమణ్యం గారు మిక్స్ చేసారు అని పార్థు చెప్పారు. “ఈ బొమ్మ నాకోసం అని ఆ బ్రహ్మ ఆదేశం ఈ జన్మ నీకోసం అని నా ప్రేమ సందేశం కంగారు పడిపోనా అరెరెరే కాదంటే ఎవరైనా ఆ జోరే తగదన్నా.. సరే సరే చూస్తారే ఎవరైనా నేనాగ గలనా ఎవరేమి అనుకున్నా” అంటూ ఆ పల్లవిని ఎంతో హుషారుగా పాడి వినిపించి అలరించారు పార్థు.

 పార్థు వాఖ్యానిస్తు… మెటల్ ఎంత గొప్పదైనా మేకింగ్ ఎంత మంచిదైనా ఒక చైన్లో ప్రతి లింక్ చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న లింక్ పోయిందనుకోండి చైనే చేయిజారిపోతుంది. జీవితం కూడా అలాంటిదే. మన జీవితంలో చిన్న చిన్న లింక్స్  చాలా ఉంటాయి. ఇవి మిస్సయ్యామనుకోండి  జీవితంలో ఎసెన్స్ పోతుంది, యూనీక్నెస్ పోతుంది, ఒక్కోసారి జీవితమే చేయిజారి పోతుంది.  ఈ విషయాన్నీ ఈ జనరేషన్ కి సూటిగా రీచ్ అయ్యేలా చెప్పడం చంద్రబోస్ గారికి పెన్నుతో పెట్టిన విద్య.

జాయ్ ఫుల్ గా, జాలీగా డోంట్ మిస్ సోదర బోస్ గారు భుజం తడుతూ రాస్తే, వందేమాతరం శ్రీనివాస్ గారు మెలోడీని, రిథమ్ ని మిక్సచేసి ధర్మవతి రాగంలో కంపోజ్ చేసిన “డోన్ట్ మిస్ సోదరా…యవ్వనాన్ని నువ్వు డోంట్ మిస్…డోంట్ మిస్ సోదరా యవ్వనాన్ని నువ్వు  డోంట్ మిస్స్” అనే ఈ పాటని జయం మనదేరా అంటూ గాయకుడు సుమన్ మంగు ఎంతో చక్కగా, హుషారుగా  వినిపించి ఆకట్టుకున్నాడు.   

ఈ ఎపిసోడుని ముంగించే ముందు… చివరిగా పార్థు ఒక మంచి పల్లవిని అందుకుని ” నటరాజు నయనాలు దీవించగా ఆఆఆ నటరాజు నయనాలు దీవించగా… నా యోగ ఫలమైన నా జీవ ధనమైన నా యోగ ఫలమైన నా జీవ ధనమైన నాట్యసుధా నిధి అర్పించనా…” అంటూ ఎంతో చక్కగా పాడి ఆకట్టుకున్నారు.  మాస్ట్రో ఇళయరాజా గారు  కంపోజ్ చేసిన ఆలాపన సినిమాలో ప్రతి పాటా ఆణిముత్యమే అలాంటి ఆణిముత్యమే ధర్మవతి రాగం ఆణిముత్యమే ఇప్పుడు మీరు విన్న ఈ పాట. వేటూరి రాసిన ఈ పాటని బాలు గారు పాడారు. అవండి ధర్మవతి రాగం గురించి మీతో పంచుకోవాలనుకొన్న విశేషాలు.  ఈ కార్యక్రమాన్ని చూస్తూనే ఉండండి మా పిల్లలను ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని ఆశీర్వదించండి .వచ్చేవారం మరొక రాగంతో మేము మీముందుంటాం అంటూ ఈ చక్కటి ఎపిసోడును ఎంతో చక్కగా ముగించారు గాయకుడు, సంగీత దర్శకుడు, వ్యాఖ్యాత, కార్యక్రమం నిర్వాహకుడు పార్థసారథి నేమాని (పార్థు).

స్వరవేదిక”, కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఆన్లైన్లో (యూట్యూబ్ ద్వారా) ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్న “స్వర రాగ గీతం” కార్యక్రమంలోని ప్రతీ ఎపిసోడ్ కి సంబంధించిన అంశాలను, విశేషాలను అక్షరరూపంలో మీ ముందు ఉంచడానికి ఓ చిరుప్రయత్నం చేస్తున్నది మీ www.kalavaibhavam.com / కళావైభవం.కామ్కే.ఎల్. నరసింహా రావు 

Volunteer Technical Support: Shaliny Jadhav, Minnesota, USA

 

 

Print Friendly, PDF & Email
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *