స్వర వేదిక, కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న స్వర రాగ గీతం Episode-24 చివరి సంచిక “మీ స్వరం – మా వరం”ను శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి అంకితం 28-Nov-2020

స్వర వేదిక, కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న స్వర రాగ గీతం Episode-24 చివరి సంచిక “మీ స్వరం – మా వరం“ను శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి అంకితం

Swara Raga Geetham Episode 24 SPB Special Part-1 dt  28-Nov-2020 Swara Raga Geetham Parthu Nemani- SP Balu

  ఈ కార్యక్రమం ఎపిసోడుని స్పాన్సర్ చేసిన వారు కాంచ్ టెక్నాలజీస్ (Conch Technologies), మధు మారేడు & పూర్ణ పెరవలి and Kutir.కామ్

ఎపిసోడ్ 24 – పార్ట్-1 సంచికకు స్వాగతం పలికారు ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, వ్యాఖ్యాత, కార్యక్రమం నిర్వాహకుడు, పార్థసారథి నేమాని (పార్థు)

గత ఇరవై మూడు వారాలుగా మిమ్మల్నందర్నీ స్వరరాగ గంగా ప్రవాహం లో ముంచెత్తుతున్న స్వర రాగ గీతం కార్యక్రమం సీజన్-1 ముగింపు దశకు చేరుకుంది. మేము ఈ ప్రయత్నం మొదలుపెట్టినప్పుడే 24 ఎపిసోడ్స్ చేయాలని అనుకున్నాం. గత ఇరవై మూడు వారాలలో కర్ణాటక సంగీత రాగాలు వాటిల్లోని కృతులు, సినిమా పాటలు మీ అందరికీ వినిపించడం జరిగింది. వాస్తవానికి ఈ వారం కూడా మరొక రాగాన్ని వినిపించి ఆ రాగానికి సంబంధించిన విశేషాలను మీతో పంచుకోవాలి. కానీ ఈ సంచికను తన గాత్రంతో, తన మాటతో, తన పాటతో మీ అందరికీ జీవితానికి సరిపడా సంతోషాన్ని, మాలాంటి గాయనీ గాయకులకు జీవితాన్నే ఇచ్చిన ఒక మహానుభావుడికి అంకితం చేయదలిచాం.  అందుకే ఆయన అందించిన ఆ సంతోషం, ఆ ప్రేమ, ఆ ఆనందం ఆ అనురాగమే నేటి మన రాగం శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.

స్వర రాగ గీతం కార్యక్రమంలో సీజన్-1 బాలుగారికి అంకితం చేయడానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి. ఒకటి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న నేనైతే, రెండోది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న స్వర వేదిక సంస్థ. పాడుతా తీయగా కార్యక్రమం నాకు ఎంతో గుర్తింపునిచ్చింది మొట్టమొదటి సిరీస్ విన్నర్ గా నిలిచే అదృష్టం నాకు దక్కింది. అలాగే గడిచిన 12 సంవత్సరాల కాలంలో పాడుతా తీయగా సెలక్షన్ కమిటీలో జ్యూరీ మెంబర్ గా ఉన్న అదృష్టం కూడా నాకు దక్కింది. అంతేకాకుండా పాడుతా తీయగాకు సంబంధించిన సౌండ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా నేను నిర్వహించే కీర్తన స్టూడియో ద్వారా జరగడం మరొక అదృష్టం. ఇది నాకు సంబంధించిన వ్యవహారం అయితే, స్వర వేదిక సంస్థను స్థాపించిన పిల్లలు… అమెరికాలో జరిగిన పాడుతా తీయగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిన్నారులు. వీరందరు కలిసి స్వర వేదిక సంస్థను స్థాపించి, పాటలు పాడి, విరాళాలు సేకరించి, భారతదేశంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలకు వాళ్లు అందిస్తున్న సహాయం నిజంగా బాలు గారికే ఎంతో గర్వ కారణం. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నాకు, నడిపిస్తున్న స్వర వేదిక సంస్థకి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న చిన్నారులకు, పాడుతా తీయగా కార్యక్రమానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. అందుకనే ఈ సంచికను బాలు గారికి అంకితం చేయడం సముచితమే కదా.

అందుకే ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి అంకితం చేస్తున్న ఈ సంచిక పేరు “మీ స్వరం – మా వరం“.

బాలు గారు “మీ స్వరం – మా వరం“. మీ స్వరం అంటే కేవలం మీ పాటనే  కాదండి. మీతో పాటు మీ మాట, మీరు అందించిన సలహాలు ఈ కార్యక్రమంలో పాడిన వర్ధమాన గాయనీ గాయకులకు మీరిచ్చిన దీవెనలు, తెలుగు భాష గురించి, పద్యాన్ని గురించి నడుంకట్టుకుని మీరు అందించిన సందేశం, లోక కళ్యాణం కోసం మీరు చెప్పిన మంచి మాటలు ఇవన్నీ మీ గళం ద్వారా, మీ స్వరం ద్వారా లభించిన వరాలు. అందుకే “మీ స్వరం – మా వరం“.

మీరు మమ్మల్ని భౌతికంగా విడిచిపెట్టి వెళ్లి రెండు నెలలు దాటినా కూడా ఈ నిజాన్ని నమ్మలేని పరిస్థితి ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి. ఎందుకంటే రోజు మీ పాటలు వింటూ… మిమల్ని టివిలో చూస్తూ, మీరు చెప్పే మాటలు అవేనండి సాలూరు గారు ఇంత గొప్ప సంగీత దర్శకుడు,  వేటూరి వారి పదరచన ఎంత  అద్భుతంగా ఉంటుంది,  ఈ అబ్బాయి ఎంత బాగా పాడాడో, ఈ పాటను ఇక్కడ నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు, ఈ స్వరం చాలా బాగుంటుంది, ఈ గళం  ఎంతో బాగుంటుంది. సర్వేజనా సుజనాభావంతు…  సర్వేసుజనా సుఖినోభవంతు అంటూ ప్రతి కార్యక్రమం చివర్లో మీరు చెప్పే మాటలు అన్నీ వింటూ… ప్రతి సంగీత ప్రేమికుడు… మిమల్ని వాళ్ళింట్లో మనిషిగానే అనుకున్నారండి. అందుకనే మిమ్మల్ని ఒక్కసారి కూడా జీవితంలో చూడకపోయినా, ప్రత్యక్షంగా కలవకపోయినా తమ సొంత ఇంట్లో మనిషిని దూరం చేసుకున్నట్లు ఇన్నాళ్లు బాధపడుతున్నారు. ఇంకా మీతో పరిచయం ఉండి, మీతో పని చేసిన దశాబ్దాల పాటు పనిచేసిన సీనియర్ సంగీత దర్శకులు, ముజిషియన్స్, గాయనీ గాయకులూ, దాదాపు రెండున్నర దశాబ్దాలనుండి పరిచయం ఉన్న మాలాంటి గాయనీ గాయకుల పరిస్థితి అయితే వర్ణనాతీతం. ఇది నిజమా అని రోజు మమ్మల్ని మేము ప్రశ్నించుకునే పరిస్థితి. అయితే ఇంత బాధలోనూ మాకు ఒక అదృష్టం ఉందండి. అదే మీ స్వరం. అందుకే ” మీ స్వరం – మా వరం“. 

ముఖ్యంగా పార్థసారధి అనే ఈ చిన్న కళాకారుడికి ఇది చాలా పెద్ద లోటు. ఎందుకంటే పాడుతా తీయగా దగ్గరనుంచి ఆయన ప్రతి దశలోనూ… అటు వృత్తి పరంగా గానీ, ఇటు వ్యక్తిగత జీవితంలో గాని నా వెన్నంటే ఉన్నారు. పాడుతా తీయగా తర్వాత నేను స్టూడియో స్థాపించినప్పుడు, నా స్టూడియోను ప్రారంభించడమే కాకుండా పదిహేనేళ్ల కాలంలో హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా నా స్టూడియోలోనే పాటలు పాడేవారు. దాదాపు గత ఇరవయ్యేళ్ళ కాలంలో ఒక మూడు వేల పాటలు రికార్డు చేశారు. అంతేకాకుండా నేను ఏ కార్యక్రమం తలపెట్టినా నేను ఉన్నాను, నేను ఉంటాను అని ఒక ధైర్యాన్ని ఇచ్చి, ఆయన ప్రతి కార్యక్రమంలోనూ ఆయన వంతు సహకారం నాకు అందించారు.  విశ్వనాదామృతం కార్యక్రమంలో ప్రతి సినిమాకి ముందు ఆ సినిమాకి సంబంధించిన స్టోరీనే ఆయనకి ఆయన వ్యాఖ్యానం చేశారు. అలాగే స్వరవేదిక సంస్థ సహాయంతో నేను నిర్వహించిన “నాదనివేదన కార్యక్రమం” తూము నరసింహ దాసు గారి కీర్తనలు, నేను 72 కీర్తనలను కంపోజ్ చేసి చిన్న పిల్లల చేత పాడించినప్పుడు, ఆ 72 కీర్తనలకు వారు   వ్యాఖ్యానం చెప్పి, ఆ పిల్లల పేర్లు ఆయన ఉచ్ఛరించారు. అంతకన్నా వాళ్ళకు ఏమైనా అదృష్టం ఉంటుందా, నాకేమైనా అదృష్టం ఉంటుందా. అలాగే ఈ మధ్య కాలంలో నేను నిర్వహించిన “పలికెద భాగవతం” కార్యక్రమంలో ఫైనల్స్ కి ఆయన జడ్జిగా వచ్చారు. అదే వారితో నేను చేసిన చివరి కార్యక్రమం.

ఈ రకంగా, ఏ విధంగా చెప్పుకున్నా నా ప్రతి అడుగులోనూ, నా ప్రతి దశలోనూ ఆయన నా వెన్నంటే ఉన్నారు. నిజానికి స్వర రాగ గీతం కార్యక్రమం మొట్టమొదటి ప్రోమోని వారికి పంపించి, వారి ఆశీర్వాదాన్ని కోరుకున్నప్పుడు,   తప్పకుండా ఈ కార్యక్రమం చివరి సంచికలో నేను పాల్గొని మాట్లాడుతానని చెప్పారు. కానీ దురదృష్టం, మేమే మీ గురించి మాట్లాడాల్సి వస్తుంది సార్.  కానీ దురదృష్టం ఎందుకనుకోవాలి. కదా.. మీ స్వరం మాకు అద్తృష్టం కదా. మీరు లేకుండా, మీ మాట లేకుండా, మీ పాట లేకుండా స్వర రాగ గీతం కార్యక్రమంలో ఏ ఒక్క ఎపిసోడు గడవ లేదు మాకు. అందుకే “మీ స్వరం – మా వరం“.  అయినా మేమంటే మీకు ఎందుకు సర్ ఇంత కోపం. ఒక్కసారైనా మిమ్మల్ని ఒక క్షణమైన మరచి పోయే అవకాశం ఇస్స్తున్నారా. పొద్దున్న లేచిన దెగ్గరినుంచి మేలుకొలుపు దగ్గరనుంచి మీ పాటే. ఏ దేవుడిని ప్రార్ధించాలన్నా, ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోవాలి అన్నా,  స్నేహితుడిని పలకరించాలన్నా, అమ్మానాన్నల గురించి చెప్పుకోవాలన్నా,  గురువులను తలుచుకోవాలన్నా, ప్రియురాలితో ప్రేమ పంచుకోవాలన్నా, శృంగార గీతమైన,  చివరకు రాత్రి పడుకునే ముందు లాలి పాటైన అన్ని మీ పాటలే. ఎలా మర్చిపోతాం. అందుకే మిమ్మల్ని మర్చిపోదలచుకోలేదు. మీరు మాకు ఇచ్చిన ఈ సంతోషాన్ని, ఆనందాన్ని ఆస్వాదిస్తూనే, మీ పరిచయ భాగ్యంతో, మీరు అందించిన ప్రేమాభిమానాల్ని మనసులో దాచుకుని మీరు మాకు నిర్దేశించిన మార్గంలో నడుస్తామని మాట ఇస్తూ… ఈ కార్యక్రమంలో ఈ సంచికను మీకు అంకితం చేస్తున్నాం. బాలు గారు “మీ స్వరం – మాకు వరం“.

బాలు గారు తన అయిదు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఒక గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా ఇలా ఎన్నో రోల్స్  పోషించారు. వాటికిగాను ఎన్నో అవార్డులు, రివార్డులు, సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు. కేవలం అయన తన గానానికి గాను 6 నేషనల్ అవార్డ్స్, 9 ఫిలింఫేర్ అవార్డ్స్,  20 నంది అవార్డ్స్, 4 తమిళనాడు బెస్ట్ ప్లేబాక్ సింగర్ అవార్డులు, 3 కన్నడ స్టేట్ అవార్డ్స్  ఇవన్నీ కూడా బాలు గారిని వరించి వాటి గౌరవాన్ని అవే ఇనుమడింప చేసుకున్నాయి.

వీటిలో కొన్ని అవార్డ్ విన్నింగ్ సాంగ్స్ ను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీరు వినబోయే ఈ పాట “అదిగో అదిగో భద్రగిరి” శ్రీ రామదాసు చిత్రంలోని ఈ పాటను వేటూరి గారు భద్రాచలాన్నియావత్ ఆంధ్ర జాతికి అయోధ్యగా వివరిస్తూ రచించిన పాట. ఈ పాటకు స్వరరచన కీరవాణిగారు. బాలు గారు ఆలపించిన ఈ పాటకు గాను ఫిలింఫేర్ అవార్డు లభించింది అని తెలుపుతూ… . అదిగో అదిగో భద్రగిరి అని ఈ సంచికలో తోలి పాటను ఎంతో చక్కగా పాడి ఆకట్టుకున్నారు పార్థు.

1974లో ఘంటసాల మాస్టారు మరణం తర్వాత, ఎన్టీఆర్, ఏఎన్నార్ అభిమానుల్ని మెప్పించడానికి బాలు గారు చేసిన కృషి అనితర సాధ్యం.  దాని ఫలితంగానే దాన వీర శూర కర్ణ, ఆలుమగలు వంటి చిత్రాలలో బాలు గారు పాడిన పాటలన్నీ సూపర్హిట్లే. దాని తర్వాత వచ్చిన అడవి రాముడు, ప్రేమాభిషేకం వంటి చిత్రాలలో ఆయన పాటలు ఒక పెద్ద చరిత్రనే సృష్టించాయి.

ఆ నేపథ్యంలోనే 1975లో మాయామశ్చింద్ర సినిమాలో బాలు గారు పాడిన ఈ పాట ఆయన జైత్రయాత్రకు ఒక స్టెప్పింగ్ స్టోన్. డా. సి. నారాయణ రెడ్డి  గారి రచన. సత్యం గారి స్వర రచన, బాలు గారు మనకు అందించిన ఈ ప్రణయ రాగాన్నీ గాయకుడు అభి వేములపాటి ఎంతో మధురాతి మధురంగా పాడి వీక్షకులను అమితంగా ఆకట్టుకున్నాడు.

బాలు గారు తన పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా ఎంతో మంది గాయకులకు అవకాశాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చారు. అయితే వీరితో పాటు ప్రత్యేకంగా ప్రయాణించే అవకాశం మాత్రం ఒక ఐదుగురు సింగర్లకు దొరికింది అని నా అభిప్రాయం. వారిలో మొట్ట మొదటి వాడిని నేనే. నా తర్వాత మల్లికార్జున్, గోపిక పూర్ణిమ, తర్వాత ఇటీవల కాలంలో శ్రీకృష్ణ, సాయి చరణ్, హరిణి. ఎందుకంటే గడచిన 20 సంవత్సరాలలో బాలుగారు ఇండియాలో గాని, ప్రపంచంలో ఏ దేశంలో కచేరీలు చేసిన మా ఐదుగురిలో ఎవరో ఒకరు వారితో ప్రయాణించి, వారితో పాటు ఆ కార్యక్రమంలో పాడే భాగ్యం దక్కించుకున్నారు. అందుకని ఈ కార్యక్రమంలో, ఈ సంచికలో, బాలుగారికి అంకితమిస్తున్న ఈ సంచికలో వారు కూడా పాల్గొనడం ఎంతో సముచితంగా ఉంటుందని నేను భావించాను.

అందుకనే ఇప్పుడు బాలుగారితో తన అనుభవాలను పంచుకోబోతున్న గాయకుడు శ్రీకృష్ణ.  శ్రీకృష్ణ మీ అందరికీ పరిచయం అవసరంలేని గాయకుడు. ఎన్నో సినిమాలలో కాకుండా. దేశ, విదేశాలలో ఎన్నో టీవీ కార్యక్రమాల్లో తన గానంతో, తన ప్రవర్తనతో మీ అందరికీ దగ్గరైనటువంటి గాయకుడు శ్రీకృష్ణ తన స్పందనను తెలియచేస్తూ…..

మా పాటల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇలా ఏ కొంచం పాడుతున్నా దానికి బిక్ష మాకందరికి అందించింది మనందరికీ ఇష్టులు, పూజ్యులు శ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారు. పాడాలని ఉంది, పాడుతా తీయగా ఇలాంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా మాలాంటి యువతలెందరికో ఆదర్శంగా ఒక మంచి దారిని చూపించారు శ్రీ బాల సుబ్రహ్మణ్యం గారు.  ఇప్పుడు అమెరికాలో పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా చాలా ప్రసిద్ధి చెందిన గాయనీగాయకులు అలాగే పాటల మీద, సంగీతం మీద మక్కువ ఉన్న వాళ్ళందరూ కలిసి స్వర వేదిక అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి, అందులో భాగంగా స్వర రాగ గీతం అనే కార్యక్రమాన్ని మనందరికీ అందిస్తున్నారు, మనం ప్రతీ వారం చూస్తూనే ఉన్నాము. అది ఇప్పుడు గ్రాండ్ ఫినాలే కి వచ్చింది. దీనికి సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు, బాలసుబ్రహ్మణ్యం గారి సంగీత కుటుంబంలోంచి వచ్చిన శ్రీ పార్థ సారథి గారు.   వారి సారథ్యంలో సాగుతున్న ఈ స్వర రాగ గీతం కార్యక్రమంలో పాటిస్పేట్ చేస్తున్న ఈ సింగెర్స్ అందరికి, మ్యూజిషియన్స్ అందరికి కూడా బెస్ట్ విషెస్ తెలియచేస్తూ… బాలు గారి తో అనుబంధం గురించి మాటల్లో చెప్పాలంటే ఈ జన్మంతా సరిపోదు. ఎందుకంటే 2008, 2009, 2010లో ముఖ్యంగా అమెరికాకు నన్ను తీసుకెళ్లి, అందరికి పరిచయం చేసి, ఈ అబ్బాయి బాగా పడుతాడని అందరికి పరిచయం చేశారు శ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారు. చాలామంది సంగీత దర్శకులకి నా పేరు సజెస్ట్ చేసారు. నన్నే కాదు చాలా మంది సింగర్స్ అందరికీ కూడా. మమ్మల్నందరిని వేలుపట్టుకుని నడిపించుకుని తీసుకెళ్లారు బాలసుబ్రమణ్యం గారు.  చాలా మంచి అనుబంధం వారితో.  వారిని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది వారు పాడుతున్నా, మాట్లాడుతున్న అలా ఒక మేజిక్ క్రియేట్ అయిపోతుందన్నమాట. మోరోవర్ బాలుగారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఈ సంగీతం, పాటలు ఈ ఒక్కటే కాదండి, ముఖ్యంగా క్రమశిక్షణ, పేషన్స్, డిసిప్లిన్, ఎదుటి వ్యక్తికి గౌరవం మనం ఎలా ఇవ్వాలి, అది ఒక చిన్న మ్యూజిషియన్ అయినా, ఒక  పెద్ద మ్యూజిషియన్ అయినా సరే, ఎవరైనా సరే, ఏ వ్యక్తయినా సరే, మనిషికి విలువ, మనషికి గౌరవం ఎలా ఇవ్వాలి అనేది ఇవన్నీ నేర్చుకునేది శ్రీ బాల సుబ్రహ్మణ్యం గారి దెగ్గర నుంచే. అది నేర్చుకుని అది ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తుండాలి అంతే. ఇక పాటలు అవన్నీ అంటే వేరే ఆప్షన్ లేదు మనకి, బాలు గారు ఒక పెద్ద డిక్ష్నరి అంతే. సో వారి పాటలే మనకు ఆ ఆ ఇ ఈ…లు అంతే. ఈ రోజు వారికి నివాళిగా వారికి స్మృత్యర్థం చేస్తున్నా ఈ గ్రాండ్ ఫినాలేలో, వారిని తలచుకోవడమనేది బాధాకరమే, లెట్స్ ఆల్ సెలబ్రేట్ బాలు గారు. బాలసుబ్రహ్మణ్యం గారు వారి జీవితమంతా సంగీతానికి అంకితం చేసారు. సంగీతం ఉన్నంతకాలం బాలు గారి గళం వినిపిస్తూ ఉంటుందని, బాలుగారి గురించి మాట్లాడే అవకాశం నాకించ్చినందుకు స్వర రాగ గీతం సభ్యులందరికీ మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలియచేసారు శ్రీ కృష్ణ.

అనంతరం క్షణం క్షణం చిత్రంలోని “జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా జోరు గాలిలో జాజికొమ్మ జారనీయకే కల” అనే పాటను ఎంతో చక్కగా పాడి వీక్షకుల హృదయాలను రంజింపచేసారు శ్రీ కృష్ణ.   

బాలు రెండక్షరాల పేరు. పాట రెండక్షరాల మాట. ఈ పాటకు శ్వాసను పోసిన మకరందాల తేట మన బాలు గారు. అందుకే ఆయన గానం సంగీత అభిమానుల్లో ఆశలు పెంచి, వెండితెర మీద కథ నడిపించింది, కొండ కోన గుండెల్లో ఎండా వానల అనుభూతిని మిగిల్చింది, నిన్నటి ఆ పాట, నేడు నీరెండై పెనవేసుకుంది, రేపు పన్నీరు జల్లై పరిమళించి పరవశింపచేస్తుంది.

అందుకే అదే నీవు అంటూ ఆత్రేయగారు, ఇళయరాజా గార్లు అభినందన తెలిపిన బాలుగారి పాట “అదే నీవు అదే నేను” ఈ పాటను గాయని స్నిగ్ధ మల్లాది ఎంతో మధురంగా, చక్కగా పాడి వీక్షకుల హృదయాలను అమితంగా ఆకట్టుకుంది. 

నా దారి ఎడారి, నా పేరు బికారి అన్న పాటలో “పాట నాకు సైదోడు పక్షి నాకు తోడు” అని పాడుకున్న బాలు గారు తెలుగులోనే కాకుండా తమిళం లో కూడా ఎన్నో వేల పాటలు పాడారు అది మనందరికీ తెలిసిన విషయమే.  ఇప్పుడు నేను మీకు వినబించబోయే ఈ తమిళ పాట అర్థం కూడా ఇంచుమించుగా అలాంటిదే.

ఉదయ గీతం చిత్రంలో సంగీత మేగం అన్న ఈ పాటకి అర్థం ఏమిటంటే,  సంగీత మేఘం తేనేలు చిందించే  సమయం. ఆకాశం పూలవాన కురిపించే కాలం. శరీరం రాలిపోయినా పాటతో జీవిస్తాను. మనసు అనే ఊరిలో, పాట అనే తీరులో రాజులాగా విహరిస్తాను అని ఈ పాటకి అర్థం. రచయిత ముత్తులింగం గారు సినిమాలో హీరోని ఉద్దేశించి ఈ పాట రాసినా కూడా. ఈ పాటలోని పదాలు, భావం అన్ని బాలుగారికి సరిగ్గా సరిపోయాయి కదూ. నిజమే మరి ఆయన భౌతికంగా మనకు దూరమైనా కూడా ఆయన పాటతో మనతో ఏప్పుడు జీవించే ఉంటారు. రారాజుల విహరిస్తూనే ఉంటారు.

ఇళయరాజా గారు స్వరపరిచిన “సంగీత  మేగం తేన్ సింతుమ్ నేరం ఆగయం పూకల్ థూవుమ్ కాలం” అనే ఈ పాటతో గాయని భావన రవిచంద్రన్ ఎంతో చక్కగా పాడి, బాలు గారికి నివాళి అర్పించి, అమితంగా ఆకట్టుకుంది.

ఇప్పుడు నేను మీకు వినిపించ పోయే పాట కృష్ణవంశీగారి దర్శకత్వంలో 2009లో వచ్చిన మహాత్మ సినిమా నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచన. ఇందులో శాస్త్రిగారు జాతిపిత మహాత్మా గాంధీ గారి గురించి రాసిన ఈ పాటలో ఆయన మాటలు తూటాల్లా పేలితే, ఆ తూటాలని బాలు గారి గాత్రం… గాంధీ గారి గురించి, గాంధీ గారు సంపాదించిపెట్టిన స్వాతంత్ర్యం గురించి, వాటి విలువల గురించి తెలియని అజ్ఞానుల గుండెల్లో సూటిగా దింపేసింది.  బాలు గారిని నంది అవార్డు వరించిన ఈ పాటకు స్వరకర్త విజయ్ అంథోని. “రఘుపతి రాఘవ రాజారామ్ పతిత పావన సీతారామ్ ఈశ్వర అల్లా తేరేనామ్ సబ్ కొ సమ్మతి దే భగవాన్ ” అనే పాటను పార్థు ఎంతో అద్భుతంగా పాడి వీక్షకుల హృదయాలను మిరుమిట్లు గొలిపించాయి.

బాలు గారు తన ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ సింగింగ్ కెరీర్ లో మూడు తరాలకు సంబంధించిన హీరోలకు పాటలు పాడారు. అన్ని తరాల వారిని మెప్పించారు, థియేటర్స్ కు రప్పించారు, చప్పట్లు కొట్టించారు. అందుకే ఆయన పాట వింటే దేవదాస్ అయినా కాళిదాసు అయిపోతాడట. “నిలవదే మది నిలవదే” అంటూ పరవశించి పోతారట. రామజోగయ్య శాస్త్రి గారు, మిక్కీ జె. మేయర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ పాటను, బాలు గారు శతమానంభవతి అంటూ మనందిరిని దీవించే విధంగా ఆలపించారు.

“నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి దేవదాసే.. కాళిదాసై.. ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది” అనే ఈ పాటని గాయని నేహా అనుమోలు ఎంతో చక్కగా, హుషారుగా పాడి వీక్షకుల హృదయాలను రంజింపచేసింది.

పాడుతా తీయగా కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమంలో విజేతలుగా నిలిచి తమకంటూ ఒక మంచి పేరు సంపాదించుకున్న జంట సాయిచరణ్, హరిణి.

వీళ్ళిద్దరూ ఎన్నో సినిమాల్లో పాడటమే కాకుండా దేశ విదేశాల్లో ఎన్నో కచేరీలు చేసి చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. అలాగే బాలు గారితో పాటు ఎన్నో కార్యక్రమాలలో సహా గాయకులుగా ఆయనతోపాటు ప్రయాణం చేసిన అనుభవం వీరిది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బాలు గారు SPB50 అంటూ టూర్ చేశారు. ఆయన చేసిన ఈ కార్యక్రమంలో ప్రతి షో లోనూ సాయిచరణ్, హరిణి పాల్గొనడం వాళ్ళ అదృష్టం.  మరి స్వర రాగ గీతం కార్యక్రమంలో వీళ్ళిద్దరూ బాలు గారి తో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటారు.

సాయిచరణ్, హరిణి వారి స్పందనను తెలియచేస్తూ…స్వర వేదిక వాళ్లు నిర్వహిస్తున్న స్వర రాగ గీతం అనే అపురూపమైన కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు పార్థసారధి గారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము.

ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు స్వర రాగ గీతం ప్రోగ్రాం. అనేక రాగాలను తీసుకొని ఒక రాగంలో ఉండే పాటలన్నీ ఎపిసోడ్స్ గా చేసి, అందరికి ఎంతో నాలెడ్జె అందిస్తున్నారు. మా అదృష్టం ఏమిటంటే స్వర రాగ గీతం టైటిల్ సాంగ్ మేమిద్దరం కలిసి పాడటం జరిగింది.  పార్థసారథిగారికి కృతజ్ఞతలు. పాడుతా తీయగాలో ఎంట్రీ పార్థసారథిగారు వల్లె కలిగింది. నేను రాజమండ్రి నుండి సెలెక్ట్ అవ్వడం జరిగింది. మాకు ఆయనతో ఎంతో అనుబంధం వుంది. ఆయన కంపొజిషన్ లో చాలా పాడడం జరిగింది. ఆయన ద్వారా మేము ఎంతో నేర్చుకున్నాము. ఆయన కంపొజిషన్ లో భాగవతంలో కూడా నేను పాడడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తయితే ఈ రోజు ఇంత అద్భుతమైన కార్యక్రమం లాస్ట్ కి వచ్చింది. ఈ ఎపిసోడ్ లో మా అందరికి గురువుగారైన బాల సుబ్రహ్మణ్యం గారికి ఈ సంచికను అంకితమిచ్చే కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. బాలు గారు ద్వారా మేము ఎంతో నేర్చుకున్నాం. బాలు గారు ఎప్పుడు మాతోనే వున్నారు, మాలోనే వుంటారు. ఆయన మంచి మాట, ఆయన మంచి పాట మాకు ఎప్పుడూ గుర్తుకొస్తూనే ఉంటాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగానే ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఒక మహోన్నత వ్యక్తి బాల సుబ్రహ్మణ్యం గారి పేరిట వారికి అంకితమిస్త్తున్న ఈ సంచికలో పాల్గొనే అవకాశం ఇచ్చిన పార్థసారధి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ స్వర వేదిక అనేది కూడా పాడుతా తీయగా యూఎస్ఏ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, పార్థ సారధి గారు ట్రైన్ చేసిన వారు అందరూ కలిసి ఈ స్వర వేదికను స్థాపించి ఎంతో అద్భుతమైన ప్రోగ్రాంలు చేస్తున్నారు. బాలసుబ్రహ్మణ్యం గారు ఇక్కడే కాదు, మన అందరి గుండెల్లో, ప్రపంచమంతా వ్యాపించి ఉంటారు. పాట ఉన్నంత వరకు ఆయన ఎప్పటికి వుంటారు.  ఎంతో ఆనందంగా ఉంది మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు థాంక్యు అని తమ స్పందని తెలియచేసి, అనంతరం “ఇలాగే.. ఇలాగే.. సరాగమాడితే…వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే” అనే ఒక మంచి పాటను కలిసి ఎంతో చక్కగా పాడి వీక్షకులను ఆనందింపచేసి ఆకట్టుకున్నారు సాయిచరణ్, హరిణి.

ఏక్ జూదేకే లియే 1998 లో రిలీజ్ అయిన ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా బాలు గారు పాడిన అన్ని హిందీ పాటలు సూపర్ హిట్ సాంగ్స్. తేరే మేరే బీచ్ మే అన్న ఈ పాటకి ఆయనకీ రెండోసారి నేషనల్ అవార్డు వచ్చింది. ఆర్.డి. బర్మన్ గారు స్వరరచన. ఈ పాట ఇప్పటికీ ఎప్పటికీ సంగీతాభిమానులను అలరిస్తూనే ఉంటుంది.  బాలు గారికి కూడా చాలా ఇష్టమైన ఈ పాట, మేము పాల్గొన్న ఎన్నో షో లలో, ఇంచుమించు ప్రతీ షో లో ఆయన ఈ పాట పాడుతూ ఉంటారు అని చెపుతూ…. 

గాయకుడు పార్థు “తేరే మేరే తేరే మేరే బీచ్ మే కైసా హై బంధన్ అంజనా, మైనే నహి జానా, తూనే నహి జానా” అనే ఈ పాటను ఎంతో అద్భుతంగా పాడి వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు పార్థు.     

ఆప్ కే హమారే బీచ్ మే ఆప్ కే…. బాలు గారు….ఆప్ కే హమారే బీచ్ మే. కైసా హై యే బంధన్ అంజనా….కైసా హై యే బంధన్ అంజనా… అందుకే బాలు గారు “మీ స్వరం – మా వరం అని ఈ సంచికను ముగించారు వ్యాఖ్యాత, గాయకుడు, కార్యక్రమం నిర్వాహకుడు పార్థసారధి నేమాని (పార్థు) 

 

“స్వరవేదిక”, కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఆన్లైన్లో (యూట్యూబ్ ద్వారా) ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్న “స్వర రాగ గీతం” కార్యక్రమంలోని ప్రతీ ఎపిసోడ్ కి సంబంధించిన అంశాలను, విశేషాలను అక్షరరూపంలో మీ ముందు ఉంచడానికి ఓ చిరుప్రయత్నం చేస్తున్నది మీ…. కళావైభవం.కామ్ / www.kalavaibhavam.com  – K.L. Narasimha Rao 

Volunteer Technical Support: Shaliny Jadhav, Minnesota, USA

Print Friendly, PDF & Email
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *