వైవిద్యభరితంగా సాగిన అంబ వాణి “కీరవాణి” రాగాలాపన స్వర రాగ గీతం ఈనాటి ఎపిసోడ్-18 లో “కీరవాణి” రాగం పార్ట్-1 కార్యక్రమం

వైవిద్యభరితంగా సాగిన అంబ వాణి “కీరవాణి” రాగాలాపన         స్వర రాగ గీతం ఈనాటి ఎపిసోడ్-18 లో “కీరవాణి” రాగం పార్ట్-1 కార్యక్రమం

Swara Raga Geetham “Keeravani Ragam” Part-1, Episode 18 (dated:10th October 2020)

10.10.2020: స్వర వేదిక, కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ఈనాటి స్వర రాగ గీతం అంబ వాణి ” కీరవాణి ” రాగం పార్ట్-1, ఎపిసోడ్ 18 కార్యక్రమానికి స్వాగతం పలికారు ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, వ్యాఖ్యాత, కార్యక్రమం నిర్వాహకుడు, పార్థసారథి నేమాని (పార్థు)

 

ఈ కార్యక్రమం ఎపిసోడుని స్పాన్సర్ చేసిన వారు కాంచ్ టెక్నాలజీస్ (Conch Technologies), మధు మారేడు & పూర్ణ పెరవలి and Kutir.com

కార్యక్రమం నిర్వాహకుడు, వాఖ్యాత పార్థు నేమాని తన స్వాగత వ్యాఖ్యానాన్ని ప్రారంభిస్తూ….శాస్త్రీయ సంగీత రాగాలు… ఆ రాగాల లో ఉన్న స్వరాలతో కూడిన కీర్తనలు, ఆధ్యాత్మిక భక్తి గీతాలు, లలిత సంగీతాలు, సినిమా పాటలు, గజల్స్  వీటన్నిటితో ఎంతో రసవత్తరంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో నేటి మన రాగం అంబ వాణి కీరవాణి” రాగాన్ని పరిచయం చేసారు.

కీరవాణి రాగం:

ఆరోహణ: స రి గ మ ప ద ని స  – SA RI GA MA PA DA NI ṠA   

అవరోహణ: స ని ద ప మ గ రి స – SA NI DA PA MA GA RI SA

కీరవాణి రాగంలోని స్వర స్థానాలు

స  SA – షడ్జమం Shadjamam

రి  RI – చతుశ్రుతి రిషభము Chatusruthi Rishabham

గ  GA – సాధారణ గాంధారం Sadharana Gaandhaaram

మ MA – శుద్ధ మధ్యమం  Shuddha Madhyamam

ప  PA – పంచమం PANCHAMAM

ద DA – శుద్ధ దైవతం Shuddha Daivatham

ని NI – కాకలి నిషాదం Kakali Nishadam

స  SA – షడ్జమం  Shadjamam

అవరోహణలో కూడా ఇవే స్వరస్థానాలు వస్తాయి. 

పార్థు వాఖ్యానిస్తూ… కీరవాణి రాగం మేళకర్తల సంప్రదాయాల్లో 21వ మేళకర్త రాగం. సంపూర్ణ రాగం. శుద్ధ మధ్యమ రాగం. ఈ రాగంలో ప్రేమ, ఆధ్యాత్మిక, భక్తి భావనలు ఎంతో మధురంగా పలుకుతాయి అలాగే ఈ రాగంలోని స్వరాల కలయిక వల్ల బాధ, శోకము, కరుణ, విరహ రసాలు ఇంకా హృద్యంగా పలికించవచ్చు అని చెప్పారు.

స్వామి… శ్రీ వెంకటేశ్వర…. నువ్విచ్చిన ఈ శరీరాన్ని నమ్ముకోవడం చాలా కష్టం. ప్రాణాన్ని  నమ్ముదామా   అంటే అవి ఇట్టే గాలిలో కలిసిపోతాయి. మనసును నమ్ముదామా అంటే  దానికి ఒక్క క్షణం కూడా నిలకడ లేదు, నాలుకను నమ్ముదామా అంటే దానికి ఎంత సేపు తిండి యావే. ఈ శరీరం క్షణాల్లో కాలి బూడిదైపోతుంది.  దీన్ని నమ్ముకుంటే కష్టాలు నష్టాలే  తప్ప సుఖాలు కలిగే అవకాశమే లేదు. అందుకే శాశ్వతమైన నీ నామాన్ని గట్టిగా పట్టుకున్నాను. నిన్నే నమ్ముకున్నాను. నన్ను గట్టెక్కించి కాపాడు స్వామి అంటూ..  అన్నమాచార్యులవారు ఆ  వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ రచించిన కీర్తన “పుట్టేడిదింకా బూట కంబులే” ఈ కీర్తనను కీరవాణి రాగంలో స్వరపరిచే భాగ్యం నాకు దక్కింది అది వినిపించి ఈ సంచికను స్వాగతించబోతున్నాను అని తన ప్రారంభ వాఖ్యానాన్ని ఎంతో అద్భుతంగా ప్రారంభిస్తూ…..అలాగే అద్భుతమైన ఈ కీర్తనను  ఎంతో చక్కగా పాడి అమితంగా ఆకట్టుకున్నాడు పార్థు నేమాని

శ్రీ ముత్తయ్య భాగవతార్ పలు భాషలలో అనేక కృతులు రచించిన వాగ్గేయకారుడు. శుద్ధధన్యాసి, ఉదయ రవి చంద్రిక సంచికలో వీరి గురించి మనం ముచ్చటించుకున్నాం.

హిమగిరి తనయే అంటూ ఉదయ రవి చంద్రిక రాగంలో పార్వతీదేవిని స్తుతించిన ముత్తయ్య భాగవతార్ గారు “అంబా వాణి నన్నాదరింపవే… శంబరారి వైరి సహోదరి కంబు గళసిత కమలేశ్వరి” అంటూ పలుకులమ్మను కీరవాణి రాగంలో స్తుతించారు. ఈ కీర్తనను గాయని అనిషా నేరెళ్ల ఎంతో చక్కగా పాడి  భక్తి పారవశ్యంలో ఓలలాడించింది.

కీరవాణి రాగంలో శోకం, విరహం, కరుణ లాంటి రసాలు ఎంతో హృద్యంగా పలికించవచ్చని ఈ ఎపిసోడ్ ముందు చెప్పుకున్నాము. ఈ ఎమోషన్స్ ని  క్యారీ చేస్తూ కీరవాణి రాగంలో ఎంతో మంది సంగీత దర్శకులు, ఎంతో అద్భుతమైన, ఎన్నో అద్భుతమైన మెలోడీస్ కంపోజ్ చేశారు. అయితే సినిమా పాటలు ,కీరవాణి రాగం అంటే ఆ మెజారిటీ పాటలలో ఒకటి ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో… ఇది మోస్ట్ పాపులర్ మెలోడీస్ అఫ్ రీసెంట్ టైమ్స్ “ముంగారు మలై” అంటే కన్నడలో రుతువుకు ముందే కురిసిన వాన అని అర్థం. ఈ పేరుతో వచ్చిన కన్నడ సినిమా పేరుకు తగ్గట్టుగానే కనకవర్షం కురిపించింది. దీన్ని తెలుగులో “వాన” పేరుతో పునర్నిర్మించారు.

ఈ పాటకి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచన చేస్తే, దీనికి సంగీత దర్శకుడు కమలాకర్ గారు. ” ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో ” అనే ఈ పాటను గాయకుడు ఇషాన్ తంగిరాల ఎంతో హాయిగా, చక్కగా పాడి వీక్షకులకు కనువిందుచేసాడు.

ఈ పాటని ఒరిజినల్ గా కన్నడ సినిమాలో కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ మనో మూర్తిగారు. తెలుగులో డబ్ చేసినప్పుడు మూర్తిగారు కంపోజ్ చేసిన పల్లవిని యధాతధంగా ఉంచి ఈ పల్లవికి చరణాన్ని కంపోజ్ చేశారు కమలాకర్ గారు. కమలాకర్ గారు మన అందరికీ ప్రాణం కమలాకర్ గా సుపరిచితులే. వెర్సెటైల్ కంపోజర్,  మెలోడీస్ కంపోజర్ అండ్ వన్ అఫ్ ది టాప్ మోస్ట్ ఫ్లూట్ ప్లేయర్స్ అఫ్ సౌత్ ఇండియా. ఆయనతో పని చేసే అదృష్టం కూడా నాకు దక్కింది. కన్నడలో చరణం ఎలా కంపోజ్ చేశారో కన్నడలో పాడి వినిపించి ఆకట్టుకున్నారు పార్థు.

కర్ణాటక సంగీత ప్రపంచంలో పరిచయం అవసరం లేని నిష్ణాతుడైన సంగీత విద్వాంసుడు  శ్రీ జి.ఎన్. బాల సుబ్రహ్మణ్యం గారు. వీరిని అందరు జి.ఎన్.బి. అని పిలుచుకుంటారు. తమిళనాడులో జన్మించిన వీరు జీవించింది కేవలం 55 సంవత్సరాలు మాత్రమే అయినా కూడా సాధించింది మాత్రం ఎంతో. ఇంగ్లీష్ లో హానర్స్ చేస్తూనే శాస్త్రీయ సంగీతంలో ప్రావీణ్యాన్ని సంపాదించారు. శకుంతల తమిళ చిత్రంలో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారితో కలిసి హీరోగా నటించారు. ఎం.ఎల్. వసంతకుమారి, రాధా జయలక్ష్మి వంటి సంగీత విద్వాంసులకు సంగీత పాఠాలు నేర్పించారు.  వీరు తెలుగు, తమిళ సంస్కృత భాషల్లో దాదాపు రెండు వందల యాభై పైచిలుకు కీర్తనలు రచించారు.

ఆకాశవాణి చీఫ్ ప్రోగ్రామింగ్ ప్రొడ్యూసర్ గా అలాగే స్వాతి తిరునాళ్ మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపల్ గా పనిచేసిన వీరు కీరవాణి రాగంలో రచించిన “నీ చరణాంబుజములు  నెరనమ్మితి నీరజాక్షి… శ్రీ ధరజ రమణ సోదరి శ్రిత జనార్తి భంజని నిరంజని”  అనే కీర్తనను గాయకుడు వైభవ్ గరిమెళ్ళ ఎంతో చక్కగా పాడి భక్తి పారవశ్యంలో పరవశించేటట్టు చేసాడు.

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు పరమేశ్వరుని కీర్తిస్తూ రచించిన కీర్తనలతో శివ పదం అనే సంచికను వెలువరించారు. వీటిలోని  కీర్తనలను ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు, శ్రీ మల్లాది సూరిబాబుగారి వంటి ప్రముఖులు స్వర పరచడం జరిగింది. వీటిని ఆల్బమ్స్ గా రికార్డు చేసి రిలీజ్ చేయడమే కాకుండా వీటి తోటి అనేక నగరాలలో కచేరి నిర్వహించడం కూడా జరిగింది.  అలాంటి ఒక సందర్భంలో శ్రీ సామవేదంగారి ఆధ్వర్యంలో వారి వ్యాఖ్యానంతో విశాఖపట్నంలోని కళాభారతి ఆడిటోరియంలో ఈ కీర్తనలు ఆలపించే భాగ్యం నాకు కూడా దక్కిందని వాటిలో ఒక కీర్తన కీరవాణి రాగంలో ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ మల్లాది సూరిబాబు గారు స్వరపరచిన “ఇంత పిచ్చి సామిని నేనెక్కడా చూడలేదు” అనే కీర్తనను పార్థు ఎంతో చక్కగా పాడి అమితంగా ఆకట్టుకున్నారు. 

“తుమ్ బిన్” అనే హిందీ సినిమాని తెలుగులో తరుణ్, శ్రీయ హీరో హీరోయిన్లుగా 2003లో “ఎలా చెప్పను” అనే పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాలోని కథలో హీరో అనుకున్నట్లుగానే అన్ని జరుగుతుంటాయి. కాకపోతే హీరోయిన్ మనసులో ఒక కోరిక మిగిలి ఉంటుంది. ఆ కోరికని హీరోకి ఎలా చెప్పాలా అని అమ్మాయి ఆలోచిస్తూ ఉంటుంది. హీరోయిన్ మనసులోని మాటను బాగా అర్థంచేసుకున్న సిరివెన్నెల గారు, సిరివెన్నెల అక్షరాలకు మనసుకు హత్తుకునేలా స్వరాలు కంపోజ్ చేయడం తెలిసిన కోటి గారు,  హృదయాన్ని తాకేలా పాడగలిగిన చిత్ర గారు, ఈ ముగ్గురూ కలిసి ఆ అమ్మాయి మనసులోని మాటను హీరోకి చేరవేసే ప్రయత్నం చేస్తారు.

“ఈ క్షణం ఒకే ఒక కోరిక..నీ స్వరం వినాలని తియ్యగా” అన్న ఈ పాటను కీరవాణి రాగంలో కోటిగారు కంపోజ్ చేసిన “ఈ క్షణం ఒకే ఒక కోరిక..నీ స్వరం వినాలని తియ్యగా…తరగని దూరము లో ఓ .. ఓ….తెలియని దారుల లో ఓ .. ఓ….ఎక్కడున్నావు అంటోంది ఆశగా”  అని గాయని అనుకృతి వెనుకదాసుల ఎంతో వైవిద్యభరితంగా పాడి వినిపించిన ఈ పాట వీక్షకుల హృదయాలను మిరుమిట్లుగొలిపించింది.

కీరవాణి రాగాన్ని హిందుస్థానీ సంగీతంలో కూడా కీరవాణి అనే పిలుస్తారుఅని తన వాక్యనాన్ని కొనసాగిస్తూ..ఒక మంచి హిందీ పాట “బేక్ఆరార్ దిల్ తూ గాయే జా.. ఖుషియోన్ సే భరే వో తరానే” అని ఎంతో అద్భుతంగా పాడి అలరించారు పార్థు.

స్వర రాగ గీతం కార్యక్రమంలో మాయామాళవగౌళ రాగం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు పావురానికి పంజరానికి పెళ్లిచేసే పాడు లోకం అనే సాంగ్ ప్రజెంట్ చేసేటప్పుడు చంటి సినిమా గురించి మాట్లాడుకున్నాము. అదే సినిమాలో వేటూరి గారు, ఇళయరాజా గారి కాంబినేషన్ లో కీరవాణి రాగంలో అందాలను దాచుకున్న “ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం పూసే గాలి గంధం పొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు” అని గాయని నిహారిక మలిగె ఎంతో హుషారుగా పాడి అమితంగా అలరించింది.   

కాదలుక్కుమరియాదై  తమిళ్ సినిమాలో ఇళయరాజా గారు ఎన్నై తాళాత్త వరువాళ్ళో కీరవాణిలో ఈ పాట కంపోజ్ చేశారు. ఇది 1996లో సెన్సేషన్ మెలోడియస్ హిట్ నెంబర్ అన్నమాట.  హరిహరన్ గారు ఇళయరాజా  గారి అమ్మాయి భవతారిణీ ఈ పాటను పాడటం జరిగింది. ఈ పాటకి సంబంధించిన ఒక మంచి అనుభవం మీతో పంచుకుంటున్నానని చెపుతూ…

నేను దాదాపు పదిహేను దేశాల్లో ఎన్నో కాన్సెర్ట్స్ఇచ్చాను నా ప్రొఫెషనల్ కెరీర్ లో. కాకపోతే నా మొట్టమొదటి విదేశీ పర్యటన మాత్రం బాలసుబ్రహ్మణ్యం గారితో. బాలు గారు నన్ను యూస్ టూర్ కి ఆయనతో పాటు ఆయన బృందంలో కో సింగర్ గా తీసుకోవడం జరిగింది. అప్పట్లో మేము దాదాపు 18 కచేరీలు చేస్తే అందులో సగం తమిళ్ కాన్సెర్ట్స్ అనమాట. ఆ తమిళ్ కాన్సెర్ట్స్ లో నేను మొట్టమొదటి పాటగా తమిళ్ పాటను పాడేవాణ్ని.  బాలు తన భజన చేయివేసి ఈఅబ్బాయి నా   ప్రోడక్ట్.  మీరు ఇప్పుడు నాకెంత చప్పట్లు కొట్టారో ఈ అబ్బాయికి అంతకంటే ఎక్కువ కొడితే నేను సంతోషిస్తాను అని నన్ను ఇంట్రడ్యూస్ చేసేవారు.  అర్హత మాటెలా ఉన్నా నా అదృష్టానికి మాత్రం నేను చాలా ఆనందించేవాడిని. అటువంటి మధురమైన జ్ఞాపకాలు తో కూడిన తమిళ్ పాట “ఎన్నై తాళాత్త వరువాళ్ళో  , నెంజిల్ పూ మంజం తరువాళ్ళో, తంగా తెరాట్టం వరువాళ్ళో, ఇల్లై ఏమాట్రుం తరువాళ్ళో “అని ఎంతో చక్కగా పాడి వినిపించి అలరించారు పార్థు.

రజనీకాంత్ శ్రీదేవి హీరో హీరోయిన్లు గా 1980 లో రిలీజ్ అయిన తమిళ్ సినిమా “జానీ”. ఈ సినిమా కోసం ఇళయరాజా గారి సోదరుడు సంగీత దర్శకుడు గంగయి అమరం గారు ” కాట్రిల్ ఏంథన్ గీతం ” అనే పాటను రచిస్తే… ఇళయరాజా గారు ఈ పాటని కీరవాణి రాగంలో స్వరపరిచారు. జానకి గారు పాడారు.

కటిక చీకటిలో హోరు గాలిలో నా పాట కానరాని మనిషి కోసం వెదుకుతోంది అనే భావనతో సన్నివేశానికి అద్దంపట్టే సాహిత్యంతో ఈ పాటను కీరవాణి రాగంలో ” కాట్రిల్ ఏంథన్ గీతం కాణాద ఒండ్రై తేడుదె అలై పోలా నినైవాగా ” ఈ పాటను గాయని శ్రీసన్విత శ్రీధరన్ ఎంతో మధురంగా పాడి వీక్షకుల హృదయాలను రంజిపచేసింది.

“ఏ దివిలో విరిసిన పారిజాతమో” ఈ పాట తెలియని తెలుగు సినీసంగీత ప్రేమికుడు ఉంటాడు అంటే అతిశయోక్తే మరి. ఈ పాటను ఎన్నిసార్లు విన్నా మ్యూజిక్ లవర్స్ కి విసుగు రాదు. ఈ పాట పాడటమంటే నాలాంటి సంగీత కళాకారులే కాదు సినిమాలో పాడిన సాక్షాత్తు బాలుగారే  ఈ పాటను ఎన్ని వందల సార్లు వేదికల మీద పాడారో లెక్కే లేదు. అంత అందమైన మెలోడీ ఈ పాట. కానీ విషయం ఏంటంటే తరచి తరచి చూస్తే తప్ప ఈ పాట కీరవాణి రాగంలో కంపోస్ చేయబడిందని మనకు తెలియదు.  అంత అద్భుతంగా రొమాంటిక్ గా కంపోజ్ చేసారు మ్యూజిక్ డైరెక్టర్ సత్యం గారు. దాశరథి గారు, బాలు గారు, సత్యం గారు కాంబినేషన్లో వచ్చిన ఈ పాటను మీకు వినిపించి కీరవాణి రాగాలాపనకు చిన్న విరామాన్నిచ్చి వచ్చే వారం రెండవ భాగంలో మా కీరవాణి రాగలాపాన్ని కొనసాగిస్తాం అని తన వ్యాఖ్యానాన్ని ముగిస్తూ… “ఏ దివిలో విరిసిన పారిజాతమో..ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో.. నా మదిలో నీవై నిండిపొయెనే..” అనే అద్భుతమైన పాట మొత్తాన్ని అంతే అద్భుతంగా పాడి నిజంగా వీక్షకుల  హృదయాలను రంజింపచేసి మైమరపించారు ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, వ్యాఖ్యాత, కార్యక్రమం నిర్వాహకుడు, పార్థసారథి నేమాని (పార్థు).

“స్వరవేదిక”, కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఆన్లైన్లో (యూట్యూబ్ ద్వారా) ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్న “స్వర రాగ గీతం” కార్యక్రమంలోని ప్రతీ ఎపిసోడ్ కి సంబంధించిన అంశాలను, విశేషాలను అక్షరరూపంలో మీ ముందు ఉంచడానికి ఓ చిరుప్రయత్నం చేస్తున్నది మీ…. కళావైభవం.కామ్ / www.kalavaibhavam.com – కే.ఎల్. నరసింహా రావు 

Volunteer Technical Support: Shaliny Jadhav, Minnesota, USA

 

Print Friendly, PDF & Email
Spread the love