స్వర రాగ గీతం ఎపిసోడ్-17 లో స్వర కేళి “పంతువరాళి” రాగం భక్తిరస సముద్రంలో ఓలలాడించింది

స్వర రాగ గీతం స్వర వేదిక, కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ఈనాటి స్వర రాగ గీతం ప్రారంభానికి ముందుగా…                                                                    గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం      (S.P. Balasubrahmanyam)                       గారికి అశృనివాళి అర్పిస్తూ..

స్వర కేళి “పంతువరాళి” రాగం ఎపిసోడ్ 17 కార్యక్రమానికి స్వాగతం పలికారు ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, వ్యాఖ్యాత, కార్యక్రమం నిర్వాహకుడు, పార్థసారథి నేమాని (పార్థు) 

 

 

 

 

 

 

 

 

 

 

స్వ రాగ గీతం ఎపిసోడ్-17లో స్వర కేళి “పంతువరాళి” రాగం భక్తిరస సముద్రంలో ఓలలాడించింది

Swara Raga Geetham ” Pantuvarali Ragam” Episode-17, October 3rd 2020

కార్యక్రమం ఎపిసోడుని స్పాన్సర్ చేసిన వారు కాంచ్ టెక్నాలజీస్ (Conch Technologies), మధు మారేడు & పూర్ణ పెరవలి and Kutir.com

 

 

 

 తన మధురమైన గానంతో అవ్యాజమైన ప్రేమతో కోట్లాది మందికి ఎనలేని సంతోషాన్నిఅంతులేని  ఆనందాన్ని అందించిన గాన గంధర్వుడు తన శివ స్తుతితో పరమేశ్వరుని అలరించడానికి కైలాసానికి పయనమయ్యారు. అందరు ఎప్పోడోఅప్పుడు వెళ్లాల్సిందేకానీ ఈనేమిటి అంత హఠాత్తుగా ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్లిపోయారే అని బాధ. బాలు అంటే మధురమైన సంగీతం, బాలు అంటే మంచి పాట, బాలు అంటే ఆత్మీయమైన మాట, బాలు అంటే వెన్నుతట్టే ప్రోత్సాహం, బాలు అంటే పులకరించిపోయే ప్రేమ, బాలు అంటే అంతులేని అభిమానం, బాలు  అంటే హద్దులేని అనురాగంబాలు అంటే నిలిచిపోయే స్నేహం, బాలు అంటే నిలబెట్టే సహాయం. వీటన్నింటినీ కలబోసి బాలుగారు మనందరికీ అమూల్యమైన మరచిపోలేని మధురమైన జ్ఞాపకాలను ఎన్నో అందించారు.

బాలుగారు సార్ భగవంతుడు మీ గాన మాధుర్యంలో మీ ప్రేమలో మునిగిపోయి లోకాన్ని పట్టించుకోకపోతే మా గతేంటో చెప్పండి. అలాగే  మీరు కూడా స్వర్గంలో సంగీత కచేరీలతో బిజీగా ఉండి మమ్మల్ని మర్చిపోకండే. ఒక్క కన్ను మా మీద కూడా వేసుంచండి సార్. పాడుతా తీయగా ప్రధమ విజేతనైన  నాకుఅమెరికాలో జరిగిన పాడుతా తీయగా కార్యక్రమంలో పాల్గొని సమాజ సేవకు నడుం కట్టిన స్వరవేదిక పిల్లలకు, ఇంకా పాడుతా తీయగా లో పాల్గొన్న ఎంతో  మంది గాయనీ గాయకులకు జీవితాన్నిచ్చిన మీకు మేము ఏమిచ్చి రుణం తీర్చుకోగలము సర్.

వృత్తిపట్ల మీ నిబద్ధత, క్రమశిక్షణ, తోటి మనుషుల పట్ల మీ స్నేహభావం, ప్రేమను పంచే గుణం, వీటిల్లో  కనీసం 10 శాతం  మేము అలవరచుకున్న చాలు మీతో పరిచయం అయినందుకు మా జన్మ ధన్యమైనట్టే.  

అటు సంగీతంలోనూ ఇటు వ్యక్తిగత జీవితంలోను మీరు చూపించిన మార్గంలో నడిచి మీ గౌరవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తామని మనస్పూర్తిగా మాట ఇస్తూ మీ ఆశీర్వాదం మాపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ పార్థు అంటూ ఎంతో ఆర్ద్రతతో, బరువైన హృదయంతో, వినయంగా, విచారంగా, ఆవేదనాభరితంగా అశ్రు నయనాలతో తన ప్రియతమ బాలుగారికి నివాళులు సమర్పించారు పార్థు నేమాని.

అనంతరం స్వరరాగ గీతం కార్యక్రమంలో ఈనాటి ఎపిసోడ్ కి అందరికి సుస్వాగతం పలికారు పార్థు నేమాని. మనసులు కలిస్తే బంధం… చేతులు కలిస్తే స్నేహం… స్వరాలు కలిస్తే రాగం.. నేటి స్వరరాగ గీతంలో ఈ నాటి  రాగం స్వర కేళి “పంతువరాళి” రాగాన్ని పరిచయం చేసారు పార్థు.

పంతువరాళిని మేళకర్త రాగాల సంప్రదాయంలో కామవర్ధని అని పిలుస్తారు. ఇది 51వ మేళకర్త రాగం. సంపూర్ణ రాగం. అంటే ఏడు స్వరాలు ఉంటాయన్నమాట. ఈ కామావర్ధని రాగంలో భక్తి, ఆధ్యాత్మికత, విరహం వంటి భావాలు ఎంతో అందంగా హృద్యంగా పలికించవచ్చు.

 

పంతువరాళి రాగం:

ఆరోహణ: స రి గ మ ప ద ని స  – SA RI GA MA PA DA NI ṠA   

అవరోహణ: స ని ద ప మ గ రి స – SA NI DA PA MA GA RI SA

పంతువరాళి రాగంలోని స్వర స్థానాలు

స  SA – షడ్జమం Shadjamam

రి  RI – శుద్ధ రిషభము Suddha Rishabham

గ  GA – అంతర గాంధారం Anthara Gaandhaaram

మ MA – ప్రతి మధ్యమం  Prathi Madhyamam

ప  PA – పంచమం PANCHAMAM

ద DA – శుద్ధ దైవతం Suddha Daivatham

ని NI – కాకలి నిషాదం Kakali Nishadam

స  SA – షడ్జమం  Shadjamam

అవరోహణలో కూడా ఇవే స్వరస్థానాలు వస్తాయి

సంగీతాభ్యాసం మొదలుపెట్టే విద్యార్థులకు మొదటగా సరళీ స్వరాలు జంట స్వరాలు నేర్పించే రాగం, మాయామాళవగౌళ రాగం. ఈ రాగానికి ఒక స్వరం మారిస్తే అంటే మధ్యమాన్నీ మారిస్తే కామవర్ధిని రాగం వస్తుంది. ఇంకా మేళకర్తల విషయానికొస్తే 72 మేళకర్త రాగాల్లో 36 శుద్ధ-మధ్యమ రాగాలు ఉంటాయి, 36 ప్రతిమధ్యమ రగాలు ఉంటాయి. ఈ శుద్ధ-మధ్యమ రాగాలలో మాయామాళవగౌళ 15వ మేళకర్త రాగం. దీనికి 36 నెంబర్ కలిపితే 51 అదే మన కామావర్ధిని రాగం అని వివరించారు పార్థు.

కార్యక్రమాన్ని ఒక చక్కటి అన్నమాచార్య సంకీర్తన “ఎదుట నెవ్వరు లేరు అంతా విష్ణుమయమే వదలక హరి దాస వర్గమైన వారికి…  ముంచిన నారాయణ మూర్తులె ఈ జెగమెల్ల అంచిత పాపములే అక్షరాలెల్ల పంచుకొన్న శ్రీ హరి ప్రసాదమీ రుచులెల్ల తెంచివేసిమేలు గా తెలిసేటివారికి వర్గమైన వారికి అంతా విష్ణు మాయ….. ఎదుట నెవ్వరు లేరు అంతా విష్ణుమయమే వదలక హరి దాస వర్గమైన వారికి” ఎంతో అద్భుతంగా పాడి భక్తి పారవశ్యంలో ఓలలాడించారు.  ఈ సంకీర్తన గురించి పార్థు వివరిస్తూ…. ఈ పాట  అన్నమాచార్యులవారి సంకీర్తన. దీనిని పంతువరాళి రాగంలో స్వరపరిచినది శ్రీ నేమాని సూర్య ప్రకాష్ గారు. మా చిన్నాన్న గారు. మా నాన్నగారు అయినటువంటి శ్రీ నేమాని రామంగారికి సోదరులు. శ్రీ నేమాని  సూర్య ప్రకాష్ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. మంచి గాయకులు, అద్భుతమైన స్వరకర్త, మృదంగ ,తబలా వాయిద్య లో దిట్ట.  దక్షిణ భారత సంగీత కోకిలలు శ్రీమతి పి సుశీల, శ్రీమతి వాణీ జయరామ్ వంటి దిగ్గజాలకు ఎన్నో వందల కచేరీలలో తబలపై సహకారాన్ని అందించడమే కాకుండా స్వర చక్రవర్తులు సాలూరి రాజేశ్వరరావు గారు, పెండ్యాల నాగేశ్వరరావుగార్లకు సహాయకుడిగా పనిచేసిన అనుభవం వీరిది. అంతే కాకుండా దాదాపు ఎనిమిది వందల పైచిలుకు డివోషనల్ ఆల్బమ్స్ కి స్వర రచన చేసిన ఘనకీర్తి వీరిది. దక్షిణ భారతదేశంలో ఏసుదాసు గారు, బాలు గారు, సుశీల గారు, జానకి గారు, వాణీ జయరాం గారు, శైలజ గారు, బాలకృష్ణ ప్రసాద్ గారు ఇలా ఎంతో మంది దిగ్గజాలు శ్రీ నేమాని సూర్య ప్రకాష్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో పాటలు పాడారు. ఇప్పటికీ వేలాదిమంది విష్ణు భక్తులను అలరి స్తున్నటువంటి  స్తోత్రం ప్రియ సిస్టర్స్ పాడిన నారాయణ స్తోత్రం వీరు స్వరపరిచిందే. నేను కూడా దాదాపుగా ఆరు వందల పైచిలుకు పాటలను శ్రీ సూర్య ప్రకాష్ గారి సంగీత దర్శకత్వంలో పాడాను. అయితే ఈ అన్నమాచార్య కీర్తన గురించి ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకోవాలి. నేను నా 25 సంవత్సరాల ప్రొఫెషనల్ కెరీర్లో ఒక నాలుగు నుండి ఐదు వేల పాటలు రికార్డ్ చేసి ఉంటాను. అలాగే 20 ఏళ్ల బట్టి ఒక ప్రొఫెషనల్ రికార్డింగ్ స్టూడియోని నిర్వహిస్తున్న అనుభవం నాది.  అయితే నా జీవితంలో మొట్టమొదటిసారి ఒక రికార్డింగ్ స్టూడియోలో రికార్డు చేసిన కీర్తన ఇది.  ఈ పాటని, ఈ కీర్తనని పంతువరాళి రాగంలో స్వరపరిచి పాడటానికి నాకు అవకాశం ఇచ్చిన మా బాబాయ్ శ్రీ నేమాని సూర్యప్రకాష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ… పంతువరాళి రాగంలో మా పిల్లలు ఏం పాటలు పడబోతున్నారో,  ఏం కీర్తనలు వినిపించబోతున్నారో విందామా మరి అని ముందుకు తీసికెళ్లారు పార్థు నేమాని.

 

నాన్ కడవుల్ అంటే తెలుగులో నేను దేవుణ్ణి అని అర్థం. 2009 నాన్ కడవుల్ పేరుతో వచ్చిన తమిళ చిత్రానికి 2 నేషనల్ అవార్డ్స్, స్టేట్స్ అవార్డ్స్, ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఆలా చాల వచ్చాయి. ఈ సినిమాని తెలుగులో “నేనే దేవుణ్ణి” అనే పేరుతో డబ్ చేశారు.  ఈ సినిమాలో వాలి గారు రాసిన “ఓం శివోహం” అన్న పాట ఒక చిరస్మరణీయ గీతం. పరమేశ్వర తత్వాన్ని మన కళ్లకు కట్టేలా మనసును తట్టేలా మాస్ట్రో ఇళయరాజా గారు పంతువరాళి రాగంలో స్వరపరిచారు.

 

గాయకుడు విజయ్ ప్రకాష్ శివుని ఆవాహన చేసుకుని ఆలపించారు. ఇప్పుడు “ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామము భజేహం భజేహం” పాటని కైలాస శిఖరానికి వినిపించేలా ఎంతో అద్భుతంగా పాడాడు గాయకుడు మాధవ్ దంతుర్తి.

 

బాపు గారి దర్శకత్వం వహించిన శ్రీరామరాజ్యం చిత్రంలో జొన్నవిత్తులగారు రచించినటువంటి ఒక పాటని మాస్ట్రో ఇళయరాజాగారు పంతువరాళి రాగంలో స్వర పరిస్తే, శ్రేయా ఘోషాల్ గారు, శ్రీరామ్ గారు ఈ పాటని ఆలపించడం జరిగింది. ఆ పల్లవి ఒక చరణం మీ కోసం … “శ్రీ రామ లేరా ఓ రామా ఇలలో పెనుచీకటి మాపగరా సీతారామ చూపెయ్ నీ మహిమ” అనే పాటను చాలా… చాలా చక్కగా పాడి వినిపించారు పార్థు. 

త్యాగరాజ స్వామి వారి రచనల్లో ఎక్కువ శాతం శ్రీరామచంద్రుని కీర్తించేవి అయినప్పటికీ కూడా ఆ శివయ్యను కీర్తిస్తూ ఆయన ఎన్నో కృతులను రచించారు. మీరు వినబోయే ఈ కీర్తనలో మనసా వినవే అంటూ నచ్చ చెబుతూనే తత్వాన్ని బోధించిన త్యాగరాజుల వారు… గట్టిగా చెప్పాల్సివచ్చినప్పుడు గొంతు పెంచి వోరీ అన్నారు.

ఫలానాది చెయ్యి, ఫలానాది చెయ్యకు అంటూ స్పష్టంగా మాటలు దాచుకోకుండా చెప్పారు. “శివశివ శివ యనరాదా ఓరీ.. భవభయబాధల నణచుకోరాదా..”  అంటూ పంతువరాళిలో త్యాగరాజస్వామి వారు రచించిన ఈ కీర్తనను గాయని శృతి నండూరి ఎంతో చక్కగా పాడి భక్తి పారవశ్యంలో పరవశించేటట్టు చేసింది.

మనం సీనియర్ సముద్రాలగా పిలుచుకునే సముద్రాల రాఘవాచారి గారు 1957లో విడుదలైన వినాయక చవితి సినిమాకి మాటలు, పాటలు రాయడంతో పాటు దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వహించారు. ఈ సినిమాలో కథాపరంగా సత్యభామ తండ్రి అయిన సత్రాజిత్తు సూర్య భగవానుని ప్రార్థించే పాటొకటుంది. 

పూర్తిగా సంస్కృత సమాసాలతో నిండిన ఈ పాటని ఘంటసాల మాస్టారు పంతువరాళిలో రాగంలో అమోఘంగా స్వరపరచి, ఆలపించారు. “దినకర… … దినకర… హె శుభకరా.. దినకర శుభకరా దేవా.. ధీనాధారా.. తిమిరసంహార దినకర శుభకర…” అని గాయకుడు అభి వేములపాటి ఎంతో అద్భుతంగా పాడి భక్తిరస సముద్రంలో ఓలలా డించాడు.

మన వాగ్గేయకారుల రచనల్లో ఆత్మనివేదన కనిపిస్తుంది. చదువులు, చర్చలు కేవలం భ్రమలేనని అంగీకరించి శరణువేడుకోవడం కూడా కనిపిస్తుంది. వారు మనస్ఫూర్తిగా నమ్మి రాసిన  అక్షరాలలో భావాలలో మనసులోని తడి తగులుతుంది.

“నిన్నే నెర నమ్మినానురా ఓ రామ రామయ్య…” అంటూ తన చింతన వెల్లడించిన త్యాగరాజ స్వామి కీర్తనలోని భావాన్ని అర్ధాన్ని  పంతువరాళి రాగంలో “నిన్నే నెర నమ్మినానురా ఓ రామ రామయ్య…అన్ని కల్లలనుచు ఆడిపాడివేడి పన్నగ శయన నా చిన్నతనము నాడే నిన్నే నెర…” అని గాయని ప్రణతి బింగి ఎంతో మధురంగా పాడి అమితంగా ఆకట్టుకుంది.

స్వరరాగ గీతం కార్యక్రమంలో ఇప్పటివరకు మనకి గజల్ పాడుకునే అవకాశం దొరకలేదు అంటూ.. తనకు నచ్చిన ఒక గజల్ ని ఎంతో చక్కగా పాడి వినిపించి ఆకట్టుకున్నారు పార్థు.

 

భద్రాద్రి దేవాలయాన్ని పునరుద్ధరించేందుకు రామదాసే తిరిగి తూము నరసింహదాసుగా జన్మించారని చెబుతారు. తూము నరసింహదాసు గారు దక్షిణ భారతదేశంలోని పుణ్యక్షేత్రాలన్నిటిని కాలినడకన పర్యటించారు. తిరువాయూర్ వెళ్లినప్పుడు త్యాగరాజ స్వామి వారే ఆయనకు కీర్తనలతో స్వాగతం పలికారట. ఎన్ని ఊళ్ళు పర్యటించినా, ఎన్ని దేవాలయాలు దర్శించినా దాసుగారి ఇష్ట గమ్యం భద్రాచలం. అక్కడే ఉంది వారి మహాభాగ్యం. అదేమిటో…. పంతువరాళి రాగంలో “నిన్ను జూచుభాగ్యము నా కన్నుల కెన్నటికో! రామ సన్నుతామర ప్రసన్నరాఘవ యాపన్నరక్షణ పంకజలోచన” అనే ఈ కీర్తనను గాయని మేధా అనంతుని ఎంతో చక్కగా పాడి భక్తిరస సముద్రంలో ఓలలాడించింది,

1995లో రాంగోపాల్ వర్మ గారు హిందీలో  తీసిన రంగీలా సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద బ్లాక్ బ్లస్టర్. ఇది 7 ఫిలింఫేర్ అవార్డులను కూడా గెలుచుకుంది. ఈ సినిమాలో మెహబూబ్ గారు రాసిన పాటలకు ఏ.ఆర్. రహమాన్ గారి ట్యూన్  ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి.  తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డబ్ చేయబడింది.  ఈ సినిమా ఆడియో అన్ని భాషల్లోను సూపర్ హిట్ అయింది.

ఏ.ఆర్. రెహమాన్ గారు పంతువరాళి రాగంలో చేసిన ఎక్స్పరిమెంట్ “హై రామ యే క్యా హువా… క్యు ఐసే హమే సతానే లగే”  హరిహరన్ గారు, స్వర్ణలత గారు పాడిన ఈ పాటని గాయని అనన్య పెనుగొండ ఎంతో ఆర్ద్రతతో పాడి అమితంగా ఆకట్టుకుంది.

కరుణ కురిపించే కామవర్ధిని రాగా సంచికని ఒక అద్భుతమైన, దివ్యమైన, రమ్యమైన రామదాసు కీర్తనతో  ముగించబోతున్నానని, ఈ కీర్తనకు సంబంధించి పార్థు తన అనుభవాన్నిచెపుతూ…నేను ఇంజనీరింగ్ చదివే రోజుల్లో ఒక మ్యూజిక్ కాంపిటీషన్ లో తనకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని, ఆ ప్రైజ్ ని భారతరత్న ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారి చేతుల మీదుగా అందుకున్న అదృష్టం కూడా దక్కింది. ఆ తర్వాత ఆ ప్రైజ్ విన్నర్స్ అందరికీ స్టేజ్ మీద ఆమె పక్కనే కూర్చుని ఆమె కచేరీ వినే భాగ్యం కల్పించారు. ఆ కచేరిలో ఎం.ఎస్. సుబ్బా లక్ష్మి గారు ఈ “ఎన్నగాను రామ భజన కీర్తనను ఆలపించిన తీరు ఇప్పటికి తలుసుకుంటే వొళ్ళంతా పులకరించి పోతుంది.

ముక్యంగా చరణంలో  ” రామా రామ రామ… రామ రామ రామ రామ యనుచు…రామ రామ రామ యనుచు ” అంటూ రెండు చేతులు జోడించి “రామా… రామా…” అని పిలిచిన తీరుకీ శ్రీరాముడే సాక్షాత్తు వైకుంఠం నుంచి ఆ విష్ణుమూర్తి శ్రీరాముని రూపంలో వచ్చి ఆడియన్స్ లో కూర్చుని ఆ కీర్తనలు విన్నాడేమో అన్న భావన కలిగింది. ఆ కీర్తన అయ్యేటప్పటికీ అంతా నిశ్శబ్దం.  ఆవిడ కళ్ళలో నీరు. వింటున్న మా కళ్ళలో నీరు. ప్రేక్షకులందరూ వేరే లోకంలో వున్నారు. నిజంగా ఒక ప్రదర్శన తర్వాత చప్పట్లు కొట్టడం కూడా మర్చిపోయిన స్థాయికి తీసుకువెళ్ళేఅటువంటి నైపుణ్యం మహానుభావులైన కొద్దిమంది కళాకారులకు మాత్రమే  సొంతమైనటువంటి, అద్భుతమైనటువంటి ప్రజ్ఞ… 

అలాంటి ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారి కచ్చేరి విని, ఆ కీర్తనను నేర్చుకొని, చాలా సందర్భాలలో, చాలా వేదికలమీద, చాలా పోటీల్లో మనసు ద్రవించేలాగా,  ఆవిడ పాడిన తీరును తలుచుకుంటూ.. నేనూ  పాడుకుంటూనే వున్నాను.. మీకు వినిపించి ఇవాళ్టి ఈ సంచికను ముగించి, వచ్చేవారం మరోక రాగంతో కలుద్దామని చెపుతూ….

ఈ అద్బుదమైన కీర్తన ” ఎన్నగాను రామ భజన కన్నమిక్కిలున్నదా…. సన్నుతించి శ్రీ రామచంద్రు దలచవే మనసా కన్న పిన్నవారి వేడుకొన్ననేమి ఫలము మనసా” గాయకుడు, వాక్యత పార్థసారథి నేమాని (పార్థు) ఎంతో అద్భుతంగా, మధురంగా పాడి భక్తి పారవశ్యంలో పరవశించేటట్టు చేసి ఈ పంతువరాళి రాగం ఎపిసోడుని ఎంతో మధురంగా ముగించారు.    

 

“స్వరవేదిక”, కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఆన్లైన్లో (యూట్యూబ్ ద్వారా) ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్న “స్వర రాగ గీతం” కార్యక్రమంలోని ప్రతీ ఎపిసోడ్ కి సంబంధించిన అంశాలను, విశేషాలను అక్షరరూపంలో మీ ముందు ఉంచడానికి ఓ చిరుప్రయత్నం చేస్తున్నది మీ…. కళావైభవం.కామ్ / www.kalavaibhavam.com – కే.ఎల్. నరసింహా రావు 

Volunteer Technical Support: Shaliny Jadhav, Minnesota, USA

 

https://youtu.be/_9OGFMNYdtk

 

Print Friendly, PDF & Email
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *