దసరా పండుగ ప్రత్యేక సంచికగా అమితంగా ఆకట్టుకున్న “రాగమాలిక” –  స్వర రాగ గీతం ఎపిసోడ్-19లో (24.10.2020)

దసరా పండుగ ప్రత్యేక సంచికగా అమితంగా ఆకట్టుకున్న “రాగమాలిక” –  స్వర రాగ గీతం ఎపిసోడ్-19లో

Swara Raga Geetham “RAGAMALIKA”, Episode 19 (24.10.2020)

స్వర వేదిక, కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ఈనాటి స్వర రాగ గీతం దసరా పండుగ ప్రత్యేక సంచికగా “రాగమాలిక”, ఎపిసోడ్ 19 కార్యక్రమానికి స్వాగతం పలికారు ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, వ్యాఖ్యాత, కార్యక్రమం నిర్వాహకుడు, పార్థసారథి నేమాని (పార్థు).

 

ఈ కార్యక్రమం ఎపిసోడుని స్పాన్సర్ చేసిన వారు కాంచ్ టెక్నాలజీస్ (Conch Technologies), మధు మారేడు & పూర్ణ పెరవలి and Kutir.com

వాఖ్యాత పార్థు (పార్థసారథి) వీక్షకులందరికి విజయదశమి శుభాకాంక్షలు తెలియచేస్తూ…. స్వర వేదిక మరియు కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సంచికకు స్వాగతం పలికారు. ఈ దసరా పండుగ మన కష్టాలను కడతేర్చి మన జీవితాల ను వెలుగు పథం వైపు నడిపించాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వర రాగ గీతం  కార్యక్రమంలోని ఈ ప్రత్యేక సంచికకు అందరికీ స్వాగతం పలికారు.

సాధారణంగా పండగంటే మనందరికీ ఒక పెద్ద ఆకర్షణ విందుభోజనం. మామూలు రోజుల్లో ఒక పప్పుతోనో, ఓ కూరతోనో  భోజనం చేసే మనం, పండుగరోజున మాత్రం పిండివంటలతో బూర్లు, పులిహోర, బొబ్బట్లు, గారెలు, వడలు ఇలా రకరకాల పిండివంటలతో భోజనం చేస్తాం. అలాగే ఇవాళ కూడా స్వర రాగ గీతం కార్యక్రమంలో ప్రతి వారము ఒకే రాగానికి సంబంధించిన విశేషాలను మీతో పంచుకుంటున్న మేము, ఇవాళ ఈ ప్రత్యేక సంచికలో అనేక రాగాలతో కూడిన మాలను అల్లి ఆ రాగమాలిక స్వరాల విందును అందజేయబోతున్నామని, విజయదశమి పండుగ వాతావరణంలో విహరించేలా ఈ సంచికను ఘనంగా ప్రారంభించారు పార్థు. 

శంకరాభరణం చిత్రం ద్వారా తెలుగు సినిమాని, తెలుగు సినిమా సంగీతాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ గారు.  శాస్త్రీయ సంగీతం అంటే అప్పటి వరకూ మక్కువ చూపించని సామాన్య ప్రేక్షకుడు కూడా ఈ సినిమా తర్వాత శాస్త్రీయ సంగీతాన్ని వినడం మొదలు పెట్టారు, ఆస్వాదించడం మొదలుపెట్టారు. ఎంతోమంది  చిన్నపిల్లలు విద్యార్థులు శంకరాభరణం సినిమా పాటలు విన్న తర్వాత శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించడం మొదలుపెట్టారు, తమ ప్రతిభకు సాన పెట్టడంకోవడం  మొదలుపెట్టారు.  అటువంటివారిలో నేను కూడా ఒకణ్ణి.  శంకరాభరణం పాటలు పాడడం తోనే సంగీత ప్రయాణం మొదలు పెట్టిన నాకు తర్వాతి కాలంలో ఆ మహానుభావుడుతో పనిచేసే అదృష్టం దక్కింది. విశ్వనాధ్ గారి సినిమాలకు పాటలు పాడటమే కాకుండా, వారి సినిమాల్లో పాటలకు స్వరరచన చేసి అదృష్టం కూడా నాకు దక్కటం సాక్షాత్తు ఆ సరస్వతి దేవి అనుగ్రహంగా నేను భావిస్తున్నాను. ఆ విధంగా శంకరాభరణం పాటలు ఆబాలగోపాలాన్ని అలరించాయి, అలరిస్తూనే ఉన్నాయి. ఇందులోని ప్రతి పాటా ఒక ఆణిముత్యమే. ఈ పాటలన్నిటిని అపారమైన విద్వత్ సంపద కలిగినటువంటి వేటూరి సుందరరామమూర్తి గారు రచించారు.

రాగం తానం పల్లవి అనే ఈ పాటలో వేటూరి గారు కర్ణాటక సంగీత రాగాల పేర్లను జప్పించి  సాహిత్యం రచిస్తే.. మామ కెవి. మహదేవన్ గారు అద్భుతంగా అవే రాగాలలో ఈ పాటను స్వరపరిచారు. అంత అద్భుతమైన “రాగం తానం పల్లవి నా మదిలోనె కదలాడి కడ తేర మన్నవి రాగం తానం పల్లవి నా మదిలోనె కదలాడి కడ తేర మన్నవి” అనే పాటను పార్థు ఎంతో చక్కగా పాడి అలరించి, ఈ ప్రత్యేక సంచికకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చారు.

తమిళనాడు రాష్ట్రంలో తిరుచనాపల్లి జిల్లాలో తొగమలై గ్రామంలో జన్మించిన సంగీత విద్వాంసులు, వాగ్గేయకారులు శ్రీ తంజావూర్ శంకర్ అయ్యర్ గారు. సంస్కృత, తమిళ, తెలుగు భాషల్లో వీరు అనేక వర్ణాలు, పదాలు, జావళీలు రచించారు. నాట్యానికి సంబంధించిన కృతులూ, కీర్తనలూ రచించడంలో వీరు సిద్ధహస్తులు. మీరు వినబోయే ఈ రాగారంజని కీర్తన వీరి సంగీత సాహిత్యాల ప్రతిభకు ఒక మచ్చుతునక.

ఈ కీర్తన నాలుగు రాగాలలో అంటే రంజని, శ్రీరంజని, మేఘరంజని, జనరంజని, రాగాలలో శ్రీ తంజావూరు శంకర్ గారు స్వరపరిచిన ఈ కీర్తనను గాయకుడు మాధవ్ దంతుర్తి ఎంతో చక్కగా పాడి భక్తి పారవశ్యంలో పరవశించేటట్టు చేసాడు.

అమ్మవారు అఖిలాండేశ్వరి. నవరాత్రులలో తొమ్మిది రూపాలలో పూజలందుకునే చాముండేశ్వరి. అష్టలక్ష్ములు తానేఅయిన ఆ ఇష్టకామేశ్వరి వైభవాన్ని ఆవిష్కరిస్తూ వేటూరి సుందరామ్మూర్తి గారు రచించిన నృత్య గీతాన్ని కె.వి.మహదేవన్ గారు రాగమాలిక గా సమర్పించారు.

ఈ పాట మొత్తం ఐదు రాగాలలో కంపోజ్ చేయబడింది. కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన సప్తపది చిత్రంలోని ఈ రాగమాలిక “ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యాన కేళి కలకంఠీమ్ ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయేద్గౌరీమ్…అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ” గీతాన్ని  గాయని సుప్రజ కడగండ్ల లలితాపరమేశ్వరీ దేవికి సమర్పించినట్లుగా ఎంతో భక్తి పారవశ్యంలో ఓలలాడించింది.

1983లో జంధ్యాల గారి దర్శకత్వంలో గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రధారిగా వచ్చిన సినిమా ఆనందభైరవి ఈ సినిమాలో పాటలన్నీ కూడా చాలా పాపులర్. దీనికి సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు గారు. వేటూరి సుందర మూర్తి గారు రచించిన పాటని రమేష్ నాయుడు గారు రెండు రాగాల్లో కంపోజ్ చేశారు. అందులోని ఒక పాట  “చైత్రము కుసుమాంజలి చైత్రము కుసుమాంజలి”  చరణములను పార్థు పాడి వినిపించారు.

నెల్లూరులోని రంగనాయక స్వామి మొదలుకొని సింహాచలంలోని నారసింహుని వరకూ తెలుగువారి  పూజలందుకునే దేవతలు ఎందరో. ముక్కోటి దేవతలు అంటూ చక్కటి తెలుగు నుడికారంతో ఎంతో 1961 లో రిలీజ్ అయిన బావ మరదళ్లు చిత్రంలో ఆరుద్ర గారు ఒక పాటను రచిస్తే, పెండ్యాలగారు 5 రాగాలతో కూడిన ఒక అపురూపమైన పాటను మనకందించారు.

అయిదు రాగాలలో స్వరపరిచిన ఈ పాట “ముక్కోటి దేవతలు ఒక్కటైనారు.. చక్కన్ని పాపను ఇక్కడుంచారు.. ముక్కోటి దేవతలు ఒక్కటైనారు.. చక్కన్ని పాపను ఇక్కడుంచారు.. ఎక్కడున్నాగాని దిక్కువారేకదా.. చిక్కులను విడదీసి దరిజేర్చలేరా.. ముక్కోటి దేవతలు ఒక్కటైనారు.. చక్కన్ని పాపను ఇక్కడుంచారు ” పాటని గాయకుడు అభి వేములపాటి ఎంతో చక్కగా పాడి వీక్షకుల హృదయాలను పరవశించేటట్టు చేసాడు.

పార్థు తన ఒకప్పటి అనుభవాన్ని పంచుకుంటూ… నేను ఇప్పుడు మీకు చెప్పబోయే విషయం దాదాపు పదిహేడేళ్ళ క్రితం విషయం. విశ్వనాధ్ గారి సమక్షంలో వారి పాటలతో కువైట్ లో నేను, శ్రీమతి ఎస్.పి. శైలజ గారితో కలిసి ఒక సంగీత కచేరి చేసి హైదరాబాద్ కి తిరిగి వచ్చిన రెండు రోజులకి ఉదయం నాకు విశ్వనాధ్ గారి నుంచి ఫోన్ వచ్చింది. ఒక నాలుగు లైన్లు రాసుకో పార్థసారధి అని అన్నారు. “కంటి ముక్కంటి నగరుగంటి కంటి నగధరుణి ఇంటిలో గంటి వాసికాపురి గంటి” అని చెప్పారు. ఇది ఎలా పాడుతావో పాడు అని అన్నారు. సార్ నాకు కంపోజ్ చేయడం పెద్దగా రాదని కొంచెం బయపడుకుంటూ…ఒక అర్ధగంట టైం తరువాత కాస్త నేను తమాయించుకొని, నేను ప్రాక్టీస్ చేసి కంపోజ్ చేసి పాడుకుని వారికి మళ్లీ ఫోన్ చేసి వినిపించాను. వారికి నచ్చి నేను మధ్యాహ్నం స్టూడియో వస్తాను అక్కడ పూర్తిగా ఈ సాంగ్ కంపోజ్  చేసుకుందామన్నారు విశ్వనాథ్ గారు. ఆ విధంగా విశ్వనాధ్ గారికి  నేను కంపోజ్ చేసిన మొట్టమొదటి పాట.

ఈ పాటని సర్వమంగళ సీరియల్ కోసం విశ్వనాధ్ గారి దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సీరియల్ జెమినీ టీవీలో ప్రసారం అయింది ఈ పాటని నేను మూడు రాగాల్లో కంపోజ్ చేయడం జరిగింది. బృందావని, చక్రవాకం, రంజని రాగం లో ఈ పాటని కంపోజ్ చేయడం జరిగిందని చెపుతూ. “కంటి ముక్కంటి నగరుగంటి కంటి నగధరుణి ఇంటినే గంటి వాసికాపురి గంటి” అనే ఈ పాటని పార్థు ఎంతో చక్కగా పాడి ఆకట్టుకున్నారు.

సినిమాలో పాట కథని నడిపించాలి, కథనానికి దోహదపడాలి. విశ్వనాథ్ దర్శకత్వంలో 1992 స్వాతికిరణం లోని సినిమా లో పాటలు అన్ని ఇలాంటివే, ఇప్పుడు మీరు వినబోతున్న శృతి నీవు గతి నీవు శరణాగతి నీవు అన్న ఈ పాటకి ఒక ప్రత్యేకత ఉంది. ఒక చైల్డ్ ప్రాడిజీతో ఒకపక్కన తను ఆరాధించే గురువు, మరోపక్క తనను అమ్మలా చూసుకునే గురువుగారి భార్య. ఈ ముగ్గురు మధ్య సినిమాలో ఇక మీద ఎటువంటి సన్నివేశాలు ఉండబోతున్నాయి, కథ ఎలా నడవబోతుంది అన్న దానికి ఈ పాట బీజం వేస్తుంది. సి. నారాయణరెడ్డి గారి సాహిత్యం, మహదేవన్ గారి పేరు నిలుపుతూ కోహ్లీగారు అందించిన సంగీతం, వీరిద్దరి ప్రతిభకు న్యాయం చేస్తూ వాణీ జయరాం గారు, చిత్ర గార్ల గానం ఇవన్నీ అద్భుతంగా ఏకమై మనకి ఒక మంచి రాగమాలికను అందించాయి.

కళ్యాణి, పూర్వి కళ్యాణి రాగాల్లో స్వరపరిచిన “శ్రుతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతీ..ధృతి నీవు ద్యుతి నీవు..శరణాగతి  నీవు భారతీ.. ధృతి నీవు ద్యుతి నీవు.. శరణాగతి  నీవు భారతీ.. శరణాగతి  నీవు భారతీ” అనే గీతాన్ని గాయనీమణులు స్నిగ్ధ మల్లాది, ప్రియా కనజం ఇద్దరు కలసి ఎంతో చక్కగా,  అద్భుతంగా ఈ పాటను పాడి వీక్షకులకు కనువిందుచేసి అమితంగా ఆకట్టుకున్నారు.

చూస్తే ఇది విజయదశమి స్పెషల్ ఎపిసోడ్ లా లేదు. కె. విశ్వనాథ్ గారి స్పెషల్ ఎపిసోడ్ లా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను వినిపించే పాట కూడా విశ్వనాథ్ గారి సినిమా సాగర సంగమంలో “వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే..వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే..జగత: పితరౌ వందే.. పార్వతీపరమేశ్వరౌ.. వందే పార్వతీప రమేశ్వరం..నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము..అభినయ వేదము సభకనువాదము సలుపు..పరమ పదము” అనే ఈ పాటని ఎంతో చక్కగా పాడి అలరించారు పార్థు.

ప్రముఖ దర్శకులు కె బాలచందర్ గారి దర్శకత్వంలో 1975లో విడుదలైన తమిళ చిత్రం అపూర్వ  రాగంగాళ్ అప్పట్లో పెద్ద సంచలనం. ఈ సినిమాలో పాటలన్ని చాలా పాపులర్ అయ్యాయి. జాతీయ స్థాయిలో మూడో అవార్డు గెలుచుకుంది సినిమా. ఈ సినిమాలో వాని జయరాంకు నేషనల్ లెవెల్ లో బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమాని 1976లో దాసరి నారాయణరావు గారు తూర్పు పడమర పేరుతో తెలుగులో నిర్మించారు.

ఈ సినిమాలో డాక్టర్ సి నారాయణరెడ్డి గారు రచించిన స్వరములు ఏడైనా రాగాలెన్నో అన్న పాటను రమేష్ నాయుడు గారు ఐదు రాగాలలో రమేష్ నాయుడు గారు అత్యద్భుతంగా కంపోజ్ చేసారు. సుశీల గారు పాడిన ఈ పాటని యువ గళాలు ప్రణతి బింగి మరియు అఖిల మమందుర్ ఎంతో అద్భుతంగా పాడి వీక్షకులకు  కనువిందుచేసి అలరించారు.

పార్థు వాఖ్యానిస్తూ….స్వర రాగ గీతం కార్యక్రమంలో ఈ ప్రత్యేక సంచికను ఒక ప్రత్యేకమైన గీతంతో ముగించబోతున్నాను.  కన్నతల్లి, కన్నా ఊరు, మాతృదేశం, మాతృభాష అన్నారు. తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని చాటుతూ ప్రముఖ కవి పండితులు శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు రచించిన 14 పాటలకు స్వరరచన చేసే అదృష్టం నాకు దక్కింది.

తెలుగు వైభవం పేరుతో రిలీజ్ అయిన ఈ సిడిలో ఒక పాటని నేను  మూడు రాగాల్లో కంపోజ్ చేయడం జరిగింది. హృదయరవిచంద్రిక, సావిత్రి, హంసనాదం. ఈ రాగంలో నేను కంపోజ్ చేసిన ఈ పాటకు ఎప్పటిలాగే గాన గంధర్వులు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారు తమ అద్భుతమైన గానంతో, భావ ప్రకటనతో ఈ పాటకు పట్టం కట్టారు అని వివరిస్తూ…

“మహోన్నతం, మహాద్భుతం తెలుగువారి చరితం, యుగయుగాల జగతిలోనా తెలుగు కీర్తి శాశ్వతం” అనే ఈ అద్భుతమైన పాటను పార్థు అంతే అద్భుతంగా పాడి ఈ రాగమాలిక సంచికకు ఎంతో ఘనంగా ముగింపు ఇచ్చారు.

స్వర రాగ గీతం కార్యక్రమంలో ఈ ప్రత్యేక విజయదశమి రాగమాలిక సంచిక మిమ్మల్నందరిని అలరించిందని  ఆశిస్తూ… ప్రపంచం విపత్కర పరిస్థితుల్లో వున్న ఈ నేపథ్యంలో మనందరినీ ఈ కష్టాలనుంచి గట్టెక్కించాలని  మానవాళికి సుఖసంతోషాలు ఇవ్వాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీ అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటు వచ్చేవారం మరొక రాగంతో మేముంటాం అని పార్థు ఈ సంచికని ఘనంగా ముగించారు.

“స్వరవేదిక”, కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఆన్లైన్లో (యూట్యూబ్ ద్వారా) ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్న “స్వర రాగ గీతం” కార్యక్రమంలోని ప్రతీ ఎపిసోడ్ కి సంబంధించిన అంశాలను, విశేషాలను అక్షరరూపంలో మీ ముందు ఉంచడానికి ఓ చిరుప్రయత్నం చేస్తున్నది మీ…. కళావైభవం.కామ్ / www.kalavaibhavam.com  – కే.ఎల్. నరసింహా రావు

Volunteer Technical Support: Shaliny Jadhav, Minnesota, USA

 

Print Friendly, PDF & Email
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *