స్వర వేదిక, కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న “స్వర రాగ గీతం”లో మధురోహల హేల  “మాయామాళవగౌళ ” రాగం పార్ట్-1, ఎపిసోడ్-9 కార్యక్రమంలో  కీర్తనలు, భక్తి పాటలు, సినిమా పాటలతో వీక్షకులకు కనువిందుచేసింది

స్వర వేదిక, కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న “స్వర రాగ గీతం”లో మధురోహల హేల  “మాయామాళవగౌళ ” రాగం పార్ట్-1, ఎపిసోడ్-9 కార్యక్రమంలో  కీర్తనలు, భక్తి పాటలు, సినిమా పాటలతో వీక్షకులకు కనువిందుచేసింది    

వెరైటీ అండ్ వేరియేషన్స్  దట్ ఇస్ క్రియేషన్ అన్నారు. ఎన్నో పువ్వులు ఎన్నో రంగులు ఎన్నో చుక్కలు  ఎన్నో దిక్కులు అలాగే ఎన్నో స్వరాలూ ఇంకెన్నో భావాలు. శాస్త్రీయ, ఆధ్యాత్మిక, లలిత, సినీ, సంగీత రాగార్చన “స్వర రాగ గీతం”. స్వర వేదిక, కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ నాటి ఎపిసోడ్-9 లో ఇవాళ మీకు వినిపించబోతున్న రాగం మధురోహల హేల  “మాయామాళవగౌళ ” రాగంని పరిచయం చేస్తూ స్వాగతం పలికారు ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, వ్యాఖ్యాత పార్థసారథి నేమాని (పార్థు).

మాయామాళవగౌళ రాగము

ఆరోహణ: స రి గ మ ప ద ని స  – SA RI GA MA PA DA NI ṠA   

అవరోహణ: స ని ద ప మ గ రి స – SA ని DA PA MA GA RI SA

మాయామాళవగౌళ రాగంలోని స్వర స్థానాలు

స  SA – షడ్జమం Shadyamam

రి  RI – సుద్ధ ఋషభము Suddha Rishabham

గ  GA – అంతర గాంధారం Anthara Gaandhaaram

మ MA – సుద్ధ  మధ్యమం  Suddha Madyamam

ప  PA – పంచమం PANCHAMAM

ద DA – సుద్ధ దైవతము Suddha Daivatham

ని NI – కాకలి  నిషాదం Kakali Nishadam

స  SA – షడ్జమం Shadyamam

అవరోహణలో కూడా ఇవే స్వరస్థానాలు వస్తాయి

మాయామాళవగౌళ రాగంలో ఏడు స్వరాలు ఉంటాయి కాబట్టి ఇది సంపూర్ణ రాగము.72 మేళకర్త లో 15వ మేళకర్త ఈ మాయమాళవగౌళ. కర్ణాటక సంగీతంలో ప్రతి విద్యార్థి ఈ రాగంతోనే తన సంగీతాభ్యాసాన్ని  మొదలు పెడతారు.  సరళీ స్వరాలు, జంట స్వరాలు, అలంకారాలు కూడా ఈ రాగంలోనే పిల్లలకి నేర్పిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ రాగంలోని స్వరాలు, స్వర స్థానాలు సంగీతాభ్యాసం మొదలుపెట్టే విద్యార్థులకు సులభంగా అర్థమవుతాయి పాడ డానికి వీలుగా ఉంటుంది అనేది పెద్దల మాట.

మాయామాళవగౌళ రాగం లక్షణాన్ని గురించి చెప్పుకోవాలంటే… శాంతం, కరుణ, శోకము, భక్తిరసాలలో  ఆర్ద్రతతో  కూడిన ఎన్నో కీర్తనలను వాగ్గేయకారులు రచిస్తే, ప్రేమ,శృంగారం తో కూడిన పాటలను స్వరపరచి ఈ రాగంలోని మరో కోణాన్ని చూపించారు సినీ సంగీత దర్శకులు.

“శ్యామలాంబికే పాహిమాం సుఖ సౌనకాది వినుతే శ్రుతినుతే శ్రీ”   మాయామాళవగౌళ రాగంలో అమ్మవారిని స్తుతిస్తూ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు రచించిన కీర్తనను ఎంతో చక్కగా ఆలపించి మైమరపించారు పార్థు. సంగీతంలో అపారమైన ప్రజ్ఞతో పాటూ సాహిత్యంలో కూడా ఎనలేని ప్రతిభ కలిగినటువంటి ఈ విద్వాంసుడు ఈ శతాబ్దపు మేటి వాగ్గేయకారుడు అని మనమందరం ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చు.  అలాగే వారు ఉన్న సమయంలోనే మనం జన్మించడం, వారితో పరిచయ భాగ్యము, వారి ఆశీర్వాదాన్ని తీసుకోవడము నేను నాతో పాటు ఎంతోమంది కళాకారులు చేసుకున్న పూర్వజన్మ సుకృతమే కదా మరి అని మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని కీర్తించారు పార్థు.   

పోతనామాత్యులు నారదామహర్షి ద్రువునకు వాసుదేవ మంత్రాన్ని ఉపదేశించే ఘట్టంలో హరిని ఏ పూలతో ఏ పత్రాలతో స్తుతించాలి పూజించాలో అందంగా వర్ణించారు.  పోతనామాత్యులు వారు రచించిన ఈ సీస పద్యంలోని సొగసు మీకు త్యాగరాజు కృతుల్లో కూడా గుబాళిస్తుంది. తులసీదళములతో పాటు పూలగంధం పులకరిస్తుంది. గాయనీమణి లాస్య ధూళిపాల మాయామాళవగౌళ రాగంలోని “తులసి దళములచే సంతోషముగా పూజింతు…పలుమారు చిరకాలము పరమాత్ముని పాదములను” అనే ఈ పూలంగి సేవను  మనస్ఫూర్తిగా సమర్పించి ఎంతగానో ఆకట్టుకుంది.

అన్నమాచార్యుల వారు రచించిన ఎన్నో వేల కీర్తనల్లో ఒక అపురూపమైన కీర్తన  “ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు” భగవంతుడి పట్ల మన భక్తి ఎలా ఉండాలి, ఏ విధంగా కొలిస్తే ఆయనకు చేరువ అవుతాము, ఏఏ రూపాలలో కొలవచ్చు అనే విషయాలను  ఉదాహరణలతో పాటు ఎంతో గొప్పగా మన అందరికీ అర్థమయ్యేలా సులభమైన మార్గంలో వర్ణించారు అన్నమాచార్యులవారు.  ఈ కీర్తనలో రెండవ చరణం మాయామాళవగౌళ రాగం లో స్వరపరచబడింది.

“సరి నిన్నుదురు సాక్తేయులు, శక్తి రూపు నీవనుచు

దరిశనముల మిము నానా విధులను, తలపుల కొలదుల భజింతురు

సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదువు

గరిమల మిము యే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు

నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు

ఆవల భాగీరధి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు

శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని వున్న దైవ(ము)మని

ఈవలనే నీ శరణనిఎదను, ఇదియే పరతత్వము నాకు..ఇదియే పరతత్వము నాకు..ఇదియే పరతత్వము నాకు..ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు”.

ఎంత గొప్ప భావన చుడండి…. “సరి నిన్నుదురు సాక్తేయులు, శక్తి రూపు నీవనుచు దరిశనముల మిము నానా విధులను, తలపుల కొలదుల భజింతురు”, నిను దర్శించినంతమాత్రాన్నే ఎన్నో రకాలుగా కీర్తించి తరించిపోతుంటారు. “నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు” ఎంత అద్భుతమైన లైనో అది. నీరు ఎంత ఉంటే తామరపువ్వు అంతగా విస్తరిస్తుంది. ఇక్కడ నీరు మన భక్తి  అయితే, తామరపువ్వు భగవంతుడి కటాక్షం. “నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు ” ఇలాంటి అద్భుతమైన భావాలను వెదజల్లే ఆధ్యాత్మిక కీర్తనలు అన్నమాచార్యుల వారు ఎన్నో రచించి స్వామి సేవలో తరించి పోయారు అని పార్థు ఎంతో అద్భుతంగా వర్ణించిన తీరు నిజంగా ప్రేక్షకుల హృదయాలను రంజింపచేసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

భగవంతుని నిలదీయాలి అంటే ఎంత భక్తి ఉండాలి ఇంకెంత శక్తి ఉండాలి. స్వామీ నీ పాదపద్మాలను ప్రేమతో సేవిస్తున్నాను కదా…అపరాధమేమైనా చేసానా…. అత్యాశకు పోయానా,,,మరి నేను చేసిన నేరం ఏమిటి అంటూ రామదాసుల వారు ఈ కీర్తనలో ప్రతీ చరణంలోనూ ఒక పెద్ద జాబితానే ఏకరువు పెట్టారు. గుడి కట్టించిన భక్తుడే గుండెల్లో రాముణ్ణి నిలదీశారు. ఆ వేదన ఈ నాదంలో వుంది.  “సీతారామ స్వామి నే చేసిన నేరములేమి” అనే ఈ కీర్తనను రామదాసువారు రచిస్తే మాయామాళవగౌళ రాగంలో  మంగళం పల్లి బాలమురళీకృష్ణ గారు ఎంతో హృద్యంగా స్వరపరిచారు. అదిత్రి బడితెలా ఇప్పుడు “సీతారామ స్వామి నే చేసిన నేరములేమి..కోరితినా ఆ ఒక్కటితప్పా… నేరాలెన్నగ నేనే గొప్పా…స్వామీ” అని ఈ కీర్తనను ఎంతో మధురంగా గానం చేసి వీక్షకుల అభినందనలు అందుకుంది.  

1991లో రిలీజ్ అయిన తమిళ చిత్రం “గోపుర వాసలిలే” ఈ సినిమాలో అప్పుడే ప్రేమలో పడ్డ కుర్రకారు కోసం తమిళ్ రైటర్ వాలి గారు మంచి లవ్ సాంగ్ ను రాశారు. “కాదల్ కవిధైగల్ పడితుడుం నేరం” అంటూ సాగే ఈ పాటని ఇళయరాజా గారు మాయామాళవగౌళ రాగంలో స్వరపరిచారు.  పెదవుల ద్వారా ప్రేమ పరిచయం చదవాల్సిన సమయం అంటూ సాగే ఈ పాటని బాలు గారు చిత్ర గారు తమ గానంతో సూపర్ హిట్ చేశారు. “కాదల్ కవిధైగల్ పడితుడుం నేరం, ఇధజహోరం…. ఇని కామన్ కళైగళి పిరందిడుం రాగం, పుదు మోఘం” అనే ఈ వినసొంపైన పాటను భావన రవిచంద్రన్ ఎంతో అద్భుతంగా పాడి అమితంగా ఆకట్టుకుంది. 

ఆలాపన సినిమా కోసం డాక్టర్ సి.నారాయణరెడ్డి గారి రచించిన “కలిసే ప్రతి సంధ్యలో పలికే ప్రతి అందెలో” అనే మాయామాళవగౌళ రాగంలో మృదుమధురంగా స్వరపరిచిన  పాటలోని పల్లవిని పార్థు చక్కగా పాడి వినిపించారు.

1804 సంవత్సరంలో తంజావూరులో జన్మించిన వాగ్గేయకారులు పొన్నయ్య పిళ్ళై గారు. వీరు కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితుల వారి శిష్యులు. తంజై నాళ్వార్ గా ప్రసిద్ధి చెందిన తంజావూరు సంగీత నాట్య సోదరుల లో పొన్నయ్య గారు రెండోవారు. వీరు తెలుగు తమిళ భాషల్లో ఎన్నో కీర్తనలు రచించారు.  మాయామాళవగౌళ రాగంలో అమ్మవారిని స్తుతిస్తూ పొన్నయ్య పిళ్ళై గారు రచించిన “మాయాతీత స్వరూపిణి  నన్ను బ్రోవవే… మహా త్రిపుర సుందరి శాంకరి గౌరీ ” ఈ కీర్తనను మాన్య గుమ్మరాజు  ఎంతో చక్కగా పాడి మైమరపించింది. 

మాయామాళవగౌళలో ట్యూన్ లో చేయ బడ్డ  సినిమా పాటల్లో మోస్ట్ పాపులర్ హిట్ జగదేకవీరుడు చిరంజీవి అతిలోకసుందరి శ్రీదేవి నటించిన “యమహో నీ యమా యమా అందం” అనే పాట. దేనికైనా పెట్టి పుట్టాలి అనేది సామెత. దానికి భూమి మీదే పుట్టాలని చెప్పడం వేటూరి గారి ప్రత్యేకత. జగదేకవీరుడుతో  ఇహలోక జీవితాన్ని పంచుకోవాలని అతిలోకసుందరి తాపత్రయ పడితే… వేటూరి గారి కలం ఊరుకుంటుందా… వేటూరి గారి పదాలకు ఇళయరాజా గారి మాయామాళవగౌళ స్వరాలు తోడై యమహో అనిపించాయి, ప్రేక్షకుల్ని ఒక ఆటాడించాయి, మళ్ళీ మళ్ళి చూడాలనిపించాయి.

 

 

 

 

 

.”యమహో నీ యమ యమ అందం” అనే ఈ పాటను  గాయనీ గాయకులు  ఆదర్శ్ మీనన్, స్నిగ్ధ మల్లాది ఎంతో అద్భుతంగా పాడి వీక్షకులకు కనువిందు చేసారు.

స్వర రాగ గీతం కార్యక్రమంలో ఇవ్వాల్టి ఎపిసోడ్ లో పాల్గొనబోతున్న సెలబ్రిటీ మీ అందరికీ సుపరిచితులైన సంగీతజ్ఞుడు. పట్టు కుచ్చులా సుకుమారంగా, పుట్టతేనెలా మధురంగా ఆయన గొంతు విన్నప్పుడల్లా పసితనంలోని సౌకుమార్యం, పసిడి తీగలోని రాలిత్యం గుర్తుకొస్తాయి అందుకేనేమో ఆయనలోని శిక్షకుడు బాలగంధర్వుల వైపు దృష్టి పెట్టాడు. నునులేత గళాలను సానపెట్టి ప్రతిభగల గాత్రాలుగా తీర్చి దిద్దారు. 

ఇవాళ సినిమా రంగంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వర్ధమాన ప్లేబాక్ సింగెర్స్ లో అందరిలో అధిక శాతం మంది ఆయన శిష్యులే. లిటిల్ ముజిషన్స్ అకాడమీ వ్యవస్థాపకుడు ఒక ప్రముఖ సింగర్, మంచి స్వరకర్త అన్నిటికి మించి నాకు మంచి మిత్రుడు శ్రీ కోమండూరి రామాచారి.

రామాచారి తన అభినందన సందేశం ఇస్తూ…ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నేను చూస్తున్నాను, ఆనందిస్తున్నాను, పదిమందికి చెప్తున్నాను. ఆ కార్యక్రమం పేరే స్వర రాగ గీతం. అమెరికాలో పుట్టి పెరిగి మన భాష సంస్కృతి సంగీతం నేర్చుకుంటూ పాడుతా తీయగా లాంటి  కార్యక్రమంలో పాల్గొని తమ గళాన్ని వినిపించి, బాలు గారి ఆశీస్సులు పొంది,  సంగీతాభిమానుల ప్రశంసలు పొందినటువంటి చిన్నారులంతా వారి తల్లిదండ్రుల సహకారంతో స్వర వేదిక అనే సంస్థ స్థాపించి అనేక కార్యక్రమాల ద్వారా సంగీత అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు  వాళ్ళ పాటలతో.  ఇక స్వర వేదిక సమర్పణలో నా మిత్రుడు, నా సహాగాయకుడు కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ వ్యవస్థాపకుడు, గాయకుడు, స్వరకర్త, సంగీత గురు, పార్థసారథి నేమాని ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా అత్యద్భుతంగా నిర్వహించారు.

రామాచారి… ఈ కార్యక్రమంలో తనకు నచ్చిన అంశాలను చెపుతూ… ముఖ్యంగా పాటలు పాడాలనుకునే  గాయనీగాయకులు సద్గురువు దగ్గర శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించి రాగ తాళాలు నేర్చుకొని అవగాహనతో గనుక పాటలు పడితే చాలా చాలా అద్భుతంగా పాడి అందరినీ అలరిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా ఆ స్ఫూర్తిని పొందుతారు.  పార్ధు ఈ కార్యక్రమంలో ఒక రాగాన్ని తీసుకొని ఆ రాగంలో ఉండే స్వర స్థానాలు,  రాగ సంచలన, స్వర సంచలన, అలాగే ఆ రాగంలో వుండే భావం మనకు చక్కగా వివరిస్తూ ఆ రాగంలో  కూర్చబడినటువంటి కీర్తనలు, భక్తి గీతాలు, సినిమా పాటలు తను  పాడుతూ తన తోటి గాయని గాయకులచే పాడిస్తూ, వాళ్లతో మాట్లాడిస్తూ,  తను నేర్పిస్తున్న శిష్యులతో ముఖ్యంగా ఇప్పుడిప్పుడే బాగా పైకి వచ్చినటువంటి శిష్యులతో పాడిస్తూన్నారు. ఏ పాటలోనైనా రాగం ఉంటుంది, తాళం ఉంటుంది. ఏదో ఒక రాగం ఆధారం చేసుకుని స్వరపరుస్తారు. ఆ పాటలోని భావాన్ని బట్టి స్వరకర్త ఆ రాగాన్ని ఎంచుకొని  చక్కగా స్వరపరుస్తారు. గాయనీ గాయకులకి అటు సాహిత్యం మీద ఇటు సంగీతం, సంగీతంలో వొచ్చే రాగ, తాళాల మీద అవగాహన వుండి పాడితే చాలా చాలా బాగా పాడుతారు. మరి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వాళ్ళకి స్ఫూర్తి కలుగుతుంది, సంగీతం విలువ తెలుస్తుంది. శాస్త్రీయ సంగీతం ఎంత ఇంపార్టెంట్ నేర్చుకోవడం మనం పాట పాడడానికి అనేది తెలుస్తుంది. సంగీతం నేర్చుకుంటునటువంటి విద్యార్థులు, వారి తల్లి తండ్రులు, సంగీతాభిమానులు తప్పకుండా ఈ కార్యక్రమం చూడాలి. ఇక పార్థ సారధి, నేను ఇద్దరము  కలసి ప్రయాణం చేస్తున్నాము. మొట్టమొదటి సిరీస్ పాడుతా తీయగా లో మేము పార్టిసిపెంట్స్. ఫైనలిస్టులము. ఇప్పుడు ఎంతో మంది పిల్లలు పాడుతా తీయగాలో పాడుతున్నారు, పైకొస్తున్నారు, వెలుగులోకి వస్తున్నారు  బాలు గారి ఆశీస్సులతో. ఈ మొత్తం పాడుతా తీయగా లో మొట్టమొదటి సిరీస్ విజేత అయినటువంటి మన పార్థ సారథి నిర్వహణలో ఈ  కార్యక్రమం కొనసాగుతుంది.. మనందరికీ గర్వకారణం. అయితే నేను పార్థసారథి కొన్ని వందల కార్యక్రమాల్లో కలసి పాడాము. మేము ఎప్పుడు కలుసుకున్నా సంగీతం గురించి, పిల్లల గురించి తర్వాతి జనరేషన్ వాళ్ళు ఎలా నేర్చుకోవాలి ఈ పాటలు అని చర్చించుకుంటాము. తన టీచింగ్ స్టైల్ చూసి నేను నేర్చుకుంటాను, నా టీచింగ్ స్టైల్ చూసి తాను నేర్చుకుంటాడు. మా ఇద్దరికీ కామన్ స్టూడెంట్స్ వున్నారు చాల చోట్ల. ఇద్దరి తపన, మా సంకల్పం ఒక్కటే,  తర్వాతి తరాల వాళ్ళకి మన సంగీతము,  మన భాష రావాలి. పాటని సక్రమంగా నేర్చుకొని పాడాలి. అనేదే మా తపన.

ఈ ప్రణయంలో భాగంగానే ఎన్నో కార్యక్రమాలు రూపొందిస్తుంటాడు పార్థు. అలాంటి కార్యక్రమాలలో ఒక  అత్యద్భుతమైన కార్యక్రమం ఈ స్వర రాగ గీతం అనే కార్యక్రమం. ఎన్నెన్నో రాగాలని పరిచయం చేస్తూ, ఆ రాగాల లో ఉన్నటువంటి పాటలను పరిచయం చేస్తూ, మనకి ఒక అవగాహనని, స్ఫూర్తిని కలిగిస్తున్న ఈ అద్భుతమైన ప్రయోజనాత్మకమైనటువంటి కార్యక్రమం, నిరంతరంగా కొనసాగాలని  నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిత్రుడు నేమాని పార్థ సారథికి, అలాగే స్వర వేదిక నిర్వాహకులు అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ స్వర రాగ గీతం కార్యక్రమం విశేషాలను ఎంతో చక్కగా వివరించి తన శుభాభినందనలు తెలియచేసారు కోమండూరి రామాచారి గారు.

స్వర రాగ  గీతం కార్యక్రమంలో మాయామాళవగౌళ రాగాలాపన వచ్చే వారం కూడా కొనసాగుతుందని తెలుపుతూ పార్థు ఈ ఎపిసోడ్ ని ముగించారు.

 

“స్వరవేదిక”, కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఆన్లైన్లో (యూట్యూబ్ ద్వారా) ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్న “స్వర రాగ గీతం” కార్యక్రమంలోని ప్రతీ ఎపిసోడ్ కి సంబంధించిన అంశాలను, విశేషాలను అక్షరరూపంలో మీ ముందు ఉంచడానికి ఓ చిరుప్రయత్నం చేస్తున్నది మీ….. కళావైభవం.కామ్ / www.kalavaibhavam.com  

 

 

247 thoughts on “స్వర వేదిక, కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న “స్వర రాగ గీతం”లో మధురోహల హేల  “మాయామాళవగౌళ ” రాగం పార్ట్-1, ఎపిసోడ్-9 కార్యక్రమంలో  కీర్తనలు, భక్తి పాటలు, సినిమా పాటలతో వీక్షకులకు కనువిందుచేసింది”

  1. After reading your article, it reminded me of some things about gate io that I studied before. The content is similar to yours, but your thinking is very special, which gave me a different idea. Thank you. But I still have some questions I want to ask you, I will always pay attention. Thanks.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *