కలవాణి అలివేణి “కళ్యాణి”  రాగం కొనసాగింపుగా పార్ట్-2 (రెండవ), ఎపిసోడ్-12 మరిన్ని కీర్తనలు, భక్తి పాటలు, సినిమా పాటలతో వీక్షకులకు కనువిందుచేసింది

కలవాణి అలివేణి “కళ్యాణి”  రాగం కొనసాగింపుగా పార్ట్-2 (రెండవ), ఎపిసోడ్-12 మరిన్ని కీర్తనలు, భక్తి పాటలు, సినిమా పాటలతో వీక్షకులకు కనువిందుచేసింది;

 

స్వర వేదిక, కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ “స్వర రాగ గీతం” కార్యక్రమం

స్వర వేదిక, కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న “స్వర రాగ గీతం”లో కలవాణి అలివేణి “కళ్యాణి” రాగం పార్ట్-2 కొనసాగింపుగా ఎపిసోడ్-12 కి అందరికీ స్వాగతం పలికారు ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, వ్యాఖ్యాత పార్థసారథి నేమాని (పార్థు).

ఈ కార్యక్రమంలో కళ్యాణి రాగం రెండో ఎపిసోడ్ కి మీ అందరికీ స్వాగతం కళ్యాణి రాగం పూర్తి పేరు మేచకళ్యాణి ఇది 72 మేళకర్త రాగాలలో 65వ మేళకర్త రాగం 

కళ్యాణి రాగము

ఆరోహణ: స రి గ మ ప ద ని స  – SA RI GA MA PA DA NI ṠA   

అవరోహణ: స ని ద ప మ గ రి స – SA NI DA PA MA GA RI SA

కళ్యాణి రాగంలోని స్వర స్థానాలు

స  SA – షడ్జమం Shadyamam

రి  RI – చతుశ్రుతి రిషభము Chatusruthi Rishabham

గ  GA – అంతర గాంధారం Anthara Gaandhaaram

మ MA – ప్రతి మధ్యమం  Prathi Madyamam

ప  PA – పంచమం PANCHAMAM

ద DA – చతుశ్రుతి దైవతము Chatusruthi Daivatham

ని NI – కాకలి  నిషాదం Kakali Nishadam

స  SA – షడ్జమం Shadyamam

అవరోహణలో కూడా ఇవే స్వరస్థానాలు వస్తాయి. 

ఇవాళ వినాయక చవితి. స్వరరాగ గీతం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమం నిర్వాహకుడు పార్థ సారథి.  తన మధురమైన వ్యాఖ్యానముతో…. మనం మామూలుగా ఏ పని మొదలు పెట్టినా అది నిరాటంకంగా నిర్విఘ్నంగా కొనసాగలని ఆ వినాయకుడిని ప్రార్థించే మొదలు పెడతాం కదా.

అదే ఆచారాన్ని కొనసాగిస్తూ ప్రపంచం మొత్తం ఒక విపత్కర పరిస్థితులు నెలకొన్న ఈ వేళ మానవాళికి సుఖశాంతులు తిరిగి అంది వారందరూ సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడపాలని ఆ గణనాథుని ప్రార్థిస్తూ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు కాణిపాక వినాయకుని స్తుతిస్తూ రచించిన ఈ పాటతో ఈ నాటి ఈ సంచికను మొదలు పెట్టబోతున్నాను.  ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ వందేమాతరం శ్రీనివాస్ గారు దేవుళ్ళు సినిమా కోసం ఈ పాటని కళ్యాణి రాగంలో స్వరపరిస్తే గాన గంధర్వులు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం నటించి ఎంతో భక్తి ప్రపత్తులతో ఈ గీతాన్ని ఆలపించారు. వ్యాఖ్యాత, గాయకుడు పార్థు ఎంతో భక్తితో పాడిన ఈ కీర్తన భక్తి పారవశ్యంలో ఓలలాడించింది.

వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా

నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా….

జయ జయ శుభకర వినాయక

శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక

జయ జయ శుభకర వినాయక

శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక

ఆ..ఆ..ఆ..ఆ

 

త్యాగరాజస్వామి వారి కళ్యాణి రాగంలో ఎన్నో కృతులను రచించారు. లాస్ట్ ఎపిసోడ్ లో వారు రచించిన వాసుదేవ అనే  కీర్తనను కూడా విన్నాను. “అమ్మ రావమ్మా తులసమ్మ నను పాలింప వమ్మా” అనే కీర్తన మరియు వీటన్నిటిలోను పార్ధుకి బాగా ఇష్టమైన కీర్తన “నిధి చాలా సుఖమా… రాముని సన్నిధి సేవ సుఖమా” అనే కీర్తనలు చాలా చక్కగా పాడి వినిపించారు పార్థు.

కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారు తమిళనాడులోని తిరువళ్ళూరు గ్రామంలో జన్మించారు .ఈ ఊరిని శ్రీపురంగా కూడా పిలుస్తారు. అక్కడ వెలసిన అమ్మవారు కమలాంబిక సుబ్రమణ్య స్వామి సాక్షాత్కారం పొందిన శ్రీ ముత్తుస్వామి దీక్షితులు శ్రీవిద్యోపాసకులు. వారు శ్రీ చక్రంలోని ఆవరణలో ఒక కీర్తన చొప్పున మొత్తం 9 కీర్తనలు రచించారు. ఇవి శ్రీపురకమలాంబిక నవావర్ణ కీర్తనలు గా ప్రసిద్ధికెక్కాయి వీటిలో  చెందిన కీర్తనే “కమలాంబామ్  భజరే”. కళ్యాణి రాగం.

“కమలాంబాం భజరే రే మానస

కల్పిత మాయా కార్యం త్యజ రే

కమలా వాణీ సేవిత పార్శ్వాం

కంబు జయ గ్రీవాం నత దేవాం

(మధ్యమ కాల సాహిత్యమ్)

కమలా పుర సదనాం మృదు గదనాం

కమనీయ రదనాం కమల వదనామ్”

కళ్యాణి రాగంలో స్వరపరచబడ్డ ఈ స్వరపుష్పాన్ని ఎంతో మధురంగా పాడి, అమ్మవారికి సమర్పించి, అమ్మవారిని సేవింపచేసింది గాయని సుప్రజా కడగండ్ల.

కళ్యాణి రాగం లో వచ్చిన సినిమాపాటలలో భక్తి పాటలు, శాస్త్రీయ సంగీతం ఆధారంగా స్వరపరిచి పాడిన పాటలు, వేదాంతపరమైన పాటలు, రొమాంటిక్ సాంగ్స్ ఇలా ఎన్నో ఉన్నాయి.

మేఘసందేశం సినిమా కోసం వేటూరి సుందర మూర్తి గారు  రాసిన ఒక పాటని రమేష్ నాయుడు గారు కళ్యాణి రాగంలో స్వరపరిస్తే పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఈ చిత్రంలో నటించి, పాడి అలరించారు. ” పాడనా వాణి కళ్యాణి గా…స్వరరాణి పాదాల పారాణిగా…పాడనా వాణి కళ్యాణి గా… నా పూజకు శార్వాణిగా నా భాషకు గీర్వాణిగా అనే పల్లవిని ఎంతో మధురంగా పాడి వినిపించారు గాయకుడు పార్థు.

 

 

మహాభారతంలో విరాటపర్వం చదివితే వర్షాలు కురుస్తాయని ఓ నమ్మకం. విరాటపర్వం ఆధారంగా 1964 లో నర్తనశాల సినిమా తీసినప్పుడు కనకవర్షమే కురిసింది.  నవరసాలు మేళవించిన ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకుల లోకం హర్షాన్ని కురిపించింది. ఈ సినిమాలో అర్జునుడుగా అందంగా… బృహన్నల రూపంలో విభిన్నం  గా ఒదిగిపోయారు ఎన్టీ రామారావు. ఈ సినిమాలో ఒక నాట్య  సన్నివేశం కోసం సముద్రాల రాఘవాచారి గారు సలలిత మైన గీతాన్ని రాస్తే… సుసర్ల దక్షిణామూర్తి గారు కళ్యాణిరాగసుధారస భరితమైన    స్వరరచన చేసారు. మంగళం పల్లి వారు బెంగుళూరు లత గారు సంయుక్తంగా ఆలపించిన పాట “సలలితరాగ సుథారస సారం…సర్వ కళామయ నాట్య విలాసం….సర్వ కళామయ నాట్య విలాసం” అని   గాయకుడు అభి వేములపాటి ఎంతో చక్కగా, ఎంతో మధురంగా పాడి వీక్షకులను మైమపరపించాడు.

కళ్యాణి రాగం లో వచ్చిన సినిమా పాటలు ఎన్ని వినిపించినా ఇంకొన్ని మిగిలిపోతూనే ఉంటాయి. అందుకే సాధ్యమైనన్ని ఎక్కువ మీకు వినిపించడానికి చేసే ప్రయత్నంలో భాగంగా “జగమే మారినది మధురముగా ఈ వేళ” అనే పాట పల్లవిని పాడి వినిపించారు పార్థు.

శ్యామకృష్ణ ముద్రతో నాదాన్ని ఆత్మానందంతో మేళవించిన వాగ్గేయకారుడు శ్యామశాస్త్రి వారు. కర్ణాటక  సంగీత త్రిమూర్తుల్లో ఒకరైన వీరి శైలి కదళీపాకం అంటే అరటిపండు ఒలిచినట్టు ఉంటుందని సంగీత సమీక్షకుల అభిప్రాయం.  తెలుగు సంస్కృత భాషల్లో అమ్మవారిని స్తుతిస్తూ వీరు రచించిన కృతులు ఎంతో ప్రాచుర్యం పొందాయి. సుమేరు మధ్య వాసిని అయిన శ్రీ లలితా పరమేశ్వరిని  స్తుతిస్తూ శ్యామశాస్త్రి వారు రచించిన “హిమాద్రిసుతే పాహిమాం వరదే పరదేవతే…సుమేరుమధ్య వాసిని శ్రీ కామాక్షి” అనే ఈ కృతిని కళ్యాణి రాగంలో గాయని మనోజ్ఞ రాజనాల ఎంతో చక్కగా పాడి వినిపించి వీక్షకులను పరవశించేటట్టు చేసింది.

రామాయణం భారతంలాంటి పురాణాల్లోని సన్నివేశాలను పాత్రలను నేటి పరిస్థితులకు అన్వయిస్తూ చాలా సినిమాలు వచ్చాయి. 1991లో ప్రముఖ దర్శకుడు మణిరత్నం తీసిన దళపతి సినిమా ఈ కోవకు చెందిందే. కర్ణుడు దుర్యోధనుడు స్నేహం ఆధారంగా సూపర్ స్టార్స్ రజనీకాంత్, మమ్ముట్టిలతో తీసిన ఈ సినిమా అదే “దళపతి” పేరుతో తెలుగులోకి డబ్ చేయబడింది. ఈ సినిమా కోసం రాజశ్రీ గారు “యమునా తటిలో నల్లనయ్యకై యెదురు చూసెనే రాధా ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడి పోయెను కాదా”  అని రాసిన ఈ పాటను ఇళయరాజా గారు కళ్యాణిరాగంలో స్వరపరిస్తే, స్వర్ణలత గారు ఆలపించారు.  తన సినీ కెరీర్లో ఎంతో హైట్స్ కి  చేరుకుంటున్న సమయంలోనే అకాల మరణం చెందిన స్వర్ణలత గారిని గుర్తుచేసుకుంటూ గాయని ప్రియా కనజం ఎంతో వైవిద్యభరితంగా పాడి వినిపించిన ఈ పాట వీక్షకుల హృదయాలను మిరుమిట్లు గొలిపించింది, చక్కగా పాడి అమితంగా ఆకట్టుకుంది. 

“జోరుమీదున్నావు తుమ్మెదా నీ జోరెవరికోసమే తుమ్మెదా….”, “శ్రీరామనామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహుతీపి” అనే పల్లవులను అందుకొని పార్థు జోరుగా పాడి అలరించారు.   

మహా భక్తులకు పూజ కేవలం మానసికమైన భావన కాదు… అలా అని అది ఆడంబరమైన భాహ్య ప్రదర్శన కాదు. ఈ పూజ వేదాంతం వైరాగ్యాల సంగమం.  తూము నరసింహ దాసు గారి ఈ కీర్తన ఇందుకు చక్కటి ఉదాహరణ. సొగసైన పోలికలతో శ్రీరామచంద్రుని వర్ణిస్తూ ఒక్కొక్క అందాన్ని ఒక్కొక్క పువ్వుతో  పూజిద్దామంటున్న దాసు గారు  చివరి చరణంలో తమ పూజలందుకుంటున్న శ్రీ రామచంద్రుడు తమ హృదయం లోనే కొలువై ఉన్నాడని తీర్మానించారు. అలా చెప్పడం ద్వారా భౌతికపరమైన ఈ పువ్వులు,  పూజ  అన్ని ఆధ్యాత్మిక స్థాయిని సంతరించుకోవడం ఈ కీర్తనలోని  విశేషం. “పూజ సేయరే రాముని….  బంగరుపూల పూజసేయరే… పూజ సేయరే రాజ రాజతనూజుని, రవికోటితేజుని రామునిపదములకు”  అంటున్న దాసు కీర్తన కళ్యాణి రాగంలో గాయనిఅమృతతుర్లపాటి చాలా చక్కగా పాడి అమితంగా ఆకట్టుకుంది.

కల్యాణి రాగంలో తెలుగు సినిమాల లాగానే హిందీ సినిమాల్లో కూడా పాత కొత్త సినిమాల్లో ఎన్నో పాటలు వచ్చాయి అలాగే ఎన్నో గజల్స్  కూడా ఈ రాగంలో కంపోజ్ చేయబడ్డాయి.  వీటిలో కొన్ని హిందీ పాటల పల్లవులను పాడి వినిపించారు పార్థు.

ప్రముఖ హిందీ నటుడు దేవ్ ఆనంద్ గారు డ్యూయల్ రోల్ లో నటిస్తూ తన సొంత బ్యానర్ మీద 1961లో రిలీజ్ చేసిన ఈ సినిమా హమ్ దోనో.  ఈ సినిమా కోసం సాహిర్ లుధియాన్వీ గారు ” అభి నా జావో ఛోడుకార్, కె దిల్ అభి భరా నహి ” అనే పాట అందరికీ తెలిసే ఉంటుంది. ఈ పాటని జయదేవ్ గారు కళ్యాణి రాగంలో స్వరపరిస్తే, రఫీ గారు, ఆశాజీ అనితరసాధ్యమనేలా  ఆలపించారు.  60 ఏళ్లనాటి ఆ పాటను గాయని కావ్య బొఱ్ఱ ఎంతో మధురంగా, చక్కగా పాడి అమితంగా ఆకట్టుకుంది.

ఘంటసాలగారు అత్యద్భుతంగా పాడిన అతి క్లిష్టమైన పాటల్లో ఒకటి “మది శారదాదేవి మందిరమే “జయభేరి” సినిమా కోసం ప్రముఖ సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వర రావు గారు కళ్యాణి రాగంలో స్వరపరిచిన ఈ పాటని మీకు వినిపించబోతున్న గాయకుడే ఇవాల్టి  గెస్ట్ పవన్ చరణ్ బొనిలా.   ఇతను ప్రముఖ గాయకుడుగా వర్ధమాన గాయకుడిగా సుపరిచితుడే. కాకపోతే పవన్ ఒక మంచి వయోలిన్ ప్లేయర్ కూడా.  స్వర రాగా గీతం కార్యక్రమంలో మన గాయని గాయకులూ ఆలపిస్తున్న శాస్త్రీయ సంగీత కీర్తనలన్నింటికీ వయోలిన్ పై సహకారం అందిస్తున్నది కూడా పవన్ చరణ్.  పవన్ జీ సరిగమప, పాడాలని ఉంది, బోల్ బేబీ బోల్ అనేక టైటిల్స్ గెలుచుకున్నాడు అంతేకాకుండా మా టీవీలో ప్రసారమైన సీతామహా  లక్ష్మి సీరియల్ టైటిల్ సాంగ్ కు గాను నంది అవార్డు కూడా గెలుచుకున్నాడు. అనేక సినిమాల్లో పాటలు పాడటమే కాకుండా బాహుబలి సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో వయోలిన్ ద్వారా తన సహకారం అందించాడు పవన్ చరణ్.  ప్రముఖ సంగీత విద్వాంసుడు నేపథ్య గాయకుడు ఘంటసాల గారు పాడిన పాటలని దాదాపు పర్ఫెక్షన్ తో పాడే గాయకుల్లో ప్రముఖుడైన శ్రీ బి.ఏ. నారాయణ గారి కుమారుడు ఈ పవన్ చరణ్.  ఘంటసాల గారు పీబీ శ్రీనివాస్ గారితో, రఘునాథ్ పాణిగ్రాహి గారితో కలిసి పాడిన ఈ పాటను తానొక్కడే ఆలపించి అందరిని అలరించబోతున్న ఈ నాటి గెస్ట్ పవన్ చరణ్ బొనిలాకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు వ్యాఖ్యాత, గాయకుడూ, కార్యక్రమం నిర్వాహకుడు పార్థ సారధి.

ఈనాటి గెస్ట్ పవన్ చరణ్ బొనిలా మాట్లాడుతూ.….అందరికీ నమస్కారం నేను మీ పవన్ చరణ్ ప్లే బ్యాక్ సింగర్, వయోలిన్ ప్లేయర్ ని.

స్వర రాగ గీతం అనే కార్యక్రమంలో నేను కూడా ఈ ఎపిసోడులో పాలుపంచుకోవడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఇంత మంచి అవకాశం కల్పించిన పార్థసారధి గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వారు తలపెట్టిన ఈ కార్యక్రమం ఎంత గొప్పదంటే కర్ణాటక సంగీతంలో హిందుస్థానీ సంగీతంలో ఉండే రాగాలని ఆధారంగా చేసుకుంటూ ఆ రాగాలలో ఉండే అనేక కృతులని, కీర్తనలను, పాటలను, ఆ రాగ స్వరాలను వివరిస్తూ, ఆ రాగాల యొక్క అందాన్ని వర్ణిస్తూ కార్యక్రమం చేయడం గొప్ప  విషయం అని చెప్పాలి.  ఇంత మంచి కార్యక్రమంలో మొదటి నుంచి  పరోక్షంగా నేనూ పాల్గొనడం జరిగింది. అది భగవత్సంకల్పం అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఔత్సాహిక గాయని గాయకులు చిన్న పిల్లలు పాడిన కృతులు, కీర్తన లకి నేను వయోలిన్ తో సహకారం చేయడం జరిగింది. అలాగే పార్థసారధిగారితో నాకున్న అనుబంధం ఒక సోదరుడిగా,  మా ఇంటికి పెద్దగా, నాకు అండగా నిలిచిన ఏకైక వ్యక్తి పార్థసారథి గారు. వారి కచేరీలో నేను  పాల్గొనడం జరిగింది.  అలాగే  వారు చేసిన ఎన్నో ఆల్బమ్స్,  ఆ ఆల్బమ్స్  లో కొన్నిటీని ఆల్బమ్స్  బాలెస్ కూడా వారు చేసారు. ఆ బాలెస్లో కూడా  నేను పాడడం జరిగింది. మా తప్పుల్ని కూడా సరిదిద్ది మమ్మల్ని ఒక సన్మార్గంలో నడిపిస్తున్న ఏకైక వ్యక్తి  పార్థ సారధి. వారి గురించి ఇవాళ ఈ కార్యక్రమంలో ఎంత చెప్పినా చాలా తక్కువ అని అనిపిస్తుంది. అంత మంచి కార్యక్రమం లో ఇవాళ ఈ రోజు నాకు ఒక మంచి అవకాశం కూడా లభించింది. కళ్యాణి  నాకు ఎంతో ప్రీతికరమైన రాగం. 

కల్యాణి రాగంలో ఘంటసాల మాస్టారి “మది శారదా దేవి మందిరమే…మది శారదా దేవి మందిరమే… కుదురైన నీమమున కొలిచేవారి…మది శారదా దేవి మందిరమే..” జయభేరి సినిమా నుంచి పెండ్యాల నాగేశ్వరరావు గారి స్వర రచన తో సాగే ఈ పాట మీ అందరి కోసం వినండి నన్ను ఆశీర్వదించండి అని “మది శారదా దేవి మందిరమే…మది శారదా దేవి మందిరమే… కుదురైన నీమమున కొలిచేవారి…మది శారదా దేవి మందిరమే..” అని ఎంతో అద్భుతంగా, వినసొంపుగా పాడి వీక్షకులను రసమయపరిచి మైమరపించాడు మన పవన్ చరణ్ బొనిలా.

 

గత రెండు వారాలు కళ్యాణి రాగంలో శాస్త్రీయ సంగీతం కీర్తనలు, లలిత సంగీతం పాటలు తెలుగు తమిళ హిందీ భాషల్లో వచ్చిన సినిమా పాటలు. గజల్స్ వీటన్నిటితో ఆనందపరిచిందని ఆశిస్తూ ఇళయరాజా గారు కళ్యాణి రాగంలో స్వరపరిచిన మరో ఆణిముత్యం

“హే..! పాండురంగా…

హే..! పండరి నాథా…

శరణం శరణం శరణం…

సాయీ శరణం… బాబా శరణం శరణం, సాయీ చరణం… గంగా యమున సంగమ సమానం…ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే…మా పాండురంగడు… కరుణామయుడు సాయే…”  అని పార్థు పాడిన ఈ భక్తి పాట భక్తి పారవశ్యంలో ఓలలాడించి, వీక్షకుల  హృదయాలను రంజింపచేసింది.

ఈ అద్భుతమైన భక్తిరసమైన పాటతో ఈ ఎపిసోడ్ “కళ్యాణి రాగాన్ని”  ఎంతో భక్తి పారవశ్యంతో ముగించారు మన పార్థ సారథి (పార్థు). 

“స్వరవేదిక”, కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఆన్లైన్లో (యూట్యూబ్ ద్వారా) ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్న “స్వర రాగ గీతం” కార్యక్రమంలోని ప్రతీ ఎపిసోడ్ కి సంబంధించిన అంశాలను, విశేషాలను అక్షరరూపంలో మీ ముందు ఉంచడానికి ఓ చిరుప్రయత్నం చేస్తున్నది మీ….కళావైభవం.కామ్ / www.kalavaibhavam.com

 

Swara Raga Geetham “Kalyani Ragam” Part 2, Episode 12, 22nd August-2020

 

3 thoughts on “కలవాణి అలివేణి “కళ్యాణి”  రాగం కొనసాగింపుగా పార్ట్-2 (రెండవ), ఎపిసోడ్-12 మరిన్ని కీర్తనలు, భక్తి పాటలు, సినిమా పాటలతో వీక్షకులకు కనువిందుచేసింది”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *