తిరుప‌తి, 2021 జనవరి 13: శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏకాంతంగా భోగితేరు

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏకాంతంగా భోగితేరు

అధ్య‌య‌నోత్స‌వాలు ప్రారంభం

తిరుప‌తి, 2021 జనవరి 13: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధ‌‌వారం సంక్రాంతి భోగి పండుగ ఏకాంతంగా జ‌రిగింది. ఇందులోభాగంగా ఉద‌యం తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి ధ‌నుర్మాస కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఆ త‌రువాత స‌హ‌స్ర‌నామార్చ‌న చేప‌ట్టారు. సాయంత్రం శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని, శ్రీకృష్ణస్వామివారిని భోగితేరుపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారంలో ఊరేగింపు నిర్వహించారు. కోవిడ్‌-19 నిబంధ‌న‌ల నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఏకాంతంగా చేప‌ట్టారు.

అధ్య‌య‌నోత్స‌వాలు ప్రారంభం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధ‌వారం అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్ర‌వ‌రి 5వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి. అధ్య‌య‌నోత్స‌వాల సంద‌ర్భంగా ఆలయంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారిని, సేనాధిపతివారిని, భాష్య‌కార్ల‌ను, ఆళ్వార్లను వేంచేపు చేసి దివ్యప్రబంధాన్ని పారాయణం చేస్తారు.

జనవరి 14న మకర సంక్రాంతి

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 14వ తేదీ మకర సంక్రాంతి సంద‌‌ర్భంగా ఉదయం 9.30 నుండి 11 గంట‌ల వ‌ర‌కు శ్రీ చక్రత్తాళ్వార్‌ను ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలోనికి తీసుకెళ్లి చక్రస్నానం నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారిని ఆలయంలోని విమాన ప్రాకారంలో ఊరేగించి ఆస్థానం చేపడతారు.

జనవరి 15న గోదా ప‌రిణ‌యోత్స‌వం

శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 15వ తేదీ గోదా పరిణయోత్సవం నిర్వ‌హించ‌నున్నారు. ఉద‌యం 5.30 గంట‌ల‌కు శ్రీ పుండ‌రీక‌వ‌ళ్లి అమ్మ‌వారి ఆల‌యం నుండి మేల్‌ఛాట్ వ‌స్త్రం, పూల‌మాల ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ ఆండాళ్ అమ్మ‌వారికి స‌మ‌ర్పిస్తారు. సాయంత్రం 4 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలోని శ్రీ పుండ‌రీక‌వ‌ళ్లి అమ్మ‌వారి ఆల‌యంలో ఏకాంతంగా గోదా ప‌రిణ‌యోత్స‌వం నిర్వ‌హిస్తారు.

జనవరి 16న పార్వేట ఉత్సవం

శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో జ‌న‌వ‌రి 16న పార్వేట ఉత్స‌వం జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారిని, శ్రీ ఆండాళ్ అమ్మ‌వారిని ఆలయంలోని విమాన ప్రాకారంలో ఊరేగించి, క‌ల్యాణ‌మండ‌పంలో ఆస్థానం నిర్వ‌హిస్తారు. అనంత‌రం తిరిగి ఆల‌యానికి చేరుకుంటారు.

Print Friendly, PDF & Email
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *