Kalavaibhavam.com(1-May): అంకాళమ్మ అమ్మవారికి ఏకాంతంగా విశేష పూజలు

అంకాళమ్మ అమ్మవారికి ఏకాంతంగా విశేష పూజలు

శ్రీశైలదేవస్థానం, శ్రీశైలం: లోక కల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత అయిన శ్రీ అంకాళమ్మ అమ్మవారికి ఏకాంతంగా ఈ రోజు (01.05.2020) ఉదయం అభిషేకం, విశేష పూజలను నిర్వహించడం జరిగింది.

ప్రతి శుక్రవారం రోజున శ్రీఅంకాళమ్మ అమ్మవారికి దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) ఈ విశేషపూజ జరిపించబడుతోంది.

ఇందులో భాగంగా ఉదయం గం.6.30లకు శ్రీ అంకాళమ్మ అమ్మవారికి అభిషేకం, విశేష పుష్పాలంకరణ, విశేషపూజలు, కుంకుమార్చనలు నిర్వహించబడుతున్నాయి.

కాగా శ్రీశైల క్షేత్రానికి గ్రామదేవతగా చెప్పబడుతున్న అంకాళమ్మ ఆలయం, ప్రధాన ఆలయానికి ఎదురుగాగల రహదారికి చివరలో కుడివైపున ఉత్తరముఖంగా ఉంది.

ప్రకృతి శక్తుల యొక్క కళలే గ్రామ దేవతలని దేవీ భాగవతంలో చెప్పబడింది. ఈ ప్రకృతి అంతా ఆదిపరాశక్తి స్వరూపమేనని మన ఆర్షవాజ్ఞ్మయం చెబుతోంది. దైవశక్తి సమాజంలో ఏదో కొన్ని వర్గాలకు పరిమితం కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందని తెలియజెప్పే మన విశిష్ట సంస్కృతి యొక్క ఉదాత్త వైఖరికి తార్కాణంగా ఈ గ్రామదేవత ఆరాధనను పేర్కొన్నవచ్చు.

చతుర్భుజాలను కలిగిన ఈ దేవి నాలుగు చేతులలో కుడివైపున క్రింది నుండి పైకి వరుసగా కత్తి, సర్పంలో చుట్టబడిన డమరుకం ఉండగా, ఎడమవైపున పానపాత్ర, త్రిశూలం ఉన్నాయి. కిరీట ముకుటం గల ఈ దేవి వస్త్రాలంకురాలై కర్ణాభరణాలను, కంఠాభరణాలను కలిగి ఉంటుంది.

కాగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతిపూజ జరిపించబడింది. ఆ తరువాత లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు.

అనంతరం పంచామృతాభిషేకం, హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, పుష్పోదకం పూజలను నిర్వహించబడ్డాయి.

ప్రస్తుతం కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఆలయములో దర్శనాలు పూర్తిగా నిలుపుదల చేయబడ్డాయి. అదేవిధంగా లాక్ డౌన్ కూడా అమలు చేయబడుతోంది. కాబట్టి అర్చకస్వాములు భౌతికదూరాన్ని పాటిస్తూ ఏకాంతంగా అంకాళమ్మ అమ్మవారికి విశేషార్చనలు జరిపించారు.

1 thought on “Kalavaibhavam.com(1-May): అంకాళమ్మ అమ్మవారికి ఏకాంతంగా విశేష పూజలు”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *